హుజూరాబాద్ రూరల్, నవంబర్ 22: తెలంగాణలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మురిగిపోయినట్టేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని సింగాపూర్, మందాడిపల్లి, తుమ్మనపల్లి గ్రామాల్లో బుధవారం ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ, రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని, ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను 7 సార్లు గెలిపిస్తే నియోజవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పారు. ఆయనను నమ్ముకున్న నాయకులను, కార్యకర్తలను రెండేండ్ల నుంచి పట్టించుకోవడం లేదని, ఇప్పుడు ఎన్నికలు వచ్చినంక గాలి మోటర్ల ఎక్కి అకాశం మీదనే తిరుగుతండు తప్పా హుజూరాబాద్‌ను పట్టించుకోలేదన్నారు.
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, రైతుబంధు, బీమా, కల్యాణలక్ష్మి లాంటి అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ, గీత కార్మికులకు పింఛన్లు పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. తనకు ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. ఏ ఆపద వచ్చిన అండగా ఉంటానని, పిలిస్తే పలుకుతానని, 24 గంటలు మీకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాడి శాలినిరెడ్డి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎంపీపీ ఇరుమల్ల రాణీసురేందర్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కొండల్‌రెడ్డి, సర్పంచులు గూడూరి ప్రతాప్‌రెడ్డి, ఎల్లయ్య, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సురుకొంటి మాధవరెడ్డి, మిడిదొడ్డి స్వామి, నాయకులు తుమ్మనపల్లి సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు ఏనుగు సత్యనారాయణరెడ్డి, డైరెక్టర్లు యాళ్ల యతీశ్వర్‌రెడ్డి, నర్ర భగవాన్‌రెడ్డి, సామల సుధాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగెం ఐలయ్య, నాయకులు చొల్లేటి కిషన్‌రెడ్డి, రవీందర్రావు, కన్నబోయిన శ్రీనివాస్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.