Paddy Procurement | ధాన్యం కొనుగోళ్లలో మళ్లీ దళారుల దందా మొదలైంది. కోతలు మొదలయ్యాయో లేదో.. అప్పుడే దోపిడీకి తెరలేస్తున్నది. కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వ జాప్యాన్ని ఆసరాగా తీసుకొని, కల్లాల వద్దే కాంటాలు పెడుతూ అగ్గువకే ధాన్యం కొంటున్నట్టు తెలుస్తున్నది. సెంటర్లు ఓపెన్ కాక తప్పనిపరిస్థితుల్లో రైతులు తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. ఒక పక్క గురువారం నుంచి కేంద్రాలు ప్రారంభిస్తున్నట్టు అధికారులు చెబుతున్నా.. ఐకేపీ మాత్రం సిద్ధంకానట్లు తెలుస్తున్నది. డీఆర్డీఏ ఆఫీసర్లు తమ సిబ్బందికి ఇప్పటివరకు శిక్షణ కూడా ప్రారంభించకపోగా, సివిల్ సప్లయ్స్వాళ్లు మాత్రం కేంద్రాలు ఓపెన్ చేస్తున్నట్టు చెప్పుకోవడం అనుమానంగానే ఉన్నది.
కరీంనగర్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో ఎవుసం ఆగమైంది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రణాళికాలోపంతో సాగునీటి సమస్య వెంటాడుతున్నది. ఇప్పటికే సాగునీరందక వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చే దశలో ఎండిపోతున్నాయి. కనీసం చేతికి వచ్చిన పంటకైనా మద్దతు ధర చెల్లించి సకాలంలో కొనుగోలు చేస్తారని ఆశించిన రైతులకు ఇక్కడా నిరాశే ఎదురైంది. గత సీజన్ మాదిరిగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతున్నదని రైతులు ఆరోపిస్తున్నారు.
నిజానికి జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమయ్యాయి. కోతలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో గుర్తించి అక్కడక్కడ అధికారులు ముందుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సిన అవసరమున్నది. కానీ, ఇప్పటి వరకు కేంద్రాలు ప్రారంభించ లేదు. రైతులు కేంద్రాల్లో ధాన్యం పోసి ఎదురు చూస్తున్నారు. గంగాధర వ్యవసాయ మార్కెట్లో అయితే కుప్పలు కుప్పలుగా ధాన్యం పోసిన రైతులు రాత్రి, పగలు అక్కడే కాపలా కాస్తున్నారు.
ఈ ప్రాంతంలో వారం రోజులుగా కోతలు జరుగుతున్నా అధికారులు ఇప్పటి వరకు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. గత యాసంగిలో కూడా ఇలాగే కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జరిగిన జాప్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. అగ్గువకే దళారులకు విక్రయించి కనీస మద్దతు ధరతోపాటు సన్నవడ్లకు 500 బోనస్ కూడా పొంద లేకపోయారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ఇలా వ్యవహరించిందనే విమర్శలు వచ్చాయి. గత సీజన్లో దాదాపు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు అగ్గువ ధరకే దళారులకు అమ్ముకున్నట్టు తెలుస్తున్నది.
ఈ సీజన్లోనూ అదే దుస్థితి
ప్రస్తుత యాసంగి సీజన్లో కూడా అదే దుస్థితి కనిపిస్తున్నది. వారం నుంచి కోతలు ప్రారంభమైనా అధికారులు ఇప్పటి వరకు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. కలెక్టర్ మినహా మంత్రులు కూడా ఇప్పటి వరకు ధాన్యం సేకరణపై సమీక్షించి దిశానిర్దేశం చేయలేదు. ఫలితంగా ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకం కోల్పోతున్న రైతులు, తక్కువ ధరకైనా సరే దళారులకు విక్రయించాలనే ఆలోచనకు వస్తున్నారు. కనీస మద్దతు ధర ఏ గ్రేడు ధాన్యం క్వింటాల్‌కు 2,320, సాధారణ రకానికి 2,300 నిర్ణయించగా, దళారులు మాత్రం 1,800 నుంచి 1,850కే కొనుగోలు చేస్తున్నారు.
కొన్ని చోట్లనైతే 1,750కే రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గంగాధర మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఈ దందా అడ్డూఅదుపు లేకుండా నడుస్తున్నది. చొప్పదండి, కరీంనగర్ రూరల్, మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, చిగురుమామిడి, సైదాపూర్ తదితర ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే కోతలు ముమ్మరం అవుతున్నాయి. ఇక్కడ కూడా ఇప్పటి వరకు కేంద్రాలు తెరువలేదు. ఈ ప్రాంతాలపైనా దళారులు కన్నేసినట్టు తెలుస్తున్నది.
ఇక హుజూరాబాద్ డివిజన్లో చూస్తే ఎక్కువగా యాసంగిలో సీడ్ వడ్లు సాగు చేస్తారు. ఈ ప్రాంతంలో మరో వారం అయితే సన్న రకాలు కోతకు వచ్చే అవకాశముంటుంది. అప్పటి వరకు ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేయకుంటే దళారుల జోక్యం పెరిగే ముప్పు ఉన్నది. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు తెరవకపోతే ఈ సారి కూడా రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తున్నది.
నేటి నుంచి కేంద్రాలు తెరిచేనా..?
ఈ యాసంగి సీజన్లో కరీంనగర్ జిల్లాలో సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వ స్తుందని అధికారులు అంచనా వేశారు. అందులో సీడ్, తిండి కోసం తీసివేస్తే కేంద్రాలకు 3.50 లక్షల మెట్రిక్ టన్నులు రావచ్చని అధికారులు భావిస్తున్నారు. 338 కేంద్రాల ద్వారా ఈ ధాన్యం కొనుగోలు చేయాలని భావించి, గురువారం నుంచి అన్ని కేంద్రాలు తెరిచి ఉంచుతామని చెబుతున్నారు. కానీ, ఎక్కడ ప్రారంభిస్తారు? ఎవరు ప్రారంభిస్తారనే విషయంలో మాత్రం అధికారుల వద్ద సమాధానం లేదు.
గత ఆఖరి సీజన్ వరకు కూడా ఐకేపీకి కేవలం 48 కేంద్రాలు మాత్రమే జిల్లాలో కేటాయించేది. సింగిల్ విండోలకు 239 కేంద్రాలు ఉండేవి. కానీ, వాటికి కేటాయించిన కేంద్రాల సంఖ్యను తగ్గించి ఐకేపీకి 150 కేంద్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, గత నెల 28న కలెక్టర్ పమేలా సత్పతి సమీక్షా సమావేశం నిర్వహించి, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, అన్ని వసతులు సమకూర్చాలని ఆదేశించారు.
ఐకేపీ ద్వారా ఇప్పటి వరకు సిబ్బందికి ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు. కానీ, కేంద్రాలు మాత్రం తెరుస్తామని అధికారులు చెప్పడంలో ఆంతర్యం ఏమిటనేది అర్థంకాని పరిస్థితి. కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ ప్రారంభిస్తున్నారని నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, వారు అందుబాటులో లేరు. అయితే కోతల వెంటనే కొనుగోళు కేంద్రాలను ప్రారంభించి, కొనుగోళ్లు చేస్తేనే దళారుల దందాకు చెక్ పడుతుందని రైతు లు అభిప్రాయం వ్య క్తం చేస్తున్నారు.