Interview | ‘మంథని నియోజకవర్గాన్ని కాంగ్రెస్ అరవై ఏండ్లు పాలించినా చేసిందేమీ లేదు. తండ్రీ కొడుకులు నలభై ఏండ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నా చెప్పుకోదగ్గ పనులు చేయలేదు. కానీ, నాకు నియోజకవర్గ ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వడం వల్ల ఎంతో అభివృద్ధి చేశాం. పోయినసారి నేను ఓడిపోయినా జడ్పీ చైర్మన్‌గా అవకాశం రావడం వల్లే మళ్లీ ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమైంది. అరవై ఏండ్లలో జరగని అభివృద్ధిని గడిచిన తొమ్మిదేండ్ల పాలనలో చేసి చూపించాం. ప్రజలు నాటి కాంగ్రెస్ పాలనకు.. నేటి బీఆర్ఎస్ పాలనకు తేడా గుర్తించాలి. పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలువాలి. మీ మధ్యన ఉండే ఈ పేదింటి బిడ్డకు అవకాశమివ్వండి. మీ కష్టాల్లో తోడుంటా. మీ కలలను సాకారం చేస్తా.’ అని మంథని అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
పెద్దపల్లి, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ‘మంథని నియోజకవర్గాన్ని కాంగ్రెస్ 60 ఏండ్ల పాటు పాలించింది. కానీ ఏం చేయలేకపోయింది. అందుకే ఈ ప్రాంతం ఇప్పటికీ రాష్ట్రంలో మారుమూల ప్రాంతంగా ఉండిపోయింది. తండ్రీ కొడుకులు 40 ఏండ్లు పాలించినా చేసింది శూన్యం. బీఆర్ఎస్కు నియోజకవర్గ ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే ఎంతో అభివృద్ధి చేశాం. ఈ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో చారిత్రాత్మక ప్రగతి సాధించాం.’ అని బీఆర్ఎస్ మంథని అభ్యర్థి, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను ఓడిపోయినా పార్టీ అక్కున చేర్చుకొని జడ్పీ చైర్మన్ పదవిని ఇవ్వడంతో ఈ ప్రాంతాన్ని సాధ్యమైంత అభివృద్ధి చేశానని, నియోజకవర్గం మరింత ప్రగతి సాధించాలంటే మరోసారి తనకు ఎమ్మెల్యేగా ప్రజలు అవకాశం కల్పించాలని కోరారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మకుండా బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
పుట్ట మధు: నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నాలుగోసారి పోటీ చేస్తున్నా. 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేశా. తర్వాత బీఆర్ఎస్లో చేరా. పార్టీ అభ్యర్థిగా మూడో సారి నాకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉంది. ఒక పేద కుటుంబంలో పుట్టి పెరిగిన నాపై నమ్మకం, విశ్వాసం ఉంచి మరోసారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇది నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు, ఆశీస్సులతోనే సాధ్యమైంది.
పుట్ట మధు: నేను నాలుగేండ్ల మూడు నెలలు మంథని ఎమ్మెల్యేగా.. ఆ తర్వాత పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌గా ఉన్నా. ఈ తొమ్మిదేళ్లల్లో జరిగిన అభివృద్ధి అసలు మంథని నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ.. ఎప్పుడూ జరగలేదు. ఇది చారిత్రాత్మకమైన ప్రగతి. 40ఏళ్లు పాలించిన ఒకే కుటుంబం ప్రజలకు చేసిందేమీ లేదు. కానీ, ప్రజలను మభ్య పెడుతూ ఓట్లను పొందుతూ వస్తున్నది. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి శ్రీధర్‌బాబు సిగ్గుపడాలి. నెలనెలా ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేగా జీత భత్యాలు పొందుతూ నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ ఏ సాయం చేయకుండా మాయమాటలతో హైదరాబాద్‌లో ఉండి పాలన చేస్తున్నారు. ఖమ్మంపల్లి-భూపాలపల్లి, తాడ్వాయి, పెద్దపల్లి-కాటారం రోడ్ల అభివృద్ధి జరగాలంటే మళ్లీ ప్రజలు బీఆర్ఎస్కు పట్టంగట్టాలి. 50ఏళ్ల క్రితం ప్రజలకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేదు. వైద్యం, విద్యకు నియోజకవర్గ ప్రజలు నోచుకోలేదు. అనేక గ్రామాలకు కనీస రవాణా సౌకర్యాలు కల్పించలేదు.
తండ్రీ కొడుకులు కల్లబొల్లి కబుర్లు చెప్పడమే తప్ప చేసింది లేదు. గతంలో వర్షాలు కురిస్తే అనేక గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకునేవి. వంతెనలు లేక మహాదేవపూర్, కాటారం, మహాముత్తారం, పలిమెల మండలాల ప్రజలు నిత్యం అనేక అవస్తలు పడేది. ఏటా వానకాలం రాకపోకలు నిలిచి ఎంతో మంది వైద్యం అందక చనిపోయినా పట్టించుకోలేదు. ఇప్పుడా పరిస్థితిని దూరం చేసింది బీఆర్ఎస్ పార్టీనే. 66గ్రామాలను కలిపే 68కిలో మీటర్ల రింగు రోడ్డును పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అటవీ గ్రామాల ప్రజల ఆకాంక్ష రింగురోడ్డును పూర్తి చేసి కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాలను వెలుగులోకి తీసుకొచ్చాం. గంగారం మీదుగా కాళేశ్వరం వెళ్లడం, కాటారం మీదుగా కాళేశ్వరం వెళ్లే రింగు రోడ్డును పూర్తి చేశాం. కాకర్లపల్లి, బిట్టుపల్లి, ధర్మారం, సీతంపల్లి రోడ్లను పూర్తి చేశాం. ప్రజలు త్వరగా తమ గమ్యాన్ని చేరుకునేలా రవాణా సౌకర్యం కల్పించాం. మహాదేవపూర్, మంథనిలో అంబులెన్స్ సౌకర్యాలు, దవాఖానలను ఆధునీకరించి ప్రజలకు వైద్యాన్ని చేరువ చేశాం. నియోజకవర్గంలో అభివృద్ధి చరిత్రను బీఆర్ఎస్ ప్రభుత్వం లిఖించింది.
పుట్ట మధు: బీఆర్ఎస్ ప్రజల పార్టీ. ప్రజల ఎజెండానే పార్టీ ఎజెండా. బీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఖరారు కావడంతోనే నా విజయం ఖరారైంది. బీఆర్ఎస్ సర్కారు నియోజకవర్గంలో వేలాది కోట్లతో అభివృద్ధి చేసింది. గడపగడపకూ సంక్షేమ ఫలాలు అందించింది. రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించాం. ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, ప్రతి పేద బిడ్డకూ కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, అర్హులైన వారందరికీ పింఛన్లు, దళితులకు దళిత బంధు, బీసీ, మైనార్టీలకు లక్ష సాయం అందిస్తున్నది. సమాజంలోని అన్ని కులాలు, మతాలను గౌరవిస్తూ అధికారికంగా పండగలను నిర్వహిస్తున్నది. ప్రభుత్వం చేస్తున్న మేలు ప్రతి ఓటరు గుండెల్లో ఉన్నది. నేను, మా ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లల్లో చేసిన అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలే నా గెలుపునకు దోహద పడుతాయి.
పుట్ట మధు: నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన పేద బిడ్డను. ఒక బీసీ బిడ్డను. నియోజకవర్గంలో పుట్ట మధూకర్ ఒకవైపు, మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకవైపు. ప్రతిపక్షాలన్నీ మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు చేతిలో కీలు బొమ్మలే. గత ఎన్నికల సమయంలో 900 కోట్ల వార్తలు, నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా ఆ ఘటనకు నన్ను బాధ్యుడిని చేస్తూ సోషల్ మీడియాలో విష ప్రచారం చేశారు. నా భార్య పేరిట ఆడియో టేపులు, ఇప్పుడు మరో ఆడియో టేపును సోషల్ మీడియాలో వేసి తనకు ఆపాదించడం శ్రీధర్‌బాబుకు అలవాటైంది. ఆయన ఎక్కడా నా పేరు ఉచ్చరించడు. కానీ, ఆయనకు అనుకూలంగా ఉండే మీడియా, సోషల్ మీడియాలో అనుచరులతో ఈ విష ప్రచారం చేయిస్తాడు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధిష్ఠానం సైతం గుర్తించింది. ఎలాంటి అసత్య ప్రచారాలు చేసినా, కుట్రలకు దిగినా నమ్ముకున్న కార్యకర్తకు అండగా నిలిచి టికెట్ ఇచ్చింది. ప్రజలు ఈ విషయాలన్నీ గ్రహించాలి. బీఆర్ఎస్ శ్రేణులు గ్రహించాలి. ఇలాంటి వాటన్నింటినీ తిప్పి కొట్టాలి.
పుట్ట మధు: నియోజకవర్గ ప్రజలు గతం ఏంటి? ప్రస్తుతం ఏంటి? అనే చర్చ చేయాలి. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో గ్రహించాలి. ఒక కుటుంబానికి ఓటు వేస్తే ఏం కోల్పోయామో గుర్తించాలి. ఓటు అనే గొప్ప ఆయుధాన్ని సరిగా వాడితేనే అంబేద్కర్ కలలు సాకారమవుతాయి. బీఆర్ఎస్ సర్కార్ చేసిందీ, చేస్తున్నదీ చూసి ఓటేయాలి. మాయమాటలు విని మోసపోవద్దు. అభివృద్ధి, సంక్షేమానికే పట్టంగట్టాలి. మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేద్దాం. కడుపులో పెట్టుకొని కాపాడే బీఆర్ఎస్కు అండగా ఉందాం. మంథని నియోజకవర్గ ప్రజలు ఇచ్చే ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీకి, శ్రీధర్‌బాబుకు చెంప పెట్టులా ఉండాలి.
పుట్ట మధు: నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు రెండు సార్లు పోటీ చేసినా అభ్యర్థులే లేరు. అలాంటిది పార్టీ నాకు మూడోసారి అవకాశం ఇచ్చింది. నియోజకవర్గ ప్రజలు నాకు మరోసారి అవకాశం ఇవ్వబోతున్నారు. మా పార్టీ, మా ప్రభుత్వం ఎప్పుడూ ప్రజా సంక్షేమాన్నే కోరుకుంటుంది. అది ఎన్నికలు వచ్చినపుడే కాదు ఎప్పుడూ చేస్తుంది. మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ పునాదులు కూల్చాలన్న కసితో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. వారంతా ఇప్పటికే ప్రచార రంగంలోకి దూకారు. మేం, ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల గుండెల్లోనే ఉన్నాం. మేం చేసిన పనులు నిలిచి ఉంటాయి. సమయం, సందర్భం వచ్చినప్పుడు ప్రజలే పార్టీకి ఓటు వేసి గెలిపించి ఆశీర్వదిస్తారు.
పుట్ట మధు: కొన్ని పార్టీలు సోషల్ మీడియా వేదికగా బట్టకాల్చి మీద వేయడం నేర్చుకున్నాయి. మా ప్రభుత్వంపై, మాపై లేని పోని విమర్శలకు దిగుతున్నాయి. అలాంటి వాటిని ఆ సోషల్ మీడియా ద్వారానే తిప్పి కొడుతాం. వాటిని ప్రజలు నమ్మరు, విశ్వసించరు. అభివృద్ధికే ప్రజలు పట్టం కడుతారు. ఈ ఎన్నిక కాదు, ఏ ఎన్నికైనా పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్దే గెలుపు.