సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): వినాయకుడి లడ్డూను ప్రసాదంగా పంచి.. అమాయక ప్రజలను అధిక లాభాల పేరుతో రూ.33కోట్లు వసూలు చేసి, మోసగించిన కొండపల్లి గణేష్ అలియాస్ బంగార్ రాజును ఈఒడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… మైహోమ్ బుజాలోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని నివాసమున్న కొండపల్లి గణేష్ అలియాస్ బంగార్రాజు వినాయక చవితి వేడుకల్లో లడ్డూను వేలంపాటలో దక్కించుకుంటాడు.
ఈ విధంగా దక్కించుకున్న లడ్డూను సదరు అపార్ట్మెంట్లో నివాసం ఉండేవారందరికీ ప్రసాదంగా పంచుతూ తన పరిచయాలను పెంచుకుంటాడు. ఈ క్రమంలో 2025లో గణేష్‌కు మొదట ఇద్దరు దంపతులు పరిచయమయ్యారు. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు తనకు లిక్కర్, రియల్ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయని, తన వ్యాపారంలో పెట్టుబడులు పెడితే ప్రతి నెలా వచ్చిన ఆదాయంపై 6 శాతం లాభాలను చెల్లిస్తానని నమ్మబలికాడు. దీంతో సదరు జంట 2025 అక్టోబర్‌లో రూ.39లక్షలు పెట్టుబడి పెట్టి, నెల రోజుల తరువాత లాభాలు ఇవ్వాలని అడిగారు.
దీంతో ఇవాళ, రేపు అంటూ కాలం వెళ్లదీయడంతో అనుమానం వచ్చిన బాధితులు నిందితుడు నివాసం ఉండే ఫ్లాట్‌కు వెళ్లి చూడగా అతడు ఫ్లాట్ ఖాళీచేసినట్లు తెలిసింది. అయితే నిందితుడు మైహోమ్ బుజాలో నివాసం ఉండే మరికొంత మందితో పాటు మొత్తం 130మంది నుంచి రూ. 33కోట్ల వరకు వసూలు చేసి, మోసగించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బాధితులు గత జూలైలో సైబరాబాద్ ఈఒడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్టు చేశారు.