Bores and wells | మెట్ పల్లి, ఏప్రిల్ 11: మండుతున్న ఎండలతో భూగర్భ జలాలు రోజురోజుకు ఇంకిపోతున్నాయి. వ్యవసాయ బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. రైతులు తమ పంట పొలాలను కాపాడుకునేందుకు అలచాట్లు పడుతున్నారు. చేతికందే సమయంలో నీటి తడి అందక వాడిపోతున్న పంటలను చూసి తట్టుకోలేకపోతున్నారు.
భూగర్భ జలాలను వెలికి తీసి ఎలాగైనా పంటలు కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలను నముమ్మరం చేస్తున్నారు. కొంత రైతులు తమ బోర్లను ప్రెస్సింగ్ చేస్తుండగా మరికొందరు రైతులు కొత్త బోర్లు వేయించుకుంటున్నారు. బోర్లు లేక బావులపై ఆధారపడి రైతులు కొందరు ప్రోక్లైన్లతో పూడికతీత, మరింత లోతుగా బావులను తవ్విస్తున్నారు. ఆయకట్టేతర ప్రాంతాల్లో బోర్లు, బావులపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
ప్రధానంగా ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో రైతులు జొన్నలు, సజ్జలు, వరి పంటలు సేద్యం చేస్తున్నారు. ఈ క్రమంలో అడుగంటుతున్న భూగర్భ జలాలతో పంటకు నీటితడి అందించడం కష్టతరంగా మారింది. కళ్ళ ఎదుట వాడిపోతున్న పంటలను చూసి తట్టుకోలేక అడుగంటిన భూగర్భ జలాల వెలికితీత కోసం భగీరథ ప్రయత్నాలు కొనసాగించక తప్పడం లేదు.