కరీంనగర్ కార్పొరేషన్/ వీణవంక/ ఇల్లంతకుంట/ గోదావరిఖని, డిసెంబర్ 5 : మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టులపై ఆగ్రహం వ్యక్తమైంది. గురువారం ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలతో హోరెత్తింది. కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సాయంత్రం భారీ రాస్తారోకో చేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొనగా, నాయకులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
ఇక్కడ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మేయర్ సునీల్‌రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డవేని మధు, మండలాల అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్, శ్యాంసుందర్, బీఆర్ఎస్ నాయకులు ఐలేందర్, ప్రశాంత్‌రెడ్డి, తిరుపతినాయక్, సంపత్‌రావు పాల్గొన్నారు. ఎమ్మెల్యేల అరెస్ట్‌లను తీవ్రంగా ఖండించారు.
ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధకాండ కొనసాగిస్తున్నదని, ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నదని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీకాలనీ వద్ద రాజీవ్ రహదారిపై నాయకులు ధర్నాకు దిగారు. అనంతరం అంబేదర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. వీణవంకలో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపి, రేవంత్‌రెడ్డి బొమ్మ ఉన్న ఫ్లెక్సీని దహనం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకొని మంటలను ఆర్పారు. ఇల్లంతకుంటలో నాయకులు నిరసన తెలిపి, ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఒక ప్రకటనలో ఖండించారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తున్నదని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఎమర్జెన్సీ కంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రజా సమస్యలపై కనీసం ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడడం తప్పు అన్న విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధుల గొంతును కూడా నొక్కుతున్నారు. ఎమ్మెల్యేలకు కనీస స్వాతంత్య్రం లేకుండా చేస్తున్నారు. అక్రమంగా కేసులు పెట్టి బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడం సరికాదు. అయినా ఇలాంటి అరెస్టులకు మేం భయపడేది లేదు. ప్రజలే కాంగ్రెస్‌కు తగిన రీతిలో బుద్ధి చెబుతారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా తప్పే అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇలాంటి తీరును సహించేంది లేదు. ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతాం.
– కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్