కరీంనగర్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు గులాబీదళం అండగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదంటూ వెన్నంటి నడిచింది. ప్రతీ క్షణం ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న కేటీఆర్ వెంట తామున్నామంటూ మద్దతు తెలిపింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఎదుట బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం హాజరైన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ తెలంగాణ భవన్‌కు తరలివెళ్లారు.
కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలు నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్ట మధూకర్, దాసరి మనోహర్‌రెడ్డి, పోలీస్ హౌసింగ్ సొసైటీ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాయకులు కొండూరి రవీందర్రావు, చల్మెడ లక్ష్మీనరసింహారావు, జిందం చక్రపాణి, బండ శ్రీనివాస్, పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, సిద్ధం వేణు, తదితరుల ఆధ్వర్యంలో వందలాది బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లారు.
తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని మరిచి కుటిల రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కుట్రలు, బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన హమీలను అమలుచేయాలని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నాయకులను బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
నోటీసులు, విచారణ పేరుతో భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని తెలిపారు. ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలను నెరవేర్చే వరకు ప్రజల పక్షాన ప్రతిపక్ష హోదాలో ప్రశ్నిస్తూనే ఉంటామని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇటు కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై జిల్లాల్లోనూ నిరసనలు తెలిపారు. ఓదెలలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.