బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాటకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. నాయకులు వెళ్లకుండా ఎక్కడికక్కడ నిర్బంధించి అరెస్ట్‌లు చేశారు. మరోవైపు గురుకుల హాస్టళ్లలోనికి బీఆర్ఎస్ నాయకులు రాకుండా గేట్లు వేసి తాళాలు వేశారు. దీంతో నాయకులు గేట్ల ఎదుటే ఆందోళనకు దిగారు. గురుకుల బాటకు వెళ్తున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రోజంతా గృహ నిర్భంధంలో ఉంచారు. మరో పక్క చొప్పదండి మండలం రుక్మాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను అదుపులోకి తీసుకుని రామడుగు పోలీసు స్టేషన్లో మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్భంధించారు.
కరీంనగర్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ)/రామడుగు : బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాటపై నిర్బంధం కొనసాగింది. ఎక్కడికక్కడ అరెస్టులు, అడ్డగింతలతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. గురుకుల బాట కోసం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి రుక్మాపూర్, చొప్పదండి, మల్లాపూర్, ధర్మపురి, అల్లీపూర్, చెల్గల్లోని పలు గురుకులాలను సందర్శించేందుకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ శ్రీపురంకాలనీలోని తన ఇంటి నుంచి శనివారం ఉదయం బయలు దేరారు. కరీంనగర్ శివారులోని నగునూర్‌కు చేరుకోగానే మాజీ ఎమ్మెల్యే రవిశంకర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలుసుకుని మరో మార్గంలో ధర్మపురి వెళ్లేందుకు కొప్పుల వెనుదిరిగారు. అయితే, అప్పటికే నగునూర్ వద్ద ఉన్న పోలీసులు ఆయన కాన్వాయిని గమనించి వెంబడించారు. తీగలగుట్టపల్లి వద్ద ఓవర్‌టెక్ చేసి, కొప్పులను తమతో రావాలని ఆదేశించారు.
అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో కారు డోర్లు తెరిచేందుకు ప్రయత్నించారు. దాంతో కొప్పుల లాక్ చేయించగా, అరగంటపాటు తీగలగుట్టపల్లి రహదారిపైనే వాహనాన్ని చుట్టు ముట్టి కదలకుండా చేశారు. కొప్పుల వాగ్వాదానికి దిగారు. తన ఆరోగ్యం బాగా లేదని, తనను ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారో చెప్పాలని వాదించారు. ముందస్తు అరెస్టు చేస్తున్నామని పోలీసులు చెప్పడంతో.. తాను ఎటూ వెళ్లడం లేదని, ఇంటికి వెళ్తున్నట్టు చెప్పినా పోలీసులు వదలకుండా ఇంటి వరకు వచ్చి గృహనిర్బంధం చేశారు. శనివారం సాయంత్రం వరకు ఆయన ఇంటి చుట్టూ 20 మందికిపైగా కాపలా కాశారు.
రుక్మాపూర్‌లో సుంకె అరెస్ట్
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి రుక్మాపూర్, చొప్పదండి గురుకులాలను సందర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ముందుగానే రుక్మాపూర్ చేరుకున్నారు. స్థానిక మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ఉన్న విషయం తెలుసుకున్న సుమారు 100 మంది పోలీసులు, అక్కడికి వెళ్లి రవిశంకర్‌ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని వాదించినా వినకుండా.. పోలీస్ వాహనంలో ఎక్కించుకొని కరీంనగర్‌కు తరలిస్తున్నట్టు చెప్పారు. ఆయనతోపాటు ఉన్న పలువురు బీఆర్ఎస్ నాయకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. చివరకు రామడుగు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు తరలి వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
ముత్తారంలో బీఆర్ఎస్ నాయకుల అడ్డగింత
ముత్తారం, నవంబర్ 30 : ముత్తారం మండలంలోని కస్తూర్బా పాఠశాలను సందర్శించడానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ను పాఠశాల సిబ్బంది పర్మిషన్ పేరుతో అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ ఎస్ నాయకులు, పాఠశాల సిబ్బందికి వాగ్వాదం జరిగింది. దీంతో పుట్ట మధూకర్‌తోపాటు కొంత మందిని లోనికి అనుమతించారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ సర్కారు పరిపాలనను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. పాఠశాలలో ప్రస్తుతం ఒక విద్యార్థి అస్వస్థతకు గురైందని, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు.
గురుకులాల భవిష్యత్తు ప్రశ్నార్థకం : మాజీ మంత్రి కొప్పుల
రాష్ట్రంలో గురుకులాలను భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నార్థకం చేస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. పదకొండు నెలల పాలనలోనే 52 మంది గురుకుల విద్యార్థులు బలయ్యారని ఆవేదన చెందారు. కేసీఆర్ నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లల కోసం 1100 గురుకులాలు ఏర్పాటు చేశామని, ప్రతి గురుకుల విద్యార్థిపై ఏటా 1.20 లక్షలు ఖర్చు చేసినట్టు గుర్తు చేశారు. ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం గురుకుల వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు కంకణం కట్టుకున్నదని, నిధులు ఇవ్వకుండా, నాణ్యమైన ఆహారం అందించకుండా నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు. నాణ్యమైన భోజనం అందక విద్యార్థులు రోడ్లపైకి వస్తున్నారని, పురుగుల అన్నం ఎలా తినాలని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క విద్యార్థి అయినా మరణించిన సందర్భం ఉన్నదా..? ఒక్కరైనా రోడ్డెక్కిన పరిస్థితి కనిపించిందా..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం కాకుండా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి గురుకులాలకు కేటాయించిన బడ్జెట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అన్నం పెట్టాలని అడిగితే అరెస్టులా? : మాజీ ఎమ్మెల్యే సుంకె
ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు పట్టెడన్నం పెట్టాలని అడిగితే అరెస్ట్ చేస్తారా..? అని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తనను, మాజీ మంత్రి కొప్పులను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ సర్కార్ సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన పదకొండు నెలల్లోనే 52 మంది విద్యార్థులు మరణించారని, అందులో 38 మంది ఫుడ్ పాయిజన్‌తోనే చనిపోయారని ఆవేదన చెందారు. పాలన గాలికి వదిలేసి నేరపూరిత నిర్లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను పొట్టన పెట్టుకుంటున్నదని ఆరోపించారు. రాష్ర్టానికి విద్యాశాఖ మంత్రి లేరని, ముఖ్యమంత్రికి ఢిల్లీకి తిరిగేందుకే సమయం సరిపోతలేదని అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులు చనిపోతున్నా ఒక్క సమీక్ష కూడా నిర్వహించని ప్రభుత్వానికి విద్యార్థుల ఉసురు తప్పదన్నారు.
తప్పులు బయట పడతాయనే అడ్డగింత : మాజీ ఎమ్మెల్సీ నారదాసు
తమ తప్పులు బయట పడతాయనే భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు, ప్రజల నోళ్లు నొక్కుతున్నదని మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నారదాసు లక్ష్మణ్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు. బీఆర్ఎస్ గురుకులాల బాటను ఉద్దేశపూర్వకంగా అడ్డుకొని, కొప్పుల ఈశ్వర్, సుంకె రవిశంకర్‌ను అక్రమంగా అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. వారిని నిర్బంధించడం ప్రభుత్వ పిరికి చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని, ఆ హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కప్పగెంతుల పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని ప్రతిపక్షాలు, ప్రజలు చేస్తున్న సూచనలు పాటించాలని హితవుపలికారు.
అల్లీపూర్ గురుకులం ఎదుట ధర్నా
రాయికల్, నవంబర్ 30 : జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, బీఆర్ఎస్ నాయకులు శనివారం రాయికల్ మండలం అల్లీపూర్ బీసీ సంక్షేమ గురుకుల సందర్శనకు వెళ్లారు. ఈ సమయంలో సిబ్బంది గేట్లకు తాళం వేయడంతో పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అనంతరం ప్రహరీ పక్కన చిన్న దారి నుంచి లోపలికి వెళ్లి విద్యార్థులకు అందుతున్న వసతులు, మ ధ్యాహ్న భోజనం పరిశీలించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల నిర్వహణలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కనీసం విద్యార్థుల బాగోగులు తెలుసుకునేందుకు కూడా గురుకులాల్లోకి అనుమతించడం లేదని మండిపడ్డారు.
మల్లాపూర్‌లో రాస్తారోకో
ధర్మారం, నవంబర్ 30 : ధర్మారం మండలం మల్లాపూర్‌లోని బాలికల గురుకుల సందర్శనకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వస్తున్నారని బీఆర్ఎస్ మండల నాయకులు ఉదయం 11 గంటలకు అక్కడకు చేరుకున్నారు. అయితే పోలీసులు కొప్పులను కరీంనగర్‌లోనే నిర్బంధించడం, ప్రిన్సిపాల్ లోపలికి అనుమతి లేదని నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులం వెయిటింగ్ హాల్లోనే భీష్మించుకుని కూర్చున్నారు. అయినా లోపలికి అనుమతించకపోవడంతో డైనింగ్ హాల్‌కు వెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే అకడికి చేరుకున్న ఎస్ఐ శీలం లక్ష్మణ్, పోలీస్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో నాయకులు కరీంనగర్- రాయపట్నం రహదారిపైకి చేరుకొని రాస్తారోకో చేశారు.