గోదావరిఖని, మే 11 : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ను నమ్మితే తెలంగాణ అల్లకల్లోలమే అవుతుందని, ఆ పార్టీలు సింగరేణి సంస్థను పూర్తిగా అమ్మేందుకు పూనుకుంటాయని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో అవస్థ పడుతున్న ప్రజలకు బీఆర్ఎస్ శ్రీరామ రక్షగా ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రజలు కాపాడుకోవాలని, నిరంతరం ప్రజా సేవ కోసం తపించే తనను ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాను గెలిస్తే సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తానని, కార్మికులకు ఐటీ మినహాయింపు కోసం కృషి చేస్తానని, సంస్థను ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకుంటామని హామీ ఇచ్చారు.
తన చివరి శ్వాస వరకు ప్రజల సేవకే తన జీవితం అంకితమని స్పష్టం చేశారు. శనివారం గోదావరిఖని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ నుంచి తీసిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత ఖని ప్రధాన చౌరస్తాలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాజీ ఎమ్మె ల్యే కోరుకంటి చందర్‌తో కలిసి కొప్పుల మాట్లాడారు. బీఆర్ఎస్ ఎల్లప్పుడూ తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుందని స్పష్టం చేశారు.
ప్రజల పక్షాన కాంగ్రెస్ వ్యతిరేక విధానాలకు ఎదురు నిలిచి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అబద్ధాలు, అమలు కాని గ్యారంటీలతో ఆ పార్టీ గద్దెనెక్కిందని, ఇప్పుడా ఆ హామీలను అమలు చేయలేక అబాసుపాలవుతున్నదని విమర్శించారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రజలు కాంగ్రెస్ పాలనపై అవగాహనకు రావాలని సూచించారు. స్థానికుల కష్టాలు తెలిసిన.. కార్మికుల బాధలు తెలిసిన తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. కోరుకంటి చందర్ మాట్లాడుతూ. ఉద్యమకారుడు, సింగరేణి మాజీ కార్మికుడు కొప్పుల ఈశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు మిర్యాల రాజిరెడ్డి, రామ్మూర్తి, చల్ల రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.