మానకొండూర్, జనవరి 11 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నీచ రాజకీయాలు మానుకోవాలని, పదవికి తగ్గట్టు హుందాగా వ్యవహరించడం తెలుసుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హితవు పలికారు. ఈ మేరకు శనివారం మానకొండూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బండి కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి దాకా ఎదిగినా.. ఆయనలో మాత్రం హుందాతనం పెరుగలేదని విమర్శించారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సబ్జెక్ట్ తెలువకుండా మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్‌ను విమర్శించే స్థాయి సంజయ్‌కి లేదని స్పష్టం చేశారు. కేటీఆర్ పదేళ్లలో రూ. 2.60 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి, హైదరాబాద్‌లో ఎన్నో బహుళ జాతి కంపెనీలు ఏర్పాటు చేయించి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారని గుర్తుచేశారు.
కానీ, సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి చేసిందేమీ లేదని, కనీసం కమాలాపూర్, తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణ పనులు కూడా పూర్తి చేయని అసమర్థ నాయకుడని విమర్శించారు. ఎప్పుడైనా రేవంత్‌రెడ్డి మాట్లాడిన తర్వాత రెండు రోజులకు అదే విషయాన్ని మాట్లాడుతున్నాడని, వీళ్లిద్దరు తోడు దొంగలని, ఏదైనా అనుకునే మాట్లాడుతున్నారని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం మీద పోరాటం చేస్తానని సంజయ్ పేర్కొనడం హాస్యాస్పాదంగా ఉందని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న ఉగ్రవాదులపై పోరాటం చేయాలని హితవు పలికారు. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నా దేశ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలను ఒక్క రోజైనా పరామర్శించిన దాఖలాలు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, బీఆర్ఎస్వీ నియోజక కన్వీనర్ గుర్రం కిరణ్‌గౌడ్, బీఆర్ఎస్వీ మాజీ మండల ఇంచార్జి దండబోయిన శేఖర్, నాయకులు రామంచ గోపాల్‌రెడ్డి, శాతరాజు యాదగిరి, పిట్టల మధు, గడ్డం సంపత్, రాచకట్ల వెంకటస్వామి, నెల్లి శంకర్, కొట్లె రఘు, కోండ్ర వెంకటస్వామి, బొల్లం అనిల్ తదితరులు పాల్గొన్నారు.