Urea shortage | గన్నేరువరం, ఆగస్టు 7: రైతులకు యూరియా కొరతను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మండలకేంద్రంలోని రైతు వేదిక వద్ద గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యకుడు గంప వెంకన్న మాట్లాడారు. రాష్ట్రంలో నెల రోజులుగా యూరియా కొరతతో రైతులు రేయనక, పగలనక యూరియా కోసం సొసైటీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరతను తీర్చలేకపోయిందన్నారు.
రైతులకు కావాల్సిన యూరియా అందించుటలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో రైతన్నలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని,కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. రెండు మూడు రోజుల్లో రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని లేనిపక్షంలో రాజీవ్ రహదారి ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
అనంతరం మండల వ్యవసాయ అధికారి కిరణ్మయికి యూరియా కొరత తీర్చాలని వినతి పత్రం అందజేయడానికి వెళ్తే 11 దాటిన కార్యాలయానికి మండల వ్యవసాయ అధికారి రాలేదని మండిపడ్డారు. రైతు వేదిక ముందు అరగంట సమయం వ్యవసాయ అధికారి కోసం ఎదురుచూసి వచ్చిన తర్వాత వినతి పత్రాన్ని అందజేశారు. సమయం దాటిన కార్యాలయానికి ఎందుకు రాలేదని ఏవో కిరణ్మయి కోరగా వర్షం కారణంగా రాలేకపోయామని వివరణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుడెల్లి ఆంజనేయులు, న్యాత సుధాకర్, ప్రభాకర్, నగేష్, మహేందర్ రెడ్డి, సందవేని తిరుపతి, పిట్టల రాములు తదితరులు పాల్గొన్నారు.