MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, ఫిబ్రవరి 3: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా కష్టపడి పని చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పిలుపునిచ్చారు. కోరుట్ల మంగళవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కోరుట్ల పట్టణ మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎమ్మెల్యే బీ-ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపిన ఘనత బీఆర్ఎస్ పార్టీ దేనని పేర్కొన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హాయంలో రైతులు, పేద, మధ్య,తరగతి యువత, మహిళల సంక్షేమం కోసం చారిత్రక నిర్ణయాలు తీసుకుని అభివృద్ధి పథకాలను అమలు చేసిందని తెలిపారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు వంటి పథకాలు బీఆర్ఎస్ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. కోరుట్ల మున్సిపల్ ఎన్నికల్లో 75 శాతం మంది యువకులకు పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించామని తెలిపారు.యువతలో ఉన్న ఉత్సాహం, నూతన ఆలోచనలు, అభివృద్ధిపై ఉన్న దృఢ సంకల్పంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో యువతకు పెద్దపీట వేసినట్టు చెప్పారు. యువత రాజకీయాల్లోకి రావడం ద్వారా స్థానిక సమస్యలపై చురుకైన స్పందన ఉంటుందని పేర్కొన్నారు. పారదర్శక పాలన, వేగవంతమైన అభివృద్ధి యువత తోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
బీఆర్ఎస్ ఎల్లప్పుడూ యువతకు అండగా నిలుస్తుందని, వారికి నాయకత్వ అవకాశాలు కల్పించడమే పార్టీ విధానమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మున్సిపల్లో చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు. పట్టణంలో రూ. 50 కోట్ల నిధులతో అంతర్గత రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులు కల్పించిన విషయాన్ని ప్రజలకు విడమర్చి చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసపూరిత వాగ్దానాలు, హామీల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో మున్సిపాలిటీలో ఏ ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదని విమర్శించారు. అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకునే బీఆర్ఎస్ ను కోరుట్ల ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కోరుట్ల మున్సిపాలిటీనీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి, సీనియర్ నాయకులు సింగిరెడ్డి నారాయణరెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.