రాబోయే ఎన్నికలకు గులాబీ సేన రెడీ అయింది. బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. సోమవారం అధినేత కేసీఆర్ రాష్ట్రంలో 119 సీట్లకు కేవలం నాలుగు మినహా.. 115 సీట్లను ప్రకటించారు. అందులో ఏడు మినహా మొత్తం సిట్టింగులకే పట్టం కట్టారు. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాలకు పది చోట్ల పాత వారికే అవకాశం ఇవ్వగా, వేములవాడ, కోరుట్ల, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో మాత్రం కొత్త వారికి చాన్స్ ఇచ్చారు. మొత్తంగా అభ్యర్థుల ప్రకటనతో ప్రతిపక్షాలకు షాక్ తగలగా, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గులాబీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. సాయంత్రం ఎక్కడికక్కడ సంబురాలు చేసుకున్నాయి.
– కరీంనగర్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిరిసిల్ల : కల్వకుంట్ల తారకరామారావు
ముద్దుపేరు : కేటీఆర్
తల్లిదండ్రులు : కల్వకుంట్ల శోభ, చంద్రశేఖర్‌రావు
పుట్టిన తేదీ : 24 జూలై 1976
భార్య : శైలిమ
పిల్లలు : కొడుకు హిమాన్షు, కూతురు అలేఖ్య
జననం : సిద్దిపేట
చదువు : ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, పూణే (మహారాష్ట్ర), ఎంబీఏ (మార్కెటింగ్ అండ్ ఈ కామర్స్) యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, యూఎస్ఏ
ప్రస్తుత నివాసం : హైదరాబాద్
రాజకీయ అరంగేట్రం : 2006
పదవులు : ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి
రాజకీయ జీవితం
2006 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెన్నంటి నడిచారు. మొదటిసారి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీచేశారు. సమీప ప్రత్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 171 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి 2010 ఉప ఎన్నికల్లో బరిలో నిలిచారు. సమీప ప్రత్యర్ధి కేకే మహేందర్ రెడ్డిపై 68,219 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 జనరల్ ఎన్నికల్లో 53,004 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తిరిగి 2018 ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 89,009 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు.
ధర్మపురి : కొప్పుల ఈశ్వర్
తల్లిదండ్రులు : కొప్పుల లింగయ్య-మల్లమ్మ
పుట్టిన తేదీ : 20 ఏప్రిల్ 1959
స్వస్థలం : కుమ్మరికుంట, జూలపల్లి మండలం, పెద్దపల్లి జిల్లా
భార్య : స్నేహలత, ఎల్ఎమ్ కొప్పుల ట్రస్ట్ అధ్యక్షురాలు
కూతురు, అల్లుడు : నందిని-అనిల్ చదువు : డిగ్రీ (బీఏ)
ఉద్యోగం : 1976లో సింగరేణిలో కోల్‌కట్టర్. కార్మికుల పక్షాన పోరాటం చేస్తూనే రాజకీయాల వైపు మళ్లారు.
రాజకీయ జీవితం
1983లో టీడీపీలో చేరారు. మిడ్‌క్యాప్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1994లో మొదటిసారి మేడారం రిజర్వ్డ్ నియో జకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2001లో బీఆర్ఎస్లో చేరారు. 2004 ఎన్నికల్లో మేడారం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి సమీప టీటీపీ అభ్యర్థి మాల మల్లేశంపై 56,563 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. 2008 తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పార్టీ ఆదేశాల మేరకు పార్టీ శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం నిర్వహించిన ఉపఎన్నికల్లో పోటీచేసి కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి కుమారస్వామిపై 28,137 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2009 సాధారణ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ధర్మపురి నియోజకవర్గం కొత్తగా ఏర్పడి ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో అప్పటి నుంచి ఈ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్నారు. 2009, 2010, 2014, 2018లో వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రిగా ఉన్నారు.
కరీంనగర్ : గంగుల కమలాకర్
తల్లిదండ్రులు : లక్ష్మీనర్సమ్మ, మల్లయ్య
పుట్టిన తేదీ : 8 మే 1968
భార్య : గంగుల రజిత పిల్లలు : కొడుకు హరిహరణ్, కూతురు జాహ్నవి విద్యార్హతలు : బీటెక్ (సివిల్)
రాజకీయ జీవితం
2000 నుంచి 2005 వరకు కరీంనగర్ మున్సిపాలిటీలో కౌన్సిలర్, 2005-09 వరకు కరీంనగర్ నగరపాలకసంస్థ కార్పొరేటర్, 2009-23 వరకు కరీంనగర్ ఎమ్మెల్యేగా విజయాలు అందుకుంటున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 30,450 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తెలంగాణేతర పార్టీలో ఉంటూ అవమానాలు భరించలేమని టీడీపీకి రాజీనామా చేసి 2013 ఏప్రిల్‌లో బీఆర్ఎస్లో చేరారు. 2014లో 24,750 ఓట్ల మెజార్టీ, తిరిగి 2018 ఎన్నికల్లో 14,976 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన తొలి ఎమ్మెల్యేగా రికార్డు సాధించారు. 2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రిగా చేరారు. ఆనాటి నుంచి నేటి వరకు ముఖ్యమంత్రి అనుంగ అనుచరుడిగా ముందుకు సాగుతున్నారు. మానేరు రివర్‌ఫ్రంట్, ఐటీ టవర్స్ సాధన, కేబుల్ బ్రిడ్జి వంటి అభివృద్ధి పనులు సాధించడంలో ఆయన చేసిన కృషిని ప్రతి కార్యకర్తా ప్రశంసిస్తారు.
మానకొండూర్ : రసమయి బాలకిషన్ (ఎరుపుల బాలకిషన్)
తల్లిదండ్రులు : మైసమ్మ, రాజయ్య
పుట్టిన తేదీ : 15 మే 1969 భార్య : రజియా
పిల్లలు : అమిత్, ఆదర్శ్, స్వస్థలం : రావురుక్కుల, సిద్దిపేట
విద్యార్హతలు : ఎంఏ, బీఈడీ, పీహెచ్డీ
అదనపు అర్హతలు : సింగర్, రైటర్, ఆర్టిస్ట్, తెలంగాణ ధూం ధాం వ్యవస్థాపకుడు
రాజకీయ జీవితం
2001 నుంచి తెలంగాణ ధూంధాం ఫౌండేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన, అంతకు ముందు గళమెత్తి పాడి తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. 2014లో మొదటిసారి మానకొండూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2015లో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్‌గా నియమితులయ్యారు. గతంలో రాజకీయ అనుభవం లేకున్నా ఆయన పరిణతి చెందిన నాయకుడిలా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో సఫలీకృతుడయ్యారు. కలుపుగోలుతనంతో స్థానికేతరుడనే ముద్రను తొలగించుకున్నారు. 2018లో మానకొండూర్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2021లో సాంస్కృతిక సారథి చైర్మన్‌గా రెండోసారి నియామకమయ్యారు.
పెద్దపల్లి : దాసరి మనోహర్‌రెడ్డి
తల్లిదండ్రులు : మధురమ్మ, రాంరెడ్డి
పుట్టిన తేదీ : 25 ఫిబ్రవరి 1954
భార్య : పుష్పలత, సంతానం : ప్రశాంత్‌రెడ్డి
కోడలు : మమతారెడ్డి, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్
స్వగ్రామం : కాసులపల్లి గ్రామం, పెద్దపల్లి మండలం, పెద్దపల్లి జిల్లా
చదువు : సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో పాఠశాల విద్య, సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, మంచిర్యాలలో డిగ్రీ, 1978లో నాగార్జున యూనివర్సిటీలో బీఈడీ, 1980లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఎంఏ(ఎకనామిక్స్) చదివారు.
అభిరుచులు : సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం.
కుటుంబ నేపథ్యం : వ్యవసాయ కుటుంబం. మనోహర్‌రెడ్డి ఉన్నత విద్య చదివి ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. ఆ తర్వాత పెద్దపల్లిలో ట్రినిటీ విద్యా సంస్థలను స్థాపించారు. ప్రస్తుతం కొడుకు ప్రశాంత్‌రెడ్డి పూర్తిగా విద్యా సంస్థలను చూస్తున్నారు.
రాజకీయ జీవితం
2010లో టీఆర్ఎస్ పార్టీలో చేరి, రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2012 డిసెంబర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవరిస్తున్నారు. 2014 శాసనసభా ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి బరిలోదిగి, కాంగ్రెస్ అభ్యర్థిపై 62,677 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జిల్లాలోనే అత్యధిక మోజార్టీ సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. తిరిగి 2018 ఎన్నికల్లో రెండోసారి బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి విజయరమణారావుపై 8,466 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించింది మనోహర్‌రెడ్డి మాత్రమే. ఆయన, 2018 నుంచి శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా కొనసాగుతున్నారు.
చొప్పదండి : సుంకె రవిశంకర్
తల్లి దండ్రులు : రాజమ్మ, రాఘవులు..
పుట్టిన తేదీ : 30 జూన్ 1970
భార్య : దీవెన, పిల్లలు : జాహ్నవి, అక్షిత, దీక్షిత్
జన్మస్థలం : నారాయణపూర్, గంగాధర మండలం
కులం : ఎస్సీ (మాదిగ),విద్యార్హతలు : బీఏ
రాజకీయ జీవితం
ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా, ప్రభుత్వ ఆమోదిత పాఠశాల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2007 నుంచి 09 వరకు ప్రజారాజ్యం పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జిగా, మానకొండూర్, పెద్దపల్లి కమిటీల ఏర్పాటు ఇన్చార్జిగా కొనసాగారు. 2009 డిసెంబర్లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. 2018లో చొప్పదండి నియోజకవర్గ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. బీఆర్ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.
హుజూరాబాద్ : పాడి కౌశిక్‌రెడ్డి
తల్లిదండ్రులు : శైలజ, సాయినాథ్‌రెడ్డి
పుట్టిన తేదీ : 21 డిసెంబర్ 1984 భార్య : శాలిని రెడ్డి
కూతురు : శ్రీనికరెడ్డి విద్యార్హతలు : బీకాం, ఎంబీఏ
స్వగ్రామం : వీణవంక హాబీ : క్రికెట్ అంటే అమితాసక్తి. రంజి క్రికెటర్‌గా ఆడారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడారు.
రాజకీయం జీవితం
కౌశిక్‌రెడ్డి తండ్రి సాయినాథ్‌రెడ్డి 2001నుంచి బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల భూమిక పోషించారు. క్రికెట్‌పై ఆసక్తి ఉన్న కౌశిక్‌రెడ్డి, తర్వాత రాజకీయాలవైపు మళ్లారు. 2009లో కాంగ్రెస్‌లో చేరి, యువనేతగా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ముందుకుసాగారు. 2018లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా 60 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 2021 జూలై 21న బీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో 2021 డిసెంబర్ 2న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 మార్చి 4న మండలి విప్‌గా నియమితులయ్యారు. 2023 ఏప్రిల్ 19 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి 100కోట్ల నిధులు తీసుకువచ్చారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నిత్యం ప్రజల్లో ఉంటూ.. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అలాగే, బీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం అనుక్షణం పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధిని సమీక్షిస్తూ.. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు.
జగిత్యాల : డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్
తల్లిదండ్రులు : వత్సల – హన్మంత రావు
పుట్టిన తేదీ : 6 జూలై 1962
భార్య : రాధిక
కూతురు : హాసిక (వివాహిత)
స్వగ్రామం : అంతర్గాం, జగిత్యాల మండలం
చదువు : ఎంఎస్ ఆప్తమాలజీ
వృత్తి : నేత్ర వైద్య నిపుణుడు
కుటుంబ నేపథ్యం : జగిత్యాల మండలం అంతర్గాంకు చెందిన న్యాయవాది హన్మంతరావు కొడుకు సంజయ్. ప్రాథమిక, ఇంటర్మీడియెట్ విద్యను జగిత్యాల పురాతన ఉన్నత పాఠశాల, ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు. విజయవాడలోని సిద్దార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. కర్ణాటకలోని దావెన్గేరేలో ఎంఎస్ ఆప్తమాలజీ పూర్తిచేశారు. మెట్పల్లిలో మొదట నేత్రవైద్య వైద్యశాలను స్థాపించారు. 1998లో తన ప్రాక్టీస్‌ను జగిత్యాలకు మార్చారు. పలు స్వచ్ఛంద సంస్థల్లో కీలకపాత్ర పోషించారు. జగిత్యాల రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా పనిచేశారు. మూడు సార్లు ఐఎంఏ జగిత్యాల శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆపీ స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 15 వేలకు పైగా ఉచిత నేత్రశస్త్ర చికిత్సలు నిర్వహించారు.
రాజకీయ నేపథ్యం
డాక్టర్ సంజయ్‌కుమార్ 2014 మార్చిలో బీఆర్ఎస్లో చేరారు. జగిత్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. 2018లో మరోసారి జగిత్యాల నుంచి పోటీ చేసి, 60 వేల మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటివెలుగు పథకం రూపకల్పన సందర్భంలోనూ సంజయ్‌కుమార్ కీలకంగా వ్యవహరించారు.
రామగుండం : కోరుకంటి చందర్
పూర్తి పేరు: కోరుకంటి చందర్
తల్లిదండ్రులు : మల్లయ్య-లక్ష్మి
పుట్టిన తేదీ : 23 సెప్టెంబర్ 1973
స్వస్థలం : గోదావరిఖని,
విద్యాభ్యాసం : ఎంఏ పొలిటికల్ సైన్స్
సాజిక వర్గం : మున్నూరుకాపు
జీవిత భాగస్వామి : కీ.శే.కోరుకంటి విజయ (మరణం 2018)
సంతానం : కూతురు ఉజ్వల, కొడుకు మణిదీప్
రాజకీయ నేపథ్యం
1993 నుంచి 1997 వరకు గోదావరిఖని, 1997-99 వరకు రామగుండం తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా, అలాగే కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2001లో బీఆర్ఎస్లో చేరారు. 2002లో బీఆర్ఎస్వీ సంయుక్త కార్యదర్శిగా, మంచిర్యాల శాసన సభా నియోజకవర్గం బీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా రామగుండం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసి 2,260 ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చూశారు. 2018 శాసన సభా ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేసి, 26,090 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019లో బీఆర్ఎస్లో చేరారు. రాష్ట్ర శాసన సభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా కొనసాగారు. 2021 నుంచి బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
మంథని: పుట్ట మధూకర్
తల్లిదండ్రులు : పుట్ట లింగమ్మ, రాజలింగు, పుట్టిన తేదీ : 1 ఏప్రిల్ 1972
భార్య : పుట్ట శైలజ (మంథని మున్సిపల్ చైర్ పర్సన్)
కొడుకు : పుట్ట శ్రీహర్ష (ఇంజినీరింగ్), కూతురు/అల్లుడు : మౌమిత-అక్షయ్‌కుమార్ (ఐపీఎస్)
జన్మస్థలం : మంథని , సామాజికవర్గం : మున్నూరుకాపు (బీసీ), చదువు : ఇంటర్
సోదరులు : ముగ్గురు. సోదరీమణులు : ఐదుగురు
అభిరుచులు : 2011 ఏప్రిల్ 19న తన తల్లి పుట్ట లింగమ్మ పేరు మీద చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు. సామాజిక సేవా కార్యక్రమాలు
రాజకీయ జీవితం
ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. 2001 నుంచి 2006 వరకు మంథని ఎంపీపీగా పనిచేశారు. 2006 నుంచి 2011 వరకు మంథని జడ్పీటీసీగా పనిచేశారు. 2009 మంథని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 మార్చి 17న బీఆర్ఎస్లో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్‌బాబుపై 16 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధిచారు. ఆ తర్వాత తిరిగి 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్‌బాబు చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో పుట్ట మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కోరుట్ల : డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల
తల్లి దండ్రులు : కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు (ప్రస్తుత ఎమ్మెల్యే)-సరోజన
పుట్టిన తేదీ : 18 అక్టోబర్ 1976
స్వగ్రామం : రాఘవపేట (మల్లాపూర్ మండలం)
నివాసం : మెట్పల్లి, హైదరాబాద్
వృత్తి : డాక్టర్ (స్పెషలిస్ట్ ఇన్ స్పైన్ సర్జరీ)
విద్యార్హత : ఎంఎస్ (ఆర్థోపెడిక్), సౌత్ కొరియాలో ఫెలోషిప్ (స్పైన్ సర్జన్ క్రిష్టియన్ మెడికల్ కాలేజీ)
భార్య : దీప్తి
సంతానం : కొడుకు ఆరుష్, కుమార్తె సాషా
వైద్యసేవలు : సింగపూర్‌తోపాటు కరీంనగర్‌లోని చల్మెడ హాస్పిటల్లో పనిచేశారు. ప్రస్తుతం యశోద హాస్పిటల్ (సికింద్రాబాద్)లో ప్రముఖ స్పైన్కాడ్ సర్జన్‌గా పనిచేస్తున్నారు.
ప్రవృత్తి : డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మొదటి నుంచి ప్రజాసేవలో ఉన్నారు. కరీంనగర్, హైదరాబాద్‌లాంటి పట్టణాల్లో ప్రముఖ వైద్యుడిగా సేవలు అందిస్తూనే స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మెట్పల్లి, కోరుట్ల ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణాల్లో పలు స్వచ్ఛంద సేవా కార్యాక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టిన రౌండ్‌టేబుల్ ఇండియా సంస్థలో సభ్యుడిగా ఉన్నారు. ఆ సంస్థ తరఫున మల్లాపూర్, కోరుట్ల మండలాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా జోగినిపెల్లి, రాఘవపేట గ్రామాల్లో రూ.కోటి చొప్పున వెచ్చించి ప్రభుత్వ పాఠశాల భవనాలను నిర్మించారు. హైదరాబాద్‌కు చెందిన పలు వైద్య సంస్థల ప్రతినిధులతో కలిసి మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో మెగా వైద్యశిబిరాలు ఏర్పాటు చేయడంతోపాటు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించారు. గతేడాది కోరుట్ల పట్టణంలో గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న యువత కోసం, ఉచితంగా రెండు నెలలపాటు అకాడమీ నిర్వహించారు. ఉచితంగా భోజన సదుపాయం కల్పించారు. ఇటీవలే యువతకు కోరుట్లలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి, పలు కంపెనీల్లో వారికి ఉద్యోగావకాశాలు కల్పించారు.
హుస్నాబాద్ : వొడితల సతీశ్‌కుమార్
తండ్రి : కెప్టెన్ లక్ష్మీకాంతారావు (మాజీ రాజ్యసభ సభ్యుడు) పుట్టిన తేదీ : 30 సెప్టెంబర్ 1965, విద్యార్హతలు : ఎంటెక్ (డిజైన్ ఇంజినీరింగ్)
భార్య : డాక్టర్ సమిత (అసిస్టెంట్ ప్రొఫెసర్)
పిల్లలు : కొడుకు ఇంద్రనీల్ (ఎంఎస్, యూఎస్ఏ), కూతురు పూజిత (మెడిసిన్)
రాజకీయం జీవితం
సౌమ్యుడిగా పేరున్న సతీశ్‌కుమార్ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్లో 2001 నుంచి ఉన్నారు. పార్టీ చేపట్టిన ఉద్యమాల్లో తన తండ్రి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు మార్గదర్శకత్వంలో పనిచేశారు. 1995 నుంచి 2001 వరకు సింగాపూర్ సర్పంచ్‌గా, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు సభ్యుడిగానూ పనిచేశారు. 2002లో పార్టీ మండలాధ్యక్షుడిగా, 2005 నుంచి 12 వరకు సింగిల్‌విండో చైర్మన్‌గా పనిచేశారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2018లోనూ మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీలో ప్రతి కార్యకర్తతో సన్నిహితంగా ఉంటూ, జనంతో మమేకమయ్యారు.
వేములవాడ : చల్మెడ లక్ష్మీనర్సింహారావు
తల్లిదండ్రులు : ఆనందరావు, జానకీదేవి,
భార్య : సునీల, పిల్లలు : కూతుళ్లు నిహారిక, నివేదిత
పుట్టిన తేదీ : 23 ఏప్రిల్ 1962
పుట్టిన ఊరు : మల్కపేట (కోనరావుపేట మండలం)
ప్రస్తుత నివాసం : కరీంనగర్ విద్యార్హతలు : బీఈ, ఎంబీఏ
ప్రస్తుతం : చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు
రాజకీయ జీవితం
చల్మెడ లక్ష్మీనర్సింహారావు కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నది. ఆయన తండ్రి ఆనందరావు ఎన్టీఆర్ హయాంలోనే న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1985లో ఆనందరావు టీడీపీ నుంచి కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేయగా, అదే సమయంలో లక్ష్మీనర్సింహారావు రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా జీవితం ఆరంభించి అంచలంచెలుగా ఎదిగారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగారు. 2009, 2014లో కరీంగనర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2021 డిసెంబర్ 6న కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి డిసెంబర్ 8న బీఆర్ఎస్లో చేరారు. మరోవైపు సేవా కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. చల్మెడ వైద్య కళాశాల ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఆలిండియా వెలమ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండు సార్లు పనిచేశారు. తల్లి జానకమ్మ పేరిట ఇరుకుల్లలో బాలుర హాస్టల్, వృద్ధుల ఆశ్రమ నిర్మాణాలకు చేయూత నిచ్చారు.