Sircilla BRS | సిరిసిల్ల టౌన్, జూలై 7: విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ నాయకులు సోమవారం వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ ఫీజులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్‌లో లోని దుకాణాలలో తిరుగుతూ భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.700కోట్ల స్కాలర్ షిప్ బకాయిలు ఉన్నాయని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ స్కాలర్ షిప్ అందించారని గుర్తుచేశారు. నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విద్యార్థులకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి నేడు ముఖ్యమంత్రి హోదాలో వారి సమస్యలు పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి పరిధిలోనే ఉన్నందున వెంటనే రేవంత్ రెడ్డి స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం, ముఖ్యమంత్రి నిర్లక్ష్య దోరణితో పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆదేవన వ్యక్తం చేశారు. విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేసి వారి ఉన్నత విద్యకు సహకరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మట్టే శ్రీనివాస్, వడ్లూరి సాయి, సూర్య, ముద్దం అనీల్, ఎండి. అజ్జు, అనీల్డ్, అఫ్రోజ్, శ్రీనివాసరావు, ఎస్ హరీష్, దేవరాజ్, ఎస్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు.