చిగురుమామిడి, అక్టోబర్ 29: బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి వేగంగా సాగుతున్నదని, అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని బీఆర్ఎస్ హుస్నాబాద్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని రేకొండ, బొమ్మనపల్లి, సుందరగిరి, ఉల్లంపల్లి, కొండాపూర్ గ్రామాల్లో ఆదివారం బీఆర్ఎస్ హుస్నాబాద్ ఇన్చార్జి, మాజీ మంత్రి పెద్దిరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ మాట్లాడుతూ, 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిందన్నారు. మెట్టప్రాంతమైన చిగురుమామిడి మండలానికి ‘కాళేశ్వరం’ జలాలను అందించి బీడు భూములను సైతం సస్యశ్యామలం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. రేకొండ చెరువు గతంలో నీరు లేక ఎండిపోయేదని, నేడు నిండుగా కళకళలాడుతున్నదని ఆనందం వ్యక్తం చేశారు. అసైన్డ్ భూములు ఉన్నవారందరికీ పట్టాలు ఇచ్చేలా కృషి చేస్తామన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన బొమ్మనపల్లి అంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో అభిమానమని, ఇదే విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో గుర్తు చేశారని ఎమ్మెల్యే సతీశ్ కుమార్ తెలిపారు. గ్రామంలోని పలువురి పేర్లు సైతం సీఎం ప్రస్తావించారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్ మూడోసారిగా సీఎంగా నిలబెట్టాలన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే బొమ్మనపల్లికి హెలికాప్టర్లో తీసుకువస్తానని ఎమ్మెల్యే గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిదంని పేర్కొన్నారు. ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. కాగా, కొండాపూర్‌లో 25 మంది కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరారు.
ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు ఆయా గ్రామాల్లో గౌడ, కురుమ యాదవ, కుమ్మరి తదితర కులస్తులు అడుగడుగునా డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టారు. ఎమ్మెల్యేను ఘనంగా స్వాగతం పలికారు.
కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, మహిళా అధ్యక్షురాలు అందె సుజాత, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు సాంబారి కొమురయ్య, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పేనుకుల తిరుపతి, జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, పన్యాల శ్యాంసుందర్ రెడ్డి, సర్పంచులు పిట్టల రజిత, కానుగంటి భూమ్ రెడ్డి, చెప్యాల మమత, పెద్దపల్లి భవాని, ఎంపీటీసీలు కొత్తూరు సంధ్య, మిట్టపల్లి మల్లేశం, మెడబోయిన తిరుపతి గ్రామ శాఖ అధ్యక్షులు బిల్ల వెంకట్‌రెడ్డి, కత్తుల రమేష్, కొమ్ము కొమురయ్య, రాగుల వెంకటయ్య, తోడేటి శ్రీనివాస్ మండల నాయకులు వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, హుస్నాబాద్ మారెట్ కమిటీ వైస్ చైర్ పర్సన్ రామోజు రజిత, సింగర్ వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఆకవరం భవాని, రామోజు కృష్ణమాచారి, కొత్త కైలాసం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.