కరీంనగర్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం జిల్లాకు వెళ్లిన మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావుపై కాంగ్రెస్ గూండాలు రాళ్ల దాడి చేయడం నీచమైన చర్య అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, వేములవాడ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయి అల్లాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి సహా ఎవరూ పట్టించుకోకపోవడంతో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు బాధితులను పరామర్శించేందుకు వెళ్లడం తప్పా? అని ప్రశ్నించారు. వరదలు తగ్గు ముఖం పట్టినా బాధితులకు సహాయం అందించడంతో ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ అక్కసునంతా ప్రతిపక్షాలపై చూపుతున్నారని మండిపడ్డారు.
బాధితుల పక్షాన ప్రతిపక్ష పార్టీగా వారి గోడును వినిపించే హక్కు ఉంటుంద ని, పరామర్శకు వెళ్లి, వారి బాధలు తెలుసుకుంటే ప్రజల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందని కాంగ్రెస్ గూండాలు నీచాతి నీచంగా రాళ్ల దాడికి దిగడం హేయమైన చర్యఅని అన్నారు. ఇది ప్రజా స్వామ్యానికి గొడ్డలి పెట్టని, విచక్షణ లేకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న కాం గ్రెస్ నాయకుల తీరును ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు. బాధితులను ఆదుకోవడం చేతకాని ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులకు దిగి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ది చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు.