చొప్పదండి, అక్టోబర్ 31: ‘అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదు. ఆ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంక్షోభం, అంధకారమే మిగులుతుంది. కర్ణాటక లెక్క కరెంట్‌కు గోసపడాల్సిందే. టార్చ్‌లైట్ పట్టుకొనే పొలాల దగ్గరికి వెళ్లి కరెంటు పెట్టుకొని, అక్కడే పండుకుని పరిస్థితి మళ్లీ వస్తుంది. ప్రజలారా మీ ఓటు రైతుబంధుకు వేస్తారో..? లేదా రాబందులకు వేస్తారో..? ఒక ఆలోచించండి. కాంగ్రెస్, బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మకండి. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష’ అని బీఆర్ఎస్ చొప్పదండి అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. ఎన్నికల ముందు వచ్చి తర్వాత వెళ్లిపోయే నాయకులకు ఈ ప్రాంతం మీద మమకారం ఉండదని విమర్శించారు. తాను స్థానికుడినని, అందరికీ అందుబాటులో ఉంటున్నానని, ఏ ఆపద వచ్చినా అండగా నిలుస్తున్నానని చెప్పారు. స్థానిక బిడ్డగా తనను మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. చొప్పదండి మండలం భూపాలపట్నం, వెదురుగట్ట, కొలిమికుంట, చాకుంట గ్రామాల్లో మంగళవారం ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు.
తెలంగాణ అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బీజేపీ వాళ్ల కండ్లు మండుతున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో అన్నివర్గాల ప్రజలకు మేలు చేసేలా ఉందన్నారు. వ్యవసాయానికి 24గంటల కరెంటు ఇవ్వడం లేదని విమర్శిస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇకడికొచ్చి కరెంటు తీగలు పట్టుకొని చూడాలని సవాల్ విసిరారు. మూడు గంటలు కరెంట్ చాలని రేవంత్‌రెడ్డి, రైతుబంధు వద్దని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు, నిరంత విద్యుత్ రెండూ బంద్ అవుతాయని, ప్రజలు ఆలోచన చేసి ఓటేయాలని కోరారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా స్థానికేతరులని, వాళ్లు అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. తాను లోకల్ అని, అభివృద్ధే తన లక్ష్యమని స్పష్టం చేశారు. నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలిపానని, పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలను అందిస్తున్నానని చెప్పారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా సుంకె రవిశంకర్‌కు జడ్పీటీసీ మాచర్ల సౌజన్య, మహిళా సర్పంచులు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఒగ్గుడోలు కళాకారులు, డప్పుచప్పుళ్లతో గ్రామాల్లో భారీ ర్యాలీ తీశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్, పీఏసీఎస్ చైర్మన్లు వెల్మ మల్లారెడ్డి, మినుపాల తిరుపతిరావు, ఏఎంసీ చైర్మన్ గడ్డ చుక్కారెడ్డి, వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ గన్ను శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు ఏలేటి లావణ్య-తిరుపతిరెడ్డి, గుడిపాటి సుచరితాదేవి, తాళ్లపల్లి సుజాత-శ్రీనివాస్, పెద్ది శంకర్, గుంట రవి, గుడిపాక సురేశ్, కౌన్సిలర్ మాడూరి శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, మాజీ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు పాషా, నాయకులు నారాయణరావు, సీపెల్లి గంగయ్య, నారాయణ, గాండ్ల లక్ష్మణ్, కొత్తూరి నరేశ్, గోపు శ్రీనివాస్‌రెడ్డి, దీటి మధు, మల్లేశం, నర్సయ్య, రావణ్ పాల్గొన్నారు.