కార్పొరేషన్, అక్టోబర్ 30 : విద్యుత్ చార్జీలు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని బీఆర్ఎస్ తిప్పికొట్టింది. సామాన్యులపై భారం పడకూడదనే ఉద్దేశంతో విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఎదుట బలంగా వాదనలు వినిపించి, విజయం సాధించింది. ఫలితంగా ఈఆర్సీ ప్రతిపాదలను తిరస్కరించగా, రాష్ట్ర ప్రజలపై 18,500 కోట్ల భారం తప్పింది. ఈ విజయానికి సూచికగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు చేసుకోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునివ్వగా, బుధవారం ఉమ్మడి జిల్లాలో సంబురాలు చేసుకున్నారు. అంతటా కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. రాష్ట్ర ప్రజలపై అడ్డ్డగోలుగా విద్యుత్ చార్జీలు పెంచాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సరైన పద్ధతిలో ఈఆర్సీ ఎదుట ఉంచడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజయం సాధించారని కొనియాడారు. జగిత్యాల జిల్లా కేంద్రంతోపాటు కోరుట్లలో మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా కేంద్రంలో నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పాల్గొన్నారు.