యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిషేధిత భూములపై రాజకీయ గద్దలు వాలుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ’22-ఏ’ జాబితాలో ఉన్న ఆస్తులను మింగేస్తున్నాయి. వారు ప్రభుత్వ భూములకే పరిమితం కావడం లేదు. సిట్, ఈడీ, ఐటీ కేసులున్నా లెక్క చేయకుండా, హస్తగతం చేసుకొనేందుకు కుయుక్తులు పన్నుతున్నాయి. ఇందుకు యాదాద్రి-భువనగిరి జిల్లా ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. జిల్లాలోని సుమారు రూ.100 కోట్ల విలువైన భూములపై బడాబాబుల కన్నుపడింది. వాటిని చేజిక్కించుకొనేందుకు అస్త్రశస్ర్తాలు ప్రయోగిస్తున్నారు. ఇందుకు సంబంధించి అధికారుల తప్పిదం బయటకు రావడంతో కప్పిపుచ్చుకొనేందుకు పాట్లు పడుతున్నారు.
యాదాద్రి-భువనగిరి జిల్లాలో గతంలో గ్యాంగ్స్టర్ నయీం కొందరి వద్ద నుంచి బలవంతంగా భూములు గుంజుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నయీం ఎన్కౌంటర్ తర్వాత సదరు భూములను సిట్ కేసులో పొందుపరిచారు. అప్పటి నుంచి అవి నిషేధిత జాబితాలోనే కొనసాగుతున్నాయి. సంబంధిత అధికారుల నుంచి ఎన్వోసీ మంజూరైతేనే 22-ఏ జాబితాలో నుంచి తొలగించడానికి అవకాశం ఉంటుంది. చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్పేటలో 12,13,14 సర్వేనంబర్లలో సుమారు 45 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. వీటిపై నయీం సిట్ కేసుతోపాటు, ఈడీ, ఐటీ కేసులు ఉండటంతో పీవోబీలో పెట్టారు. గతంలో ఆ భూములను రైతుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు జీపీఏ చేసుకొన్నారు. ఆ తర్వాత పహాణీల్లో రైతుల పేర్లే రావడంతో మరోసారి పాస్ బుక్లు తీసుకొన్నారు. అనంతరం నయీం వారిని బెదిరించి, ఆ భూములను గుంజుకొన్నాడని చెప్తున్నారు. నయీం మరణానంతరం వాటిని నిషేధిత జాబితాలో పెట్టారు.
ఇటీవల ప్రభుత్వం వేసిన 22-ఏ జాబితా భూ యజమానుల పాలిట శాపంగా మారగా, అక్రమార్కులు, దళారులు, వ్యాపారులకు అవకాశంగా మారింది. ప్రభుత్వం కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. సందట్లో సడేమియా మాదిరిగా.. కాంగ్రెస్ పెద్దలతోపాటు రియల్ వ్యాపారుల కన్ను తూప్రాన్పేటలోని ఆ భూములపై పడింది. 45 ఎకరాలను 22-ఏ జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో వెంచర్ చేసినవారే, ఇప్పుడు ప్రభుత్వ పెద్దల సహకారంతో క్లియరెన్స్ తెచ్చుకొనేందుకు యత్నించినట్టు తెలుస్తున్నది.
అధికార బలంతో సీసీఎల్ఏ నుంచి తతంగం నడిపించినట్టు సమాచారం. సీసీఎల్ఏలో హియరింగ్ నిర్వహించి 40 ఎకరాలకు ఎన్వోసీ వచ్చిందని విశ్వసనీయంగా తెలిసింది. దీనిని ఆసరాగా చేసుకొని మిగతా భూమిని కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించినట్టు ప్రచారం జరుగుతున్నది. భూముల్లో ప్లాట్లు చేసినా, ఇంకా వ్యవసాయ భూములుగానే చూపిస్తుండటంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది లోతుగా పరిశీలించారట. దీంతో ఈ 45 ఎకరాలపై ఈడీ, ఐటీ కేసులు ఉన్నట్టు తేలింది. ఈ భూములు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి దగ్గరలో ఉండటంతో భారీ డిమాండ్ ఉన్నది. ఎకరా సుమారు రూ.2కోట్ల నుంచి 2.5 కోట్ల వరకు పలుకుతున్నట్టు సమాచారం. అంటే సుమారు రూ.100 కోట్ల విలువైన ఆ భూములను కొల్లగొట్టేందుకు ప్లాన్ వేసినట్టు ప్రచారం జరుగుతున్నది.
హైదరాబాద్కు సమీపంలో ఉండటంతో యాదాద్రి-భువనగిరి జిల్లాలోని భూములకు భారీగా డిమాండ్ ఉన్నది. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన కొందరు జిల్లాపై ఫోకస్ పెట్టి, అందినకాడికి దోచుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా వివాదాస్పద భూములు ఎక్కడెక్కడ ఉన్నాయోనని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే తూప్రాన్పేటలో ని ఆ భూములపై పక్కా ప్లాన్ ప్రకారం నజర్ పెట్టినట్టు సమాచారం. ఇందులో ముఖ్యనేత సోదరుడి ప్రమేయం ఉన్నట్టు జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. వాటాలు ఫిక్స్ చేసుకొన్న తర్వాతే రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇవేకాకుండా పీవోబీలోని మరికొన్ని భూములను కూడా తొలగించారనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
అధికార వర్గాలు చెప్తున్నట్టు 45 ఎకరాల్లో 40 ఎకరాలకు ఎన్వోసీ వస్తే, మిగతా 5 ఎకరాలను ఎందుకు పీవోబీ జాబితా నుంచి తొలగించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ తతంగంలో రెవెన్యూ అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. శనివారం నాటికి 45 ఎకరాలను 22-ఏ జాబితా నుంచి తొలగించిన అధికారులు, ఉన్నపళంగా తప్పును సరిదిద్దుకొనే ప్రయత్నాలు మొదలు పెట్టారట. సర్వేనంబర్ 13/ఇ/1, 14/అ/1 లోని సుమారు 5 ఎకరాలు శనివారం వరకు పీవోబీలో లేవు. కానీ, ఆదివారం వాటిని మళ్లీ పీవోబీలో చేర్చారు. దీనికి సంబంధించి వెబ్సైట్లో వివరాలను అప్లోడ్ చేశారు. అంటే మిగతా 40 ఎకరాలకు క్లియరెన్స్ ఇచ్చినట్టు అర్థమవుతున్నది. మరి ఆ 40 ఎకరాలకు మాత్రమే ఎన్వోసీ వస్తే, 5 ఎకరాలను ఎందుకు నిషేధిత జాబితా నుంచి తొలగించారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. ఇదే విషయంపై చౌటుప్పల్ తహసీల్దార్ మీరాబాయికి ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసు ఇచ్చి, అంతర్గత విచారణ జరుపుతున్నట్టు సమాచారం.