కార్పొరేషన్, జూన్ 30 : బీఆర్ఎస్ జోరు పెంచింది. ఓవైపు ప్రజల పక్షాన సర్కారుపై పోరు సాగిస్తూనే.. మరో వైపు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తున్నది. అందులో భాగంగానే విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పూర్తి చేసింది. తాజాగా కరీంనగర్ అసెంబ్లీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నది. బుధవారం ఉదయం 10 గంటలకు స్థానిక కొండసత్యలక్ష్మి గార్డెన్లో ఏర్పాటు చేయగా, పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీశ్‌రావు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరు అవుతున్నారు. నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.