కరీంనగర్ కార్పొరేషన్, జూలై 18 : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై అక్కసుతో రైతులను ఆగం చేయవద్దని, కక్షసాధింపు చర్యలు మానుకొని నాట్లు వేసుకునేందుకు సాగునీరు ఇవ్వాలని మాజీఎంపీ వినోద్‌కుమార్ సూచించారు. ప్రభుత్వం కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోయకుండా లక్షలాది మంది రైతుల ఉసురు పోసుకుంటున్నదని విమర్శించారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని, తప్పించుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు.
రాజకీయాలకు అతీతంగా రైతు సంక్షేమం కోసం నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ ప్రతిమ మల్టీఫ్లెక్స్‌లో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సాగునీరందక రైతులు పడుతున్న ఇబ్బందులపై ఆందోళన వ్యక్తం చేస్తూనే.. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసే విషయంలో ప్రభుత్వ కక్షసాధింపు చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి, మధ్యమానేరు, దిగువమానేరు జలాశయాలు, చెరువులు వెలవెల బోతున్నాయని, రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టుల నుంచి కనీసం తాగునీరు సరఫరా చేయలేని దుస్థితి ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.
ప్రస్తుతమున్న నీటి వనరులను వినియోగించుకొని, రైతులకు అందించడం, ప్రాజెక్టులను నింపడంలో కాంగ్రెస్ సర్కారు దారుణంగా విఫలమవుతున్నదని విమర్శించారు. ఇప్పుడు మేడిగడ్డ బరాజ్ వద్ద 82వేలకుపైగా క్యూసెక్కులు అంటే.. రోజుకు 7 నుంచి 8 టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నదన్నారు. కన్నెపల్లి వద్ద 96 మీటర్ల మేరకు ప్రవాహం ఉందని, కానీ, 93.5 నుంచి 944 మీటర్ల మేరకు ప్రవాహం ఉంటేనే పంపులను ప్రారంభించవచ్చన్నారు. ప్రస్తుతం మేడిగడ్డతో ఎటువంటి సంబంధం లేకుండానే కన్నెపల్లి పంపుహౌస్ నుంచి రోజుకు 20వేలపై చిలుకు క్యూసెక్కులు ఎత్తిపోసుకునే అవకాశం ఉందన్నారు. అంటే రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసి, ఎగువన ఉన్న అన్ని ప్రాజెక్టులను నింపుకోవడానికి ఆస్కారం ఉందన్నారు. నిజానికి కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు ఎత్తిపోయడానికి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఏ) ఎక్కడా అభ్యంతరం తెలుపలేదని గుర్తు చేశారు.
ఎల్లంపల్లి, మధ్యమానేరు, దిగువమానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్‌తోపాటు ఎగువమానేరు వరకు నీటిని ఎత్తిపోసుకునే అవకాశముందన్నారు. ఎస్సారెస్పీ పునర్జీవం ద్వారా వరదకాలువను నిండుగా నింపుకోవడంతోపాటు ఈ పరిధిలోని అన్ని చెరువులను నింపడానికి పుష్కలమైన అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పదే పదే చెబుతున్న రేవంత్ సర్కారు మాత్రం కక్ష పూరితంగానే వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోస్తే కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందన్న అక్కసుతోనే కుట్రలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వివక్ష వల్ల ఇప్పడు లక్షలాది మంది రైతుల జీవితాలు ఆగమయ్యే దుస్థితి ఏర్పడిందన్నారు.
ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లా రైతులు నాట్లు వేసుకునేందుకు వెంటనే సాగునీరు ఇవ్వాలని ఆందోళనలు చేస్తున్నారని, ఇవి ఉధృతం కాక ముందే ప్రభుత్వం కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. వరినార్లు ముదిరిపోతున్నాయని, సకాలంలో సాగనీరు ఇవ్వకపోతే నాట్లు ఆలస్యమై పంట దిగుబడులు తగ్గి అన్నదాతలు నష్టపోవాల్సి వస్తుందన్నారు. తాము చేతులెత్తి కోరుతున్నామని, రైతులను ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, సిరిసిల్ల జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు ఏనుగు రవీందర్‌రెడ్డి, పొన్నం అనిల్, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ రమణారావు, జడ్పీ కో ఆప్షన్ మాజీ సభ్యుడు జమీలుద్దీన్, బీఆర్ఎస్ నాయకులు చీటీ రాజేందర్రావు, జక్కుల నాగరాజు, దూలం సంపత్, షౌకత్ తదితరులు పాల్గొన్నారు.