కల్వకుర్తి, ఆగస్టు 14 : శ్రీశైలం నిండు కుండలా మారుతున్నా.. ఆంధ్ర ప్రయోజనాల కోసం ఎంజీకేఎల్ఐ కాల్వలకు సాగునీరు వదలకుండా డ్రామాలాడుతున్న అసమర్థ ప్రభుత్వమని బీఆర్ఎస్ కల్వకుర్తి మండలాధ్యక్షుడు విజయ్‌గౌడ్ విమర్శించారు. శుక్రవారం కల్వకుర్తి మండలం ఎల్లికల్తండా వద్ద కేఎల్ఐ 29వ ప్రధాన కాల్వవను గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. ఎంజీకేఎల్ఐ పంపులను ఆన్‌చేసి నీళ్లు వదులుతున్నామని చెప్పి మూడు పంపులు రన్ చేయకుండా నాటకాలు ఆడుతుందని విజయ్‌గౌడ్ ఆరోపించారు. ఈనెల 11వరకు కేఎల్ఐ పంపులను ఆన్ చేయకపోతే కేటీఆర్‌తో కలిసి ప్రాజెక్టులను ముట్టడిస్తామని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందని విజయ్‌గౌడ్ చెప్పారు.
మూడు పంపులను రన్ చేస్తేనే కల్వకుర్తి చివరి ఆయకట్టు వరకు కేఎల్ఐ సాగునీరు వస్తుందనే సోయిని మరిచిన రాష్ట్ర ప్రభు త్వం ఒకరోజు ఒక పంపును, మరో రోజు మరో పంపును ఆన్‌చేస్తూ కల్వకుర్తి ఆయకట్టు ప్రజలను వంచిస్తుందని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో జలకళను సంతరించుకున్న చెరువులు, పరవళ్లలో ఓలలాడిన కాల్వలు నేడు వట్టిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రాకు కృష్ణానీటిని తరలించుకుపోతున్నా పట్టించుకోకుండా ఏపీ పాలకులకు తెలంగాణ ప్రభుత్వం కొమ్ముకాస్తుందని దుయ్యబట్టారు.
సొంత ప్రాంత ప్రయోజనాలను కాపాడలేని కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ప్రజా క్షేత్ర ంలో ఎండగడుతామని విజయ్‌గౌడ్ హెచ్చరించారు. నిజం గా తెలంగాణ ప్రాంతం, పాలమూరు రైతు బిడ్డల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే మూడు మోటర్లను ఆన్‌చేసి చిత్త శుద్ది నిరూపించుకోవాలని విజయ్‌గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. ఆంధ్రాకు సాగునీరు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌నినోను బూచిగా చూపిస్తుందని మండిపడ్డారు. వరి సాగు చేయకుండా ప్రభుత్వం పన్నుతున్న కుట్రలలో భాగంగానే కేఎల్ఐ నీళ్లు పూర్తి స్థాయిలో వదలకుండా డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. పండించిన వడ్లను కూడా కొనుగోలు చేయలేని రేవంత్ సర్కార్ సిగ్గుపడాలని ఆయన దుమ్మెత్తిపోశారు.
ఎవరి ప్రయోజనాలకు రాష్ట్ర ప్ర భుత్వం పాటుపడుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారని, ప్రజలందరూ తిరగబడక ముందే తప్పులను సరిదిద్దుకోవాలని హితవు పలికారు. కేఎల్ఐ మూడు మోటార్లను ఆన్‌చేసి డీ-82 ఆఖరి ఆయకట్టు వరకు సాగునీరు ఇవ్వాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళనలు చేపడుతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎల్లికల్ గ్రామ సర్పంచ్ జల్లెళ్ల కృష్ణయాదవ్, ఉపసర్పంచ్ మున్యా, నాయకులు నీరటి బాలస్వామి, రైతులు అశోక్, గుండయ్య, మొగులాల్, జంగయ్య, శివయ్య,రమేశ్, పర్వతాలు, వెంకటయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.