Chigurumamidi | చిగురుమామిడి, నవంబర్ 24: ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో అమలు చేయలేని హామీలతో అధికారంలోకి వచ్చి సామాన్య ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం లో చేపట్టిన పనులకు శంకుస్థాపనలు చేసి పనులను చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
రేకొండలో ఎగ్లాస్పూర్, మొగిలిపాలెం రహదారి కి బ్రిడ్జి మంజూరు, ఇందుర్తి నుండి కొహెడ రహదారి మధ్యలో బ్రిడ్జి లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సుందరగిరి నుండి ఉల్లంపల్లికి తారు రోడ్డు మంజూరు చేస్తామని మంత్రి ఇచ్చిన హామీ నెలలు గడుస్తున్న ఆచరణకు నోచుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇంతవరకు అభివృద్ధి పనులను మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు.
రెండు సంవత్సరాలలో మండలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి చేపట్టలేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించని ఎడల హుస్నాబాద్ నియోజకవర్గంలోని మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలనలోనే చేపట్టిన అభివృద్ధి మండలంలో ఉందని ఇప్పటివరకు ఎలాంటి నూతన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేదని నాయకులు నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.
సమాచారం తెలుసుకున్న ఎస్సై సాయి కృష్ణ ఆందోళన విరమించాలని నాయకులను కోరగా, కొద్దిసేపటికి మండల పరిషత్ ఎంపీవో బత్తిని కిరణ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మండల మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, మండల పరిషత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ బేతి రాజిరెడ్డి, ఆర్బిఎస్ మండల మాజీ అధ్యక్షుడు పెనుకుల తిరుపతి, మండల నాయకులు ఆర్కే చారి, జక్కుల రవి, సన్నిల వెంకటేశం, ఆనుమాన్ల సత్యనారాయణ, బోయిని మనోజ్, బెజ్జంకి రాంబాబు,సర్వర్ పాషా, చెప్యాల నారాయణ రెడ్డి, నాగేల్లి రాజిరెడ్డి, శివప్రసాద్, పిల్లి వేణు, ఎస్కే సిరాజ్, మిట్టపల్లి మల్లేశం, సంపత్ రెడ్డి, మక్బుల్ పాషా, మహంకాళి కొమురయ్య, నల్లాల రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.