హుజూరాబాద్, సెప్టెంబర్ 30 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, హుజూరాబాద్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరబోతున్నదని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం స్థానిక నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచే ప్రతిపాదనను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందుకు తెచ్చారని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ విషయంలో తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు.
రైతులకు యూరియా బస్తాలు అందించకుండా కనీస న్యాయం చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటడిగే హక్కు లేదని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ హయాంలోనే రైతులు సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ వచ్చాక నడిరోడ్డుపై నిలబడ్డారని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుజూరాబాద్‌లో 107 గ్రామపంచాయతీలు, రెండు మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.వందల కోట్లు కేటాయించారని గుర్తు చేశారు.
హుజూరాబాద్ ప్రజలు చాలా చైతన్య వంతులని, ఏ పార్టీ హయాంలో అభివృద్ధి జరిగిందో వారికి బాగా తెలుసన్నారు. జర్నలిస్టులకు కేటాయించిన నివేశన స్థలాలను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని, వారికి ఇబ్బందులు కలిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచే స్థానాల్లో అభివృద్ధికి తాను పూర్తి స్థాయిలో అండగా ఉంటానని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికల కోసం మండలాల వారీగా సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 4న ఉదయం వీణవంక, సాయంత్రం హుజూరాబాద్, 5న ఉదయం ఇల్లందకుంట, సాయంత్రం జమ్మికుంట, 6న ఉదయం కమలాపూర్‌లో సమావేశాలు ఉంటాయని చెప్పారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.