Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, మే23: రైతులకు మాయమాటలు చెప్పి, మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయక రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తుందని, రైతులకు ఇచ్చిన హామీల అమలులో తీవ్రంగా విఫమైనట్లు బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్వశ్రీరాంపూర్ లో మక్కలు సకాలంలో కొనుగోలు చేయడం లేదని, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న మక్కలు, వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేసి, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాల్వశ్రీరాంపూర్ లో ప్రధాన రహదారిపై రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు శనివారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని గొప్పలు చెపుతున్న ప్రభుత్వం రైతులు పండించిన పంటలు సకాలంలో ఎందుకు కొనుగోలు చేయరని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు అరిగోసపడుతున్నారని, రైతుల ఉసురు ప్రభుత్వానికి తాకుతుందని మండిపడ్డారు. అధికారులు, నాయకులు కొనుగోలు కేంద్రాలకు వచ్చి ఫొటోలకు పోజులిస్తున్నారే తప్ప తూకాలు వేగవంతం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారంటూ మండిపడ్డారు. కాల్వశ్రీరాంపూర్ మార్కెట్ యార్డులో మక్కలు పోసి నెల రోజులైనా ఇంతవరకు తూకాలు కాలేదని, స్వయంగా రైతులే చెపుతున్నారని, దీనికి అధికారులు, నాయకులు సమాధానం చెప్పాలంటూ మండిపడ్డారు.
మక్కలు అమ్ముకుందామని మార్కెట్ కు వచ్చిన రైతులను గన్నీ సంచులు, సుతిలి మీరే తెచ్చుకోవాలంటూ మాట్లాడడం సరైనదేనా అంటూ విమర్శించారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేదిలేదని స్వయంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు చెప్పుతున్నప్పటికీ, కొనుగోలు కేంద్రాల్లోని నిర్వాహకులు అందుకు భిన్నంగా 41.600గ్రాములు తూకాలు వేస్తూ రైతులను మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మక్కల కొనుగోలు కేంద్రంలో నిర్వాహకుడు కృష్ణాకర్ 51కిలోకు బదులుగా అదనంగా గ్రా.500 ఎక్కువ తూకాలు వేయిస్తున్నారని, మక్కల కొనుగోలు కేంద్రం ఇంచార్జి కృష్ణాకర్ ను నిలదీశారు. తూకాలు ఎందుకు ఎక్కువ వేస్తున్నారని అతనిపై పిర్యాదు చేస్తామన్నారు. ప్రభుత్వం అధికారులు వెంటనే కళ్లు తెరచి కొనుగోలు కేంద్రాలు తనిఖీలు చేపట్టాలన్నారు.
తూకాల్లో అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై, రైతులను ఇబ్బందులు పెడుతున్న కలెక్టర్ తీరుపై చర్యలు తీసుకోవాలని అన్నారు. గత ఆదివారం రైతులు లేని సమయంలో కలెక్టర్ కాల్వశ్రీరాంపూర్ కు ఇలా వచ్చి అలా వెళ్లారని, రైతులు లేని సమయంలో వస్తే రైతుల బాధలు ఎలా తెలుస్తాయని అన్నారు. మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలని, లారీలు ఎక్కువగా వచ్చే విదంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డులో నిల్వ ఉన్న ధాన్యాన్ని, తూకాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ బైరం రమేశ్, బీఆర్ఎస్వై మండల అధ్యక్షుడు నూనేటి కుమార్, నాయకులు జంగ శ్రీనివాస్ రెడ్డి, జూకంటి అనీల్, మాదాసి రాంచంద్రం. కూకట్ల నవీన్, దండి అజయ్, బొల్లమల్ల శంకర్, కల్వల కిషన్రెడ్డి, ఉయ్యాల ఓదెలు, తదితరులు ఉన్నారు.