హుజూరాబాద్ టౌన్, జూలై 21 : నిరుద్యోగ యువతకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి భరోసా ఇచ్చారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని, వారికి ఉద్యోగాలు కల్పించడం ద్వారా దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో హుజూరాబాద్‌లోని సిటీ సెంటర్ హాల్లో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది. దాదాపు ఐదు వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. 85 ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు మూడు వేల ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు దారి చూపించడమే తన కర్తవ్యమని చెప్పారు. నిరుద్యోగులు స్థానికంగానే కాకుండా ఎక్కడ ఉద్యోగం లభించినా చేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు స్ఫూర్తి, ప్రోత్సాహంతో రాష్ట్రంలోని మల్టీ నేషనల్ కంపెనీలను హుజూరాబాద్‌కు తీసుకువచ్చి, మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు. 2.10 లక్షల ప్రభుత్వోద్యోగాలు ఇచ్చిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. ఇవేకాక, బెంగళూరును తలదన్నేలా 10 లక్షల నుంచి 12 లక్షల వరకు ఉద్యోగాలు ఐటీ, ప్రైవేట్‌లో రంగంలో కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. ఈ సందర్భంగా కంపెనీల ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, వివిధ కంపెనీల ప్రతినిధులు, సీనియర్ నాయకులు గందె శ్రీనివాస్, తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులు, నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాది హుజూరాబాద్ మండలంలోని జూపాక. నేను బీఫార్మసీ పూర్తి చేసి జాబ్ కోసం చూస్తున్నా. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మా హుజూరాబాద్‌లోనే జాబ్‌మేళా ఏర్పాటు చేయడం సంతోషం. నేను హాజరయ్యా. నాకు త్రిశూల్డ్ సొల్యూషన్ హైదరాబాదులో మంచి సాలరీతో జాబ్ వచ్చింది. ఫుల్ హ్యాపీ. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నా థాంక్స్.
– దాసరి అనుశ్రీ, అభ్యర్థి