వందేమాతరం.. దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చిన నినాదం. అఖండ భారతావని అద్భుత సౌందర్యానికీ, సార్వభౌమాధికారానికీ ప్రతీకగా నిలిచిన పదబంధం. గణతంత్ర భారతానికి పెట్టని కిరీటంలా వెలుగొందుతున్న జాతీయ గేయం. అందులో మనకు తెలిసిన రెండు చరణాలే కాదు, మిగతా నాలుగూ అద్భుతాలే. వాటికి దేశవ్యాప్త గుర్తింపు తెచ్చేందుకు కూచిపూడి నృత్యాన్ని సాధనంగా చేసుకుంది హైదరాబాద్‌కు చెందిన ‘అక్షర దేవళ్ల’. భరతమాత రక్షణ కోసం అత్యధికంగా నెత్తురోడిన హిమగిరుల్లోని కార్గిల్, పహల్గామ్, పుల్వామాల్లో… మువ్వన్నెల దుస్తుల్లో నాట్యమాడింది. రక్తం గడ్డకట్టే మంచులో ప్రాణాలను లెక్కచేయకుండా చేసిన ఈ నృత్యం అక్కడ అసువులు బాసిన సైనికులకు తానిచ్చే నివాళి… అని చెప్పే ఆమెతో జిందగీ ముచ్చటించింది. అంతేకాదు… అంధ, బధిర, ఆటిజం పిల్లలతోనూ ఈ నృత్యాన్ని చేయిస్తున్న పదిహేనేండ్ల ఈ చిన్నారి స్ఫూర్తిదాయక ప్రయాణం ఆమె మాటల్లో…
దేశభక్తి అంటే ఏంటో, భద్రత అనేది ఎంత సంక్లిష్టమైన విషయమో మనం దేశ సరిహద్దుల్లోకి వెళ్లినప్పుడే తెలుస్తుంది. నిరంతరం శత్రుమూకల కదలికలు ఉండే ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించి పహారా కాసే సైనికులను చూసినప్పుడు గుండె తెలియని ఉద్వేగానికి లోనవుతుంది. దీన్ని నేను కశ్మీర్ వెళ్లినప్పుడు అనుభవించా. నిజానికి అక్కడికి వెళ్లింది వందేమాతరం పూర్తి గేయాన్ని దేశమంతటికీ పరిచయం చేయాలన్న తపనతోనే. ఎందుకంటే మన భద్రత కోసం నిరంతరం నెత్తురోడే నేల అది. అక్కడ నేను చేసే నృత్యం పోరాడిన వారికి నివాళిగా ఉండటంతో పాటు నలుగురి దృష్టినీ ఆకట్టుకుంటుందనీ, తద్వారా ఈ పాట అందరికీ తెలుస్తుందనీ అనుకున్నా.
ముందు నాకు వందేమాతరం గీతం మీద ప్రేమ ఎప్పుడు ఏర్పడిందో చెబుతాను. నేను హైదరాబాద్ భారతీయ విద్యా భవన్ స్కూల్లో పదకొండో తరగతి చదువుతున్నా. పోయినేడాది మా పాఠశాలలో బంకించంద్ర చటోపాధ్యాయ, ఆనంద మఠ్ పుస్తకంలో రాసిన ఈ ఆరు చరణాలను విన్నాను. అవి ఎంతో అద్భుతంగా అనిపించాయి. నాకు కూచిపూడి అంటే ప్రాణం. అమ్మ భావన పెదప్రోలు కూచిపూడి గురువు. దాంతో చిన్ననాటి నుంచీ ఆమె దగ్గరే నాట్య శిక్షణ తీసుకున్నా. అలా నన్నెంతో ఆకట్టుకున్న వందేమాతరం గేయానికీ డ్యాన్స్ నేర్చుకున్నా. ఇంకా ఈ పాట మీద ప్రేమ పెరిగిన మరో సందర్భం ఏమిటంటే నేను కోల్‌కతాలోని బంకించంద్ర చటోపాధ్యాయ నివసించిన ఇల్లు చూసేందుకు వెళ్లాను.
అక్కడే ఆయన ఆనంద మఠ్ పుస్తకం రాశారు. తొలిసారి రవీంద్రనాథ్ ఠాగోర్ దాన్ని పాడిందీ అక్కడే. అది మొదలు దేశంలో ఏ విముక్తి పోరాటంలో అయినా ఆ పాట వినిపించాల్సిందే అన్నంతగా జనంలో ప్రాచుర్యం పొందింది. వందేమాతరం అన్న పదమే ఓ ఉద్యమ నినాదం అయింది…. ఈ విషయాలన్నీ నేను కోల్‌కతా వెళ్లాకే బాగా తెలుసుకున్నా. అప్పుడే అనిపించింది… ఈ గేయం అందరిదీ, అందరికీ చేరాలి అని. ఆ సంకల్పంతోనే వందేమాతరం పాటకు నృత్యాన్ని అభినయించడం అన్నది మార్గంగా ఎంచుకున్నా. వందేమాతరం చరిత్రను కూడా వీడియోగా తీసి యూట్యూబ్‌లో పెట్టా. నా యూట్యూబ్ చానెల్ పేరు జాబిల్లి కబుర్లు.

కార్గిల్‌కి వెళ్లినప్పుడు అక్కడ కొండంతా మంచుతో నిండిపోయి ఉంది. అడుగు వేస్తేనే జారే పరిస్థితి. మంచు తగలగానే చర్మం మొద్దుబారిపోతున్నది. అక్కడ డ్యాన్స్ చేయాలనుకోవడం కష్టమైన పనే అని వెళ్లాక తెలిసింది. కాలు కింద పెడితే స్పర్శ తెలియలేదు. అప్పుడనిపించింది మూడు నిమిషాల పాటకు నేను ఇక్కడ నృత్యం చేయలేకపోతే రాత్రీ పగలూ లేకుండా కాపలా కాస్తున్న వాళ్లు, దేశం కోసం ప్రాణాలు విడిచిన వాళ్ల సంగతేంటి అని! అందుకే అక్కడి సైనికులకు నివాళిగా నేను చెప్పులు తీసేసి నృత్యం చేశాను. ఇక్కడ మరో విషయం.. ఇది చాలా సెన్సిటివ్ ఏరియా. విపరీతంగా గస్తీ ఉంటుంది. అలాంటి చోట మువ్వన్నెల జెండా రంగులు వేసుకుని తిరగడం, నృత్యం చేయడం అంటే… ఒక దశలో చాలా భయమేసింది. ‘కాలిస్తే కాలుస్తారు… ఏం కాదు నువ్ చెయ్. దేశం కోసం చస్తాం… అంతేగా, ఫర్వాలేదు’ అని నాన్న అన్నారు. ఆయనిచ్చిన ధైర్యంతోనే కశ్మీర్‌లోని సెన్సిటివ్ ప్రాంతాల్లో డ్యాన్స్ చేయగలిగా. అన్నట్టు నాన్న పేరు సతీష్ దేవళ్ల. ఆయన జర్నలిస్టు.

అనాథ శరణాలయాలకు వెళ్లి కూచిపూడి నేర్పడం నాకు చిన్నప్పటి నుంచీ అలవాటు. కూచిపూడిలో భామాకలాపం రెండున్నర గంటలు ప్రదర్శించి, అతిపిన్న వయసులో ఈ రూపకం సమర్పించిన వ్యక్తిగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లాంటివి అయిదింటిలో పేరు కూడా ఉంది. అయితే సమాజంలో అనాదరణకు గురయ్యే దివ్యాంగ పిల్లలకు ఈ వందేమాతరం గీతం గురించి ఎలా తెలుస్తుంది అన్న ఆలోచన వచ్చింది. అప్పుడే నేను ఇక్కడి దేవనార్ స్కూల్ ఫర్ బ్లైండ్‌కు వెళ్లా. అయితే వాళ్లు పాట వినగలరు కానీ చూడలేరు. కాబట్టి పాటకు అర్థం చెప్పి, స్పర్శ ద్వారా ముఖ కవళికలు, చేతులు, పాదాలు ఎప్పుడు ఎలా పెట్టాలన్నది నేర్పించా.
ఇక, ఫిన్డెఫ్ అనే బధిర విద్యార్థుల పాఠశాలకు వెళ్లినప్పుడు వారికి పాట వినిపించదు. వాళ్లకు అర్థమయ్యేలా నృత్యం నేర్పించడం కోసం ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నా. ఆ తర్వాత వారితో సంజ్ఞలతో మాట్లాడుతూ నృత్యం నేర్పించా. ఇక, ఆటిజం పిల్లలను ఒక చోట కూర్చోబెట్టడమే మహా కష్టం. అందుకే ఒక వారంపాటు రోజూ వాళ్ల దగ్గరికి వెళ్లి కూర్చుని నా మీద వాళ్లకి నమ్మకం కలిగాక, చెప్పిన మాట వినేలా చేసుకుని అప్పుడు నృత్యం నేర్పించా. అలా వందేమాతరం 150 ఏండ్ల సందర్భంగా, మొత్తం 150 మంది విద్యార్థులతో ‘వందేమాతరం 150- యాన్ ఎక్స్‌క్లూజివ్ డ్యాన్స్ ట్రిబ్యూట్ టు ద నేషన్ బై అక్షర దేవళ్ల’ పేరిట రవీంద్ర భారతిలో నృత్య ప్రదర్శన చేయించా. నేను స్టేజ్ పక్కన నిలుచుని ఈ నృత్యాన్ని చూస్తున్నప్పుడు ఎంతోమంది నా దగ్గరికి వచ్చి మెచ్చుకున్నారు. పిల్లలంతా అలా వందేమాతరం పాటకు డ్యాన్స్ చేయడం చూసి నాకు కూడా కళ్లలో నీళ్లు వచ్చాయి. ఇంతకీ ఈ కార్యక్రమ నిర్వహణకు కూడా నా సొంత డబ్బులే పెట్టుకున్నా. అదెలా అంటే..
నాకు నాట్యంతో పాటు నటన అన్నా చాలా ఇష్టం. మా ఇంట్లో అమ్మానాన్నతో పాటు పాఠశాలలో ప్రిన్సిపాల్ మేడం నుంచి కూడా నాకు మంచి ప్రోత్సాహం ఉంటుంది. ప్రభాస్ సినిమా రాజాసాబ్, నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు, శోభిత చేసిన చీకటిలో… లాంటి 12 దాకా సినిమాల్లో నటించాను.
కార్యక్రమానికి ఉపయోగించా. ఇక, రుషీకేశ్ వెళ్లి నెల రోజుల పాటు యోగా శిక్షణ తీసుకున్నా. అందుకే మంతెన సత్యనారాయణ రాజుగారి యోగా సిరీస్‌లోనూ ప్రతి రోజూ టీవీలో వస్తా. మన దేశంలో కాకుండా మలేషియా, అమెరికాల్లో ప్రదర్శనలిచ్చా. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్లు అమెరికాకు పిలిచి ‘యూత్ పర్ఫామింగ్ ఆర్ట్స్-2026’తో సత్కరించారు. మన సమాజం కోసం ఏదో ఒకటి చేయాలని అమ్మానాన్నలు చెబుతూ ఉంటారు. నాకూ అది చాలా ఇష్టం. అందుకే, ఎవరైనా నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే ఫిలాంథ్రపిస్ట్ అవుతా అని చెప్పేదాన్ని. ఏదైనా మంచి నైపుణ్య శిక్షణ సంస్థను స్థాపించి, మన దగ్గరి విద్యార్థుల్ని ప్రపంచం అభినందించేలా తీర్చిదిద్దాలన్నది నా కల!
– లక్ష్మీహరిత ఇంద్రగంటి