BRS Party | ధర్మారం, జూలై 27 : ధర్మారం మండలంలో సోమవారం నుంచి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఊరూరా ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇదివరకే రాష్ట్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ సమావేశాల నిర్వహణ తీరుతెన్ను గురించి మండల నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ క్రమంలో మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని పార్టీ నాయకులు నిర్ణయించారు.
ఈ మేరకు సోమవారం నుంచి మండలంలోని దొంగతుర్తి, నర్సింహులపల్లి గ్రామాలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సమావేశానికి మండలంలోని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి తో పాటు ఇతర పార్టీ ముఖ్య నాయకులు హాజరవుతారని పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ వెల్లడించారు. గ్రామానికి చేరుకున్న మండల నాయకులతో పాటు గ్రామంలోని పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా కలిసి గ్రామ కూడలికి చేరుకొని మొదట పార్టీ గులాబీ జెండాను ఎగురవేస్తారు. ఆ తర్వాత ఎంచుకున్న స్థలంలో పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతంతో పాటు పార్టీ అభ్యర్థుల విజయం గురించి ప్రత్యేకంగా చర్చిస్తారు. గ్రామంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా ఐక్యంగా కృషి చేయాలని నిర్దేశం చేస్తారు. పార్టీకి అంకితభావంతో పనిచేసిన వారందరికీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పిటిసి పదవుల కోసం అభ్యర్థుల ఎంపికలో తగిన ప్రాధాన్యత ఉంటుందని విషయాన్ని క్యాడర్ కు వివరిస్తారు.
ప్రజల్లో బీఆర్ఎస్పై నమ్మకం ఏర్పడిందని దీనిని స్థానిక సంస్థల ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవడానికి అందరూ సమిష్టిగా పనిచేసే పార్టీ అభ్యర్థులు దిగ్విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని ఆ దిశగా అందరూ శ్రమించాలని నాయకులు ఉద్భోదిస్తారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడం గురించి మండల మండల నాయకులు పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చలేదని విషయాన్ని ప్రజలకు కూలంకషంగా వివరించడానికి పార్టీ శ్రేణులకు నిర్దేశం చేసే విషయంపై ప్రత్యేక సమావేశాలలో చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతం గురించి దిశా నిర్దేశం చేయడం జరుగుతుందని పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సమావేశాల కు మండల ముఖ్య నాయకులు హాజరై దిగ్విజయం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశాలతో గులాబీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం రానుంది.