బాలికకు న్యాయం చేయాలని, పోక్సో కేసులో తొమ్మిదిరోజులుగా కొడుకు భగీరథ్‌ను కాపాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కేబినేట్ నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ దండు డిమాండ్ చేసింది. సోమవారం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో నిరసనలు తెలిపింది. జిల్లాకేంద్రాల్లో భారీ ఫ్లెక్సీలు, ప్లకార్డులు చేతబూని ర్యాలీలు తీసింది. ధర్నాలు, రాస్తారోకోలు చేసింది. ‘విలువలు లేని బండి సంజయ్ బేషరతుగా రాజీనామా చెయ్? బాలికకు న్యాయం జరిగేదాకా ఊరుకోదు తెలంగాణ సమాజం’ అనే నినాదాలతో హోరెత్తించింది.

కరీంనగర్ కార్పొరేషన్, మే 18: పోక్సో కేసులో కొడుకును కాపాడే ప్రయత్నం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. భగరథ్ చేతిలో మోసపోయిన బాలికకు న్యాయం చేయాలని చేసేదాకా తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో శాంతియుతంగా నిరసనలు తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణచౌక్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అక్బర్‌హుస్సేన్, పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణేది? విలువలు లేని బండి సంజయ్ బేషరతుగా రాజీనామా చెయ్? బాలికకు న్యాయం జరిగేదాకా తెలంగాణ సమాజం ఊరుకోదు’ అనే నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఫ్లెక్సీ దహనం చేసేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకొని, బలవంతంగా లాకున్నారు. పోలీసులకు, నాయకుల మధ్య తోపులాట జరిగింది. తర్వాత నిరసనగా ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలోని పల్లెమీద చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు.
మాజీ ఎమ్మెల్యే రసమయి హాజరై నిరసన తెలిపారు. గంగాధర మండలంలోని మధురానగర్ చౌరస్తాలో కరీంనగర్, జగిత్యాల జాతీయ రహదారిపై ధర్నా చేయగా, మాజీ ఎమ్మెల్యే సుంకె హాజరయ్యారు. హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. రోడ్డుపై భైఠాయించి, కాంగ్రెస్ సర్కార్‌తోపాటు బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంజయ్ ఫ్లెక్సీని దహనం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. సిరిసిల్లలో భారీ ఫ్లెక్సీతో రాస్తారోకో చేశారు. వేములవాడలోని తెలంగాణ చౌక్‌లో ధర్నా చేశారు. దాదాపు వంద మంది కార్యకర్తలు గంట పాటు అక్కడే బైఠాయించారు. బండి సంజయ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏమాత్రం నైతికత ఉన్నా కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

బాలికకు న్యాయం జరిగేదాకా ఊరుకోం
బండి సంజయ్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండే అర్హత లేదు. ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మేం శాంతియుతంగా నిరసన చేపడితే బీజేపీ గూండాగిరి చేయడం సిగ్గుచేటు. దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నం. బీఆర్ఎస్ బలం, బలగం తెలుసు. మేం కూడా దాడులకు దిగితే బీజేపీ నాయకులు బయట తిరుగుతరా? మొన్న కరీంనగర్లో, నేడు సిరిసిల్లలో బీజేపీ నాయకుల తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నరు. మీరు చేసే మోసాలు, అరాచకాలు, దాడులు, బెదిరింపులను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు చూస్తున్నరు. బండికి ప్రజలే పాతరపెట్టే రోజులు వస్తయి. బాధిత బాలికకు న్యాయం జరిగేదాకా ఊరుకోం. నిందితుడికి శిక్ష పడేవరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది.
– సిరిసిల్లలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
మాటల్లో కాదు.. చేతల్లో చూపాలి
కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ తన కొడుకును కాపాడుకునేందుకు అనేక విధాలా ప్రయత్నాలు చేసిండు. రేవంత్‌రెడ్డితో కలిసి భగీరథ్‌కు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసిండు. బాలిక కేసు విషయంలో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు అనేక ఎత్తులు వేసిండు. పోక్సో కేసు నమోదైన వారం తర్వాత భగీరథ్‌ను అరెస్ట్ చేయడం చూస్తేనే మనకు అర్థమవుతుంది. సంజయ్ మంత్రి పదవిలో ఉంటే బాలికకు న్యాయం జరగకుండా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అందుకే కేంద్ర మంత్రివర్గం నుంచి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలి. ప్రధాని మోదీ ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అని మాట్లాడుతుంటే వీళ్లు మాత్రం ‘బేటీ కో ఉటావో.. బేటీకో నాశ్కరో’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నరు. ధర్మం, దేశం అని మాటల్లో కాదు, చేతల్లో చూపాలి. వెంటనే సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలి.
– కరీంనగర్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు