పెద్దపల్లి, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నది. దేశంలోనే చరిత్రను సృష్టించిన ఒక మహాపురుషుడి ప్రభను మసకబార్చే కుట్ర జరుగుతున్నది. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, రాష్ట్ర రూపు రేఖలు మార్చిన కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నరు’ అని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. తెలంగాణ జీవనాధారమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
ప్రాజెక్టుకు చిన్న పాటి మరమ్మతులు కూడా చేయించకుండా నాటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుపై ఆరోపణలు చేయడం, శాసనసభలో సీబీఐ విచారణకు ప్రకటించడంపై సోమవారం నిరసన తెలిపారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పార్వతీ బ్యారేజీ నుంచి కాళేశ్వరం నీళ్లను తీసుకువచ్చి జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధూకర్, దాసరి మనోహర్‌రెడ్డి, టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ చిరుమిళ్ల రాకేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు కౌశిక్‌హరి, వ్యాళ్ల హరీశ్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొప్పుల మాట్లాడారు.
ప్రాజెక్టులకు రిపేర్లు రావడం సహజమని, ఇలా రాష్ట్రం, దేశంలో అనేక ప్రాజెక్టులకు మరమ్మతులు చేసి ప్రజలకు సాగు, తాగునీటిని అందించిన చరిత్ర ఉందన్నారు. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం రెండు పిల్లర్లు కుంగిపోతే వాటిని రిపేర్ చేసి నీళ్లివ్వకుండా.. కాంగ్రెస్, బీజేపీ కలిసి కట్టుగా కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. వారి కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో హరీశ్‌రావు అడిగిన ఒక ప్రశ్నకు కూడా ముఖ్యమంత్రి, మంత్రుల దగ్గర సమాధానం లేదని, వారి దొంగ నాటకాలు తేటతెల్లమయ్యాయన్నారు.
సుంకిశాల, ఎస్ఎల్బీసీ, పోలవరం ప్రాజెక్టులు కూలిపోతే రాని కమిషన్, మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లు కుంగితే వస్తుందా..? అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 420 హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసమే ఇదంతా చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఎల్అండ్టీ సంస్థనే 200 కోట్లతో పిల్లర్లు రిపేర్ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పినా.. ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా కుట్రతో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదన్నారు.
ఎన్ని కుట్రలు చేసినా చివరికి సత్యమే, ధర్మమే గెలుస్తుందని, ప్రజా కోర్టులో కాంగ్రెస్, బీజేపీకి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు మేకల సంపత్, ఆముల నారాయణ, వంగళ తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీలు ముత్యాల బలరాంరెడ్డి, నూనేటి సంపత్, బీఆర్ఎస్ పెద్దపల్లి పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, పార్టీ మండలాధ్యక్షుడు మర్కు లక్ష్మణ్, నాయకులు కొయ్యడ సతీశ్‌గౌడ్, పూదరి చంద్ర శేఖర్, నారాయణదాసు మారుతి, మేకల సంపత్, బొడ్డుపల్లి రవీందర్, బొడ్డు శ్రీనివాస్, ఏగోళపు శంకర్‌గౌడ్, అనీల్‌గౌడ్, ఉప్పు శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.