కార్పొరేషన్, మార్చి 14 : మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడంపై జిల్లా కేంద్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. కాగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమం లో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. అనంతరం బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తూ నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణితో పాటు నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభావం తప్పదని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత బీఆర్ఎస్ నాయకులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ పెద్దపల్లి పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల నాయకులు కాంగ్రెస్ సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై నిలదీస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కడం ఏంటని నిలదీశారు. జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ అసెంబ్లీ చరిత్రలో చీకటిరోజుగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని హత్యచేసిందని ధ్వజమెత్తారు. ప్రశ్నించేవారిని సభ నుంచి బయటకు పంపించడమేనా కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలనా? అని ప్రశ్నించారు. పాలనను గాలికొదిలిసిన కాంగ్రెస్ ప్రతిపక్షాలను ఇబ్బందిపెట్టే చీకటి అధ్యాయానికి తెరలేపిందని విమర్శించారు. జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ పిరికిపంద చర్య అని అభిప్రాయపడ్డారు.
జగిత్యాల, మార్చి 14 : సస్పెన్షన్‌తో ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి బయటికి పంపించారేమో గానీ, నాలుగు కోట్ల ప్రజల గొంతు నొక్కలేరని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత స్పష్టం చేశారు. జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద శుక్రవారం నాయకులతో కలిసి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా దావ వసంత మాట్లాడారు. అసెంబ్లీలో సమస్యలు చర్చకు రాకుండా అడ్డుకునే యత్నమని, అందులో భాగంగానే బీఆర్ఎస్ సభ్యుడిపై సస్పెన్షన్ విధించారన్నారు. ఇది చాలా అన్యాయమని మండిపడ్డారు. ఏడాదిన్నర కూడా గడవకముందే అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతను చూసి రేవంత్ రెడ్డి అసహనానికి గురై నోరు జారుతున్నారని, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ డైవర్షన్ డ్రామాకు తీసిందని, అసెంబ్లీలో ప్రజా సమస్యలేవీ చర్చకు రాకుండా ఉండేందుకు జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేశారన్నారు. ఆయన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్లు సందీప్ రావు, మహిపాల్ రెడ్డి, మారెట్ కమిటీ మాజీ చైర్పర్సన్లు శీలం ప్రియాంక, ఉదయశ్రీ, మఠం రాణి, సాయి, మండలాధ్యక్షులు ఆనందరావు, మల్లేశ్, తేలు రాజు, తుమ్మ గంగాధర్, సీనియర్ నాయకులు సాగి సత్యంరావు, గంగారెడ్డి, ప్రసాద్, మాజీ ప్రజాప్రతినిధులు శ్రీధర్, బీఎన్ గౌడ్, శంకర్, ఎల్ల రాజన్న, శ్రీనివాస్, అంజన్న, రిజ్వాన్, చింతల గంగాధర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల టౌన్, మార్చి 14: ప్రజా పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాక్షస పాలన నడిపిస్తున్నదని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల కోసం కొట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై అక్కసు వెల్లగక్కుతున్నదని మండిపడ్డారు. ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆగయ్య విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడి పోతున్నదని విమర్శించారు. ఆ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీనియర్ శాసనసభ్యు డు, మాజీ మంత్రి అడిగితే ఆయనను సస్పెండ్ చేయడం శోచనీయం అన్నారు. కేసీఆర్ తన పదేళ్ల పాలనలో తెలంగాణను దేశానికే అగ్రగామిగా నిలిపారని ప్రశంసించారు. అటువంటి మహానాయకుడిని ఉద్దేశిస్తూ రేవంత్‌రెడ్డి తన స్థాయిని మరిచి మాట్లాడడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో స్ట్రెచర్ మీద ఉన్నదని, త్వరలోనే కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, పార్టీ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, న్యాలకొండ రాఘవరెడ్డి, అడ్డగట్ల మురళి, జక్కుల నాగరాజు, కుంబాల మల్లారెడ్డి, గుగులోత్ సురేశ్‌నాయక్, జవహర్‌రెడ్డి, గజభీంకార్ రాజన్న, ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, పడిగెల రాజు, పాతూరి రాజిరెడ్డి, సిరిగిరి మురళి, కందుకూరి రామాగౌడ్, వీరగోని శ్రీనివాస్‌గౌడ్, తదితర నాయకులు పాల్గొన్నారు.