కరీంనగర్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ)/ రామడుగు : కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవం రోజు మూడు రంగుల జెండా సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మండిపడ్డారు. కేవలం మేడిగడ్డ బరాజ్‌లో మూడు పిల్లర్లు కుంగిపోతే రేవంత్ రెడ్డి మాత్రం రూ.లక్ష కోట్ల ప్రాజెక్టు గోదావరి పాలైందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, మరీ ఇప్పుడు నీళ్లు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. గాయత్రీ పంప్‌హౌస్ నుంచి వస్తున్నవి కాళేశ్వరం నీళ్లేనని, సీఎం రేవంత్ రెడ్డి ఇదిగో చూస్తున్నారా..? అని నీళ్లను చూపించారు. ఈ నీళ్లను చూపించాలనే ఉద్దేశంతోనే తాను హైదరాబాద్ నుంచి లక్ష్మీపూర్‌కు వచ్చానని, మరోసారి ఇలా మాట్లాడవద్దని హెచ్చరించారు.
శనివారం రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌ను బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ఎల్లంపల్లి నుంచి నందిమేడారం నంది పంప్‌హౌస్‌కు, అక్కడి నుంచి లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు ఐదు మోటర్లతో నీటిని ఎత్తిపోస్తున్న దృశ్యాలను వినోద్‌కుమార్ ప్రత్యక్షంగా తిలకించారు. ఒక్కో మోటరు ద్వారా 3,100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుండడాన్ని పరిశీలించి, మాట్లాడారు. తామున్నది కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగమైన గాయత్రీ పంప్‌హౌస్ వద్ద అని, ఈ ప్రాజెక్టు పరిధిలో ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ కూడా గోదావరిలో కొట్టుకుపోయాయని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
అది కూడా స్వాతంత్య్ర దినోత్సవం రోజున చెప్పడం సిగ్గుచేటని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని మండిపడ్డారు. ఇప్పుడు మీ ప్రభుత్వంలోని ఇంజినీర్లే మూడు రోజులుగా కష్టపడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు మోటర్ల ద్వారా నీటిని ఎత్తి పోస్తున్నది నిజం కాదా..? అని నిలదీశారు. మేడిగడ్డ వద్ద మూడు పిల్లర్లు కుంగాయని చెబితే తాము కాదనడం లేదని, కానీ మొత్తం ప్రాజెక్టే గోదావరిలో కొట్టుకు పోయిందనడం పచ్చి అబద్ధమని మండిపడ్డారు. ఈ నీళ్లు వానకాలం, యాసంగి సీజన్లకు ఉపయోగపడతాయన్నారు. రాజకీయాలు మాట్లాడుకుందామని, విమర్శలు చేసుకుందామని కానీ, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కాళేశ్వరంపై తప్పుడు మాటలు మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా కుంగిన పిల్లర్లకు వెంటనే మరమ్మతులు చేస్తే రైతులకు అసలు ఇబ్బందులే ఉండవన్నారు.
కేసీఆర్ ఆలోచన ప్రకారం జూన్, జూలైలోగానే నీళ్లు ఎత్తి మిడ్‌మానేరు, ఎల్ఎండీ రిజర్వాయర్లు, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ ప్రాజెక్టులు నింపితే ఇప్పటికే రైతులు నాట్లు వేసుకునేవారని, ఇన్నాళ్లూ సీఎం నిర్ణయం తీసుకోని కారణంగానే రైతులు వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా పుష్కలంగా పంటలు పండాయని సీఎం, మంత్రులు చెప్పింది కూడా పచ్చి అబద్ధమని, కాళేశ్వరం నీళ్లతో ప్రాజెక్టులు నింపడం వల్లే ఈ రెండేళ్లు రైతులు పంటలు పండించారనే విషయాన్ని సీఎం గ్రహించాలని సూచించారు. వినోద్ కుమార్ వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్ రావు, పార్టీ మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, తదితరులున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పంప్‌హౌస్ వద్ద కొద్దిసేపు బైఠాయించి ‘జై తెలంగాణ, జై జై కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు.
కేసీఆర్‌పై అక్కసుతో కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని సీఎం సహా మంత్రులు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి అసలు ఈ ప్రాజెక్టుపై అవగాహన లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ చిరకాల స్వప్నం. రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే గొప్ప ప్రాజెక్టు ఇది. దీన్ని వాడకుండానే పంటలు పండాయని ప్రగల్భాలు పలికిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలి. గోదావరిలో లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని తరలిస్తే పుష్కలంగా పంటలు పండేవి.
– సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్యే
ఎత్తున ఉన్న తెలంగాణకు నీళ్లు ఎలా వస్తాయని ఆంధ్రా పాలకులు ప్రశ్నించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎత్తు పేరు చెప్పి వాళ్ల ప్రాంతానికి నీళ్లను తరలించుకొనిపోయారు. ఎత్తిపోతల ద్వారా మాత్రమే తెలంగాణకు నీళ్లు వస్తాయని కేసీఆర్ గ్రహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి, తెలంగాణను సస్యశ్యామలం చేశారు. రైతుల నీటిగోసను తీర్చారు. కానీ, కేసీఆర్‌ను అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ నాయకులు రైతులను కష్టపెట్టారు.
– నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్సీ