యూరియా కోసం అరిగోస పడుతున్న అన్నదాతకు మద్దతుగా బీఆర్ఎస్ గర్జించింది. ఎక్కడికక్కడ రైతులతో కలిసి ఆందోళనలతో హోరెత్తించింది. సోమవారం మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేసి, సర్కారుకు వ్యతిరేకంగా నినదించింది. యూరియా ఇవ్వలేని ప్రభుత్వం ఉంటే ఎంత? లేకుంటే ఎంత? అంటూ ఆగ్రహించింది. అన్నదాతలను గోస పెట్టడం మంచిది కాదని హితవు పలికింది. సకాలంలో ఎరువులు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేసింది. లేదంటే రైతుల పక్షాన ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించింది.
శంకరపట్నం/ చిగురుమామిడి/ వీణవంక, ఆగస్టు 25 : యూరియా కొరతపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహించారు. రైతులకు మద్దతుగా నిరసనలు తెలిపారు. సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో బస్టాండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. అనంతరం జాతీయ రహదారిపై ధర్నా చేశారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు.
చిగురుమామిడి సింగిల్ విండో కార్యాలయం ఎదుట రైతులు బైఠాయించి రాస్తారోకో చేశారు. వీణవంకలో యూరియా లారీని అడ్డుకొన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని భరతమాత కూడలి వద్ద బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. సుమారు గంట పాటు అక్కడే బైఠాయించడంతో మెట్పల్లి, ఖానాపూర్, నిర్మల్‌కు వెళ్లే బస్సులు, ప్రైవేట్ వాహనాలు నిలిచిపోగా, పోలీసులు సముదాయించారు. అదే సమయంలో ఓ విద్యార్థిని తాను పరీక్ష రాసేందుకు తొందరగా వెళ్లాలని కోరడంతో నాయకులు వెంటనే స్పందించి ఆందోళన విరమించారు.
సారంగాపూర్ మండల కేంద్రంలో ధర్నా, రాస్తారోకో చేశారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోగా, ఎస్ఐ గీత సిబ్బందితో అక్కడికి చేరుకొని ఆందోళన విరమింపజేశారు. అనంతరం నాయకులు తహసీల్ ఆఫీస్‌లో అధికారులకు వినతి పత్రం అందజేశారు. రాయికల్ మండల కేంద్రంలోని శివాని విగ్రహం వద్ద ధర్నా చేశారు. అనంతరం రైతులలో కలిసి నాయకులు ర్యాలీగా వెళ్లి ఏవోకు వినతి పత్రం అందజేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో సొసైటీ వద్ద రైతులు పడిగాపులు గాశారు. అయితే యూరియా అందుబాటులో లేకపోవడంతో ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎన్నడూ యూరియా కోసం గోస పడలేదని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ఇరవై నెలల పాలనలో అరిగోస పడుతున్నారని ఆవేదన చెందారు. నాటి సమైక్య రాష్ట్రంలో మాదిరిగానే క్యూలో చెప్పులు పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని, పోలీస్ పహారా మధ్యన పంపిణీ చేసే రోజులు వచ్చాయని వాపోయారు. ఒక్క బస్తా కోసం నిద్రాహారాలు మాని పడిగాపులు పడుతున్నారని, సాగు పనులన్నీ వదులుకొని తిరుగుతున్నారని ఆవేదన చెందారు. ఇంత చేసినా దొరకడం లేదని, దొరికినా ఒక్క బస్తా ఏ మూలకూ సరిపోలేని పరిస్థితి ఉందన్నారు.
ఇలా రైతులను గోస పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు. కనీసం యూరియా కూడా సరిగ్గా ఇవ్వలేని ప్రభుత్వం ఉంటే ఎంత? లేకుంటే ఎంత? అని మండిపడ్డారు. ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కొరత తీర్చాలని, రైతులకు సరిపడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. రైతులపై కక్ష పూరిత చర్యలు మానుకోవాలని, వారి సంక్షేమానికి పాటు పడాలని హితవు పలికారు.
ఉదయం నుంచే నిరీక్షణ
ముస్తాబాద్, ఆగస్టు 25 : ముస్తాబాద్ మండల కేంద్రంలోని శుభోదయం మండల సమాఖ్య గోదాంకు శనివారం యూరియా రాగా, సోమవారం పంపిణీ చేస్తామని సిబ్బంది చెప్పారు. ఈ విషయం తెలిసి సుమారు 400కుపైగా రైతులు తరలివచ్చారు. ఆలస్యంగా వస్తే దొరుకుతుందో లేదోనని ఉదయం నాలుగు గంటల నుంచే గోదాం వద్ద క్యూ కట్టారు. పోలీస్ పహారా మధ్యన పది గంటల నుంచి ఒక్కొక్కరికి ఒక్కో బ్యాగు చొప్పున 140 మందికి మాత్రమే పంపిణీ చేశారు. దాదాపు 250 మంది రైతులు నిరాశతో వెనుదిరిగారు.
మూడు గంటల నిరీక్షణ
సైదాపూర్, ఆగస్టు 25 : సైదాపూర్ మండలం వెన్కేపల్లి సింగిల్ విండో పరిధిలోని బొమ్మకల్ గోదాంకు యూరియా వస్తుందన్న సమాచారంతో రైతులు సోమవారం ఉదయం నుంచే తరలివచ్చారు. దాదాపు 600 మంది రాగా, ఉదయం 11 గంటల నుంచే లైన్లో ఉన్నారు. కొద్దిసేపు నిరీక్షించి, చెప్పులను క్యూలో పెట్టారు. ఆ తర్వాత టోకెన్లు ఇవ్వడంతో లైన్లో నిలబడ్డారు. సుమారు 3 గంటల నిరీక్షణ తర్వాత మధ్యాహ్నం వరకు 340 బస్తాలు రాగా, ఒక్కొక్కరికి ఒక్కో బ్యాగును అందించారు. అయితే దాదాపు 250 మందికి దొరకకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యూరియా కొరతను తీర్చాలని, అందరికీ సరిపడా అందించాలని డిమాండ్ చేశారు. అలాగే వెన్నంపల్లి సొసైటీ వద్ద 340 బస్తాలు, ఆకునూర్లో సైదాపూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ వద్ద 230 బస్తాలు పంపిణీ చేశారు.
పోలీస్‌స్టేషన్‌కు యూరియా లారీ
వీణవంక, ఆగస్టు 25 : వీణవంక మండల రైతులు యూరియా కోసం కొద్ది రోజులుగా పడిగాపులు గాస్తున్నారు. సోమవారం వీణవంక సొసైటీ పరిధిలోని నర్సింగాపూర్ గోదాంకు 450 బస్తాలతో వెళ్తున్న లారీని మండలకేంద్రంలో సుమారు 300 మంది రైతులు అడ్డుకున్నారు. ఇరువై రోజుల నుంచి తమకు ఒక్క బస్తా దొరకడం లేదని, నర్సింగాపూర్ గోదాంకు వస్తే అక్కడి రైతులే ముందుగా తీసుకుంటున్నారని వాపోయారు. రోజుల కొద్ది ఎదురుచూస్తున్నామని ఆవేదన చెందారు.
సుమారు గంటకుపైగా లారీని కదలనివ్వకుండా రోడ్డుపైనే నిరసన తెలిపారు. విషయం తెలియడంతో ఎస్ఐ ఆవుల తిరుపతి అక్కడకు చేరుకొని, అరగంటపాటు రైతులు, మాజీ సర్పంచ్ నీల కుమార్, మాజీ జడ్పీటీసీ ప్రభాకర్‌తో చర్చించారు. చివరకు వీణవంక రైతుల పేర్లు నమోదు చేసుకొని మంగళవారం ఉదయం యూరియా పంపిణీ చేస్తామని ఎస్ఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అప్పటికప్పుడే సొసైటీ సిబ్బంది రైతుల పేర్లు నమోదు చేయగా, యూరియా బస్తాల లారీని పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
రోడ్డెక్కిన అన్నదాత
చిగురుమామిడి, ఆగస్టు 25 : చిగురుమామిడి సింగిల్ విండో కార్యాలయానికి సోమవారం సాయంత్రం యూరియా వస్తుందని సిబ్బంది సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం 3గంటల తర్వాత 230 బ్యాగుల లారీ లోడ్ రాగా, చిగురుమామిడి, సీతారాంపూర్, లంబాడీపల్లికి చెందిన సుమారు 700 మంది రైతులు అక్కడకు చేరుకున్నారు. అయితే ఒక్కొక్కరికి రెండు బ్యాగుల చొప్పున కేవలం 125 మందికే ఇవ్వడంతో క్యూలో ఉన్న మిగతా రైతులు ఆగ్రహించారు. సింగల్ విండో కార్యాలయం ఎదుట కరీంనగర్, హుస్నాబాద్ రహదారిపై రాస్తారోకో చేశారు.
ఎస్ఐ సాయి కృష్ణ వచ్చి ఆందోళన విరమించాలని కోరినా, అధికారులు హామీ ఇస్తేనే విరమిస్తామని స్పష్టం చేశారు. వెంటనే ఏవో రమ్యశ్రీ అక్కడకు చేరుకొని, మరో యూరియా లోడు రాగానే అందరికీ ఇస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. కొంత మంది రైతులు వెళ్లిపోగా, 225 మందికి టోకెన్లు అందజేశారు.
250 మందికి నిరాశే
మానకొండూర్, ఆగస్టు 25 : మానకొండూర్ విశాల సహకార పరపతి సంఘం లిమిటెడ్‌కు సోమవారం మధ్యాహ్నం 3గంటలకు 430 బస్తాల లారీ లోడ్ రాగా, విషయం తెలిసి దాదాపు 500 మంది రైతులు తరలివచ్చారు. సాయంత్రం 4గంటల నుంచి క్యూలో ఉన్నారు. సిబ్బంది ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. అయితే, దాదాపు 250 మందికిపైగా రైతులకు దొరకకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
సొసైటీ పరిధిలోని రైతులకు కాకుండా చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన ఓ రైతుకు 20 బస్తాలు ఇచ్చారని, ఆయన ఆటోలో బస్తాలను తీసుకెళ్లాడని మండిపడ్డారు. ఏవో శ్రీనివాస్‌రెడ్డి, సొసైటీ సీఈవో లక్ష్మారెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఇతర ప్రాంతాలకు చెందిన రైతులకు ఎందుకిచ్చారో చెప్పాలని నిలదీశారు. దీంతో యూరియా ఇతర ప్రాంతాల రైతులెవరికీ ఇవ్వలేదని, ఆ 20 బస్తాలను ఇందుర్తికి తీసుకెళ్లకుండా స్వాధీనం చేసుకున్నామని ఏవో చెప్పారు. రెండు రోజుల్లో లోడ్ వస్తుందని, అందరికీ అందిస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు.
ఎదురుచూసినా దొరకలే
నేను కౌలు రైతును. మూడెకరాల్లో వరి సాగు చేసిన. నాట్లేసి యూరియా కోసం తిరుగుతున్న. ముస్తాబాద్ మహిళా గ్రూప్ గోదాంకు యూరియా వచ్చిందని తెలిసి వచ్చిన. అప్పటికే రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నరు. గోదాం వద్ద సిబ్బంది ఎవరూ లేకపోవడంతో వాళ్ల కోసం ఎదురుచూసినం. అయినా యూరియా దొరకలేదు. ఇట్లయితే మేం ఎవుసం చేసుడెట్ల? యూరియా దొరకకపోతే సాగు వదిలిపెట్టుడే అయితది.
– రాగం పరశురాములు, రాగంవారిపల్లె (ముస్తాబాద్)