కరీంనగర్ కార్పొరేషన్, మే 7 : పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేయాలని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ కోరారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పహల్గాం ఘటన తర్వాత కేంద్రం దేశ భద్రతకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని ఇదివరకే ప్రకటించామని, గతంలో సర్జికల్ ్రైస్టెక్ కూడా తమ పార్టీ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్‌కు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు.
దేశ భద్రతే అన్నింటికన్నా ముఖ్యమన్నారు. పాక్ ప్రతిదాడులను కూడా సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతుందనే నమ్మకం ఉందన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఒక సైనిక్ సూల్ కూడా లేదని, ఏపీలో కోరుకొండ, పులివెందుల, కలికిరిలో ఉన్నాయని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సైనిక్ సూల్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో వరంగల్‌కు సైనిక్ సూల్ మంజూరు చేసినా అనేక షరతులు పెట్టారని, రాష్ట్ర ప్రభుత్వమే సైనిక్ సూల్కు అన్ని ఖర్చులూ భరించాలని చెప్తే కేసీఆర్ నిరసన తెలిపారని చెప్పారు.
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సైనిక్ సూల్ గురించి తాను లేఖ రాశానని, దీనిపై తనను హేళన చేస్తూ మాట్లాడారని పేర్కొన్నారు. బొల్లారంలో సైనిక్ సూల్ వస్తుందని చెప్పారని, కానీ ఇప్పటి వరకు అతీగతి లేదన్నారు. ఏపీలో ఉన్న సైనిక్ సూల్లో తెలంగాణ వారికి ఉన్న రిజర్వేషన్ కోటా ఎత్తేశారని, తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఏపీకి కొత్తగా విజయవాడలో సైనిక్ సూల్ మంజూరైందని, తెలంగాణలో ఒక్కటి కూడా లేకపోవడం దుర్మార్గమన్నారు. దీనిపై కోర్టులను ఆశ్రయించే దిశగా చర్యలు చేపడుతామని స్పష్టం చేశారు.