బీఆర్ఎస్ 25వ వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా ఈ ఏడాదంతా సంబురాలు నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే పార్టీ రజతోత్సవ సభను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని చెప్పారు. ఈ మేరకు ఈ సభకు జన సమీకరణపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు శనివారం కరీంనగర్ వచ్చిన ఆయన, ముందుగా విలేకరులతో మాట్లాడారు.
కరీంనగర్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఏడాదంతా రజతోత్సవ సంబురాలు నిర్వహిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ ఏడాది తమ పార్టీకి చాలా కీలకమైన సంవత్సరం కాబోతున్నదని, తమ పార్టీకి 24 ఏండ్లు నిండి 25వ ఏట అడుగు పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదని అన్నారు. పార్టీ ఆవిర్భావంలో ఎన్నో అవమానాలు, శాపనార్థాలు ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. పదవుల కోసం పార్టీ పెట్టారని అన్నారని, కేసీఆర్, ఆయనతో నడిచిన సహచరులు ఎన్నో అడ్డమైన మాటలు పడాల్సి వచ్చిందన్నారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో పార్టీలు పుట్టాయని, అనతి కాలంలోనే కనుమరుగయ్యాయని, తెలుగు రాష్ర్టాల్లో ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగు దేశమని, తెలంగాణ అస్థిత్వాన్ని, తెలంగాణ భాష, యాస, సంస్కృతిని చాటుతూ కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఏర్పడిన ఈ పార్టీ ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారవచ్చుగానీ, జెండా మారలేదని, ఎజెండా మార లేదని, నాయకుడు మారలేదని, గుర్తు కూడా మారలేదని చెప్పారు. తెలంగాణ ఇంటి పార్టీగా, మన పార్టీగా బీఆర్ఎస్ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిందన్నారు.
ప్రతి సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నట్లుగానే 25 ఏండ్లు నిండుతున్న సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తిలో రజతోత్సవ వేడుకలు నిర్వహించుకోబోతున్నామని తెలిపారు. సభకు వచ్చేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి ఊరి నుంచి, కార్యకర్తల నుంచి విపరీతమైన ఒత్తిడి ఉందని, దాదాపు 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ తమదని, ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే లక్షలాది మందితో సభ నిర్వహిస్తామనే విశ్వాసం తమకు కలుగుతోందని ధీమా వ్యక్తం చేశారు.
ఏడాది పాటు బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాలను నిర్వహించబోతున్నామని, ఈ సందర్భంగా ఉద్యమంలో పాల్గొన్న వారిని ఒక్కతాటిపైకి తేవడం, ఉద్యమ సమయంలో జరిగిన వివిధ కార్యకలాపాలు ప్రజలకు గుర్తు చేసేందుకు కొన్ని కార్యక్రమాలను తీసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. సభ తర్వాత మే నెలలో పార్టీ సభ్యత్వ నమోదు తిరిగి ప్రారంభిస్తున్నామని, ఈసారి పుస్తకాలు కాకుండా యాప్ ద్వారా డిజిటల్ సభ్యత్వ నమోదు చేయబోతున్నామని స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదైన తర్వాత దసరాలోగా గ్రామ, పట్టణ, వార్డు, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీల ఎన్నికలు నిర్వహించబోతున్నామన్నారు. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవికి కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక నిర్వహించబోతున్నామని తెలిపారు. అన్ని జిల్లాల్లో ఉన్న పార్టీ కార్యాలయాల నుంచే ఇక ముందు కార్యకలాపాలు నిర్వహించబోతున్నామన్నారు.
అలాగే, ప్రతి నియోజకవర్గానికి సుశిక్షితులైన 500 మందిని ఎంపిక చేసి పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తామని అన్నారు. పదకొండేళ్లుగా బీజేపీ చేస్తున్న అరాచకం, గత 16 నెలలుగా కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గ పాలనపై ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ సాధించిన విజయాలు, రాష్ర్టాన్ని సాధించిన వైనంపైనా, అందుకు చేసిన పోరాటాలు, త్యాగాలపైనా శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఎలాంటి పాలన అందించింది, మన భాష, సంస్కృతిపైనా గతంలో ఎలాంటి దాడులు జరిగాయనే విషయం, తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పాటు ఎలా జరిగిందనే విషయాలపైనా శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే సమర్థవంతంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
ఎల్ఎండీ, మిడ్‌మానేరులో 7 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయని, తంగళ్లపల్లి వంతెన మీదుగా చూస్తే మిడ్ మానేరు ఎండి ఎడారిలా కనిపిస్తోందని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ఏప్రిల్, మే నెలల్లో చెరువులు మత్తళ్లు దుంకిన విషయాన్ని గుర్తు చేశారు. ఎర్రటి ఎండల్లోనూ అప్పర్ మానేరు నుంచి మంథని వరకు మానేరు ఒక సజీవ జలధారలా కనిపించేదని అన్నారు. వరద కాలువను కోరుట్ల నుంచి హుజూరాబాద్ అవతలి వరకు ఒక సజీవ జల ధారలా మార్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అద్భుతమైన పంటలు పండాయన్నారు.
కేవలం కేసీఆర్‌పై కోపంతో గుడ్డి వ్యతిరేకతతో, మేడిగడ్డ కొట్టుకు పోయిందని ఎన్నికల్లో చిల్లర ప్రచారం చేశారని, ప్రాజెక్టుకు 370 పిల్లర్లు, మూడు బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌస్‌లు, వందల కిలో మీటర్ల సొరంగ మార్గం, ప్రవాహ కాలువలు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును పట్టుకుని ఒక్క పిల్లర్ పర్రె పడినంత మాత్రాన అబద్దపు ప్రచారం చేశారని తెలిపారు. ఆయన దున్నపోతు ఈనింది అంటే ఈయన దుడ్డెను కట్టేయమన్నట్లు, పరిస్థితి ఉందన్నారు.
ఎన్డీఎస్ఏ ఢిల్లీ నుంచి నీళ్లల్ల దిగకుండా, కనీసం కిందికి వెళ్లి చూడకుండా ఏదో అయిపోయిందన్నట్లు 48 గంటల్లో కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందని తెలిపారు. మేడిగడ్డ మీద 48 గంటల్లోనే రిపోర్టు ఇచ్చిన కేంద్రం సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలిపోతే ఒక్క బీజేపీ నాయకుడు ఎందుకు మాట్లాడడం లేదని, ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి పోయి 8 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం దున్నపోతు మీద వాన పడినట్లుగానే ఉందన్నారు. ఎన్డీఎస్ఏ రాదు, రాష్ట్రంలో జరుగుతున్న తప్పులపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.
దీనిని బట్టి కాంగ్రెస్, బీజేపీలు కలిసి కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని, కానీ అది ఎప్పటికీ నెరవేరదని కేటీఆర్ స్పష్టం చేశారు. మేడిగడ్డ పిల్లర్ కుంగి ఇప్పటికి 16,17 నెలలు అవుతోందని, మేడిగడ్డకు దగ్గరలోనే భూకంపం వచ్చిందని, అతి భారీ భూకంపాన్ని తట్టుకొని నిలబడిందని, 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకొని నిలబడిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మరో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, పార్టీ జిల్లాల అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కోరుకంటి చందర్, తోట ఆగయ్య, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, సతీశ్‌కుమార్, దాస రి మనోహర్‌రెడ్డి. పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పాల్గొన్నారు.