తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బద్నాం చేయాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని, లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టును అపవిత్రం చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ నివేదికపై సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. కాళేశ్వరం నీళ్లను బిందెలతో ఎత్తుకొచ్చి తెలంగాణ అమర వీరుల స్తూపాలు, తెలంగాణ తల్లి విగ్రహాలకు అభిషేకాలు చేశారు. అమరుల ఆత్మలు శాంతించాలని ప్రార్థించారు. అది పీసీ ఘోష్ కమిషన్ కాదని, పీసీసీ కమిషన్ అంటూ విరుచుకుపడ్డారు. ప్రాజెక్టుపై ఇచ్చింది చెత్త రిపోర్టని, అది చిత్తు కాగితమని విమర్శించారు. పీసీ ఘోష్ కమిటీ నివేదిక తప్పుల తడక అని వాటి ప్రతులను కాల్చివేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పీసీ ఘోష్ రిపోర్ట్.. పీసీసీ రిపోర్ట్
తిమ్మాపూర్, సెప్టెంబర్ 1 : పీసీ గోష్ రిపోర్టు న్యాయబద్ధమైనది కాదని.. అది పీసీసీ రిపోర్ట్ అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దృష్టి మరల్చేందుకే ప్రభుత్వం డ్రామాలు ఆడుతున్నదని మండిపడ్డారు. సోమవారం నాయకులతో కలిసి ఎల్ఎండీ జలాశయంలోకి దిగి బిందెల్లో తెచ్చిన నీళ్లతో ఎల్‌ఎండీకాలనీలో ఉన్న అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేశారు. అనంతరం పీసీ ఘోష్ రిపోర్ట్‌ను పెట్రోల్ పోసి దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్టు రిపోర్ట్ ఇస్తే ఊరుకోమని హెచ్చరించారు.
అది పకా ప్రణాళికతో పీసీసీ కార్యాలయంలో రాసుకున్నదేనని విమర్శించారు. మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లు క్రాక్ వస్తే మరమ్మతు మరిచి, ప్రాజెక్టునే తప్పు, నేరంగా చూపుతున్నారని ధ్వజమెత్తారు. వరదలతో రాష్ట్రం అతలాకుతలమై ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత రావడంతోనే బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేందుకే ఆగమేఘాల మీద రెండు రోజులు అసెంబ్లీ పెట్టారని మండిపడ్డారు. రైతులకు సరిపడా యూరియా తేలేని దద్దమ్మ ప్రభుత్వం కాళేశ్వరం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు గడ్డం నాగరాజు, కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ఉల్లెంగుల ఏకాందనం, సిద్ధం వేణు, శేఖర్‌గౌడ్, పాశం అశోక్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రాజెక్టుపై రాజకీయ కక్ష
కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 1 : కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కక్షతో కేసీఆర్ పేరును అప్రతిష్ట పాలు చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మండిపడ్డారు. సోమవారం బీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్, గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో ఎల్ఎండీ నుంచి కాళేశ్వర జలాలను బిందెలతో తీసుకొచ్చి మార్కెట్ రోడ్డులోనే అమరవీరుల స్తూపానికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ‘జై కేసీఆర్, జై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు. నారదాసు హాజరై, మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు మానుకొని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరంపై ఒకసారి విజిలెన్స్ విచారణ అని, మరోసారి ఎన్డీఎస్ఏ రిపోర్టు అని, ఘోష్ కమిటీ అని వివిధ పేర్లుతో విచారణ చేసి కాళేశ్వర ప్రాజెక్టును అపవిత్రం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు రక్షణ కోసం పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేశ్, నాయకులు తిరుపతినాయక్, కాసారపు శ్రీనివాస్, ఐలేందర్, గందె మాధవి, కోల సంపత్, మహేశ్, కర్ర సూర్యశేఖర్, చీటి రాజేందర్రావు, వసంతరావు, చుక్క శ్రీనివాస్, మోహన్, ఆరె రవిగౌడ్, రేణుక, పావని, రాజు తదితరులు పాల్గొన్నారు.
కావాలనే విషప్రచారం
బోయినపల్లి రూరల్, సెప్టెంబర్ 1: తెలంగాణ జీవధార కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే విషప్రచారం చేస్తున్నదని, కేవలం రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం, పీసీ ఘోష్ తప్పుడు నివేదికలపై మండిపడ్డారు. సోమవారం బోయినపల్లి మండలం కొదురుపాక రస్తా వద్ద ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.
అనంతరం ర్యాలీగా వెళ్లి మానేరు నీటిలో పసుపు, కుంకుమ, పూలు చల్లి పూజలు చేశారు. తర్వాత నీటిని తీసుకువచ్చి తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరుల స్తూపానికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా తోట ఆగయ్య మాట్లాడారు. వృథాగా పోయే గోదావరి జలాలను ఎత్తిపోసి మిడ్ మానేరు, అన్నపూర్ణ, కొండపోచమ్మ సాగర్‌కు తరలించడం కాళేశ్వరంలో భాగం కాదా..? ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. కావాలనే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు గ్రామగ్రామాన కాళేశ్వరం ప్రాజెక్టుకు గొప్పతనాన్ని వివరించాలని సూచించారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేలా కృషిచేయాలన్నారు. అనతరం నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే తప్పుడు నివేదికలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అబద్ధపు హామీలతో గద్దెనెకిన కాంగ్రెస్ సరార్ ప్రాజెక్టుపై విష ప్రచారం చేయడం తగదన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, సిరిసిల్ల జడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాల కొండ అరుణ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గూడూరి ప్రవీణ్, మాజీ జడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెర పాక కొండయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.