Sunke Ravishankar | చొప్పదండి, మార్చి 22 : చొప్పదండి నియోజకవర్గంలో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.20 వేలు నష్ట పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. శనివారం చొప్పదండి మండలంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి అకాల వర్షాలకు నేలకొరిగిన పంటలను, చొప్పదండి వ్యవసాయ మార్కెట్ లో తడిసిన ధాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చొప్పదండి నియోజకవర్గంలో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న, వరి పంట రైతులు కొన్ని వందల ఎకరాలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షానికి దెబ్బతిని రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారని అన్నారు. ఈ సంవత్సరం రైతుకు 10 ఎకరాలు ఉంటే నీళ్లు లేక నాలుగు ఐదు ఎకరాలు పంటలు వేసుకున్నారని ఆ నాలుగు ఎకరాలు పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు.
కరీంనగర్ జిల్లా కలెక్టర్ చొప్పదండి నియోజకవర్గంలో ఎండిపోయిన పంటలు వర్షానికి నేలకొరిగిన పంటలను సర్వే చేసి ఎకరానికి రూ. 20 వేలు నష్టపరిహారం రైతులకు వచ్చే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. అలాగే చొప్పదండి వ్యవసాయం మార్కెట్ లో అకాల వర్షానికి కొట్టుకపోయిన ధాన్యానికి ప్రభుత్వం పరిహారం అందించాలని అన్నారు. మార్కెట్ కు తీసుకువచ్చిన తడిసిన ధాన్యానికి రైతుకు మద్దతు ధర చెల్లించాలని వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ రాజేశ్వరి కి సూచించారు.
కార్యక్రమంలో మాజీ జెడ్పీసీలు ఇప్పనపల్లి సాంబయ్య, మాచర్ల సౌజన్య- వినయ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు లోక రాజేశ్వర్ రెడ్డి నాయకులు నల్లమాచు రామకృష్ణ, కొత్తూరి మహేష్, దండె కృష్ణ, బత్తిని సంపత్, అజ్జు, మావురం మహేష్ తదితరులున్నారు.