అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై ఆడబిడ్డలు ఆగ్రహించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. ఎక్కడికక్కడ రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. చిత్రపటాలను చేతపట్టుకుని ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ నినదించారు. ‘ఆయనే మా ఉసురు తగలి బస్టాండ్ పాలయితడు’ అంటూ శాపనార్థాలు పెట్టారు. సీఎంతోపాటు పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంటనే మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలైన సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భగ్గుమన్నారు. గురువారం ఉమ్మడిజిల్లావ్యాప్తంగా నిరసనలకు దిగారు. సీఎం దిష్టిబొమ్మలు దహనం చేశారు. నగర మేయర్ వై సునీల్‌రావు ఆధ్వర్యంలో తెలంగాణచౌక్‌లో.. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో మానకొండూర్‌లో నిరసనలు తెలిపారు. గంగాధర మండలం మధురానగర్‌లో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, హుజూరాబాద్ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీనివాస్, మహిళా నాయకులు పాల్గొన్నారు.
సిరిసిల్ల అంబేద్కర్ చౌక్‌లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సీఎం దిష్టి బొమ్మను దహనం చేశారు. ఇక్కడ నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, మాజీ జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణతోపాటు మహిళలు పెద్ద సంఖ్యలో పా ల్గొన్నారు. వేములవాడలో జరిగిన నిరసనలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి పాల్గొన్నారు.
పెద్దపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. పోలీసులు అడ్డుకొన్నప్పటికీ సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు.
జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పాల్గొన్నారు. కోరుట్ల కార్గిల్ చౌరస్తా జాతీయ రహదారిపై సీఎం దిష్టిబొమ్మను దహనం చేయగా, ధర్మపురి పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు.
బీఆర్ఎస్ నాయకుడి ఆత్మహత్యాయత్నం
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో ఆవేదన చెందిన ఓ బీఆర్ఎస్ నాయకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసే క్రమంలో బీఆర్ఎస్ నాయకుడు మైలారం రాము ఒంటిపై డీజిల్ పోసుకున్నాడు. గమనించిన బీఆర్ఎస్ నాయకులు వెంటనే అతని అడ్డుకున్నారు. మహిళా ఎమ్మెల్యేలను అవమానపరచడంతో తాను ఆవేదన చెందానని రాము తెలిపాడు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు.