అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ రైతులకు ఎన్నో హామీలిచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మాటపైనా నిలబడలేకపోతున్నది. మొన్న రుణమాఫీ విషయంలో వేలాది మంది రైతులకు మొండిచేయి చూపిన ప్రభుత్వం, ఇప్పుడు ఏకంగా వానకాలం సీజన్ రైతు భరోసాపై చేతులెత్తేసింది. పంట పండించే రైతులకే రైతు భరోసా ఇస్తామని, అందుకు అవసరమైన ఒక సబ్ కమిటీని వేస్తున్నామని, నివేదికలు ఇచ్చిన తర్వాతనే రైతు భరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించడంపై రైతులోకం మండిపడుతున్నది. మరోవైపు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించక పోవడంపైనా ఆగ్రహిస్తున్నది. ఈ పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గులాబీ శ్రేణులతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైంది.
రైతుల పక్షాన రణం చేసేందుకు మరోసారి బీఆర్ఎస్ దళం సిద్ధమైంది. వానకాలం సీజన్ రైతు భరోసా ఎగ్గొట్టిన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఆందోళన బాట పడుతున్నది. కాంగ్రెస్ సర్కారు రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునివ్వగా, నేడు ఉమ్మడి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టనున్నారు.
కరీంనగర్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధు కింద ప్రతి సీజన్‌కు ఎకరాకు 5 వేల చొప్పున ఏటా 10 వేలు పెట్టుబడి సాయం అందించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ అనేక సందర్భాల్లో రైతుబంధును మాత్రం తప్పకుండా సీజన్ ప్రారంభంలోనే రైతుల ఖాతాల్లో జమ చేసేది. ఈ మొత్తంతోనే రైతులు పెట్టుబడుల కోసం ఎక్కడ చేయిచాపకుండా సాగుబాట పట్టేవారు.
నిరందీగా ఎవుసం చేసుకునే వారు. కానీ, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు ప్రతి సీజన్‌కు 7,500 చొప్పున ఏటా 15 వేలు అందిస్తామని చెప్పి వారి ఓట్లు వేయించుకుంది. అధికారంలోకి వచ్చిన మొదట్లో యాసంగి సీజన్‌కు బలవంతంగా రైతుబంధునే యాధావిధిగా అమలు చేసింది. రైతు భరోసా కింద 7,500 ఇస్తారేమోనని ఎదురు చూసిన రైతులకు నిరాశే మిగిల్చింది. అప్పుడు వానకాలం నుంచి రైతు భరోసా అమలు చేస్తామని నమ్మబలికింది. తీరా వానకాలం సీజన్ దాటి పోయినా ఇప్పటి వరకు దానిని అమలు చేయలేదు.
ఇప్పుడు ఏకంగా చేతులెత్తేసింది. ‘పంట పండించే రైతులకే రైతు భరోసా ఇస్తామని, అందుకు అవసరమైన ఒక సబ్ కమిటీని వేస్తున్నామని, కమిటీ నివేదికలు ఇచ్చిన తర్వాతనే రైతు భరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించడంతో చెప్పడంతో రైతాంగం నిరాశకు లోనయింది. రైతు భరోసాను ఇవ్వకుండా మభ్యపెడుతున్నదని, తమను అన్ని రకాలుగా మోసం చేస్తున్నదని వాపోతున్నది. ఇటు ఆది నుంచీ రైతులకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్, సర్కారు తీరుపై తీవ్రంగా మండిపడుతున్నది.
ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని, కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నదని ధ్వజమెత్తుతున్నది. పంట రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించగా, ఇంకా చేయాల్సి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం రైతులను మోసగించే పనుల్లో భాగమేనని మండిపడుతున్నది. ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా వెంటనే అమలు చేయాలని, పూర్తి స్థాయిలో పంట రుణమాఫీ చేయాలని, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది.
ఈ మేరకు శనివారం సాయంత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ముఖ్యనాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, ఆదివారం నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన దీక్షలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. నేటి నిరసనలను విజయవంతం చేయాలని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల పార్టీ అధ్యక్షులు జీవీఆర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కోరుకంటి చందర్, తోట ఆగయ్య వేర్వేరుగా పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతును మోసం చేస్తున్నది. వారికి ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. కమిటీలు వేసి కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నది. మా ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రైతు బంధు రైతులకు ఎంతో ఉపయోగపడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లో యాసంగికి రైతుబంధు పథకాన్నే మొక్కుబడిగా అమలు చేశారు. వానకాలం పంటకు ఇవ్వనే లేదు. వ్యవసాయ శాఖ మంత్రి సిగ్గు లేకుండా కమిటీ నివేదిక తర్వాతనే రైతు భరోసా ఇస్తామని చెప్పడం శోచనీయం. వెంటనే రైతులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం అన్ని మండల కేంద్రాల్లో మా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నాం. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు (కరీంనగర్)