రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్ : ముంపు నిర్వాసితులందరికీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వర్తింపజేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా 10,683 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. నాడు జిల్లా మంత్రిగా ఉన్న కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్‌బాబుతోపాటు ఎంపీగా పనిచేసిన తాను సైతం డబుల్ బెడ్రూం ఇండ్లు అందించేందుకు అనేక ప్రయత్నాలు చేశామన్నారు. చట్ట ప్రకారమైన సమస్యల కారణంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేయలేకపోయారని గుర్తుచేశారు. ఈ మేరకు సోమవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత ప్రభుత్వంలో కేసీఆర్ నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని.. తాము అధికారంలోకి వస్తే అందరికీ ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రస్తుత ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రచారం చేశారని గుర్తుచేశారు. కానీ, 10,683 మంది లబ్ధిదారులకు 4,696 మందికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని జీవో తెచ్చారన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు లబ్ధిదారులందరికీ పరిహారం ఇస్తే తాము స్వాగతిస్తామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ సేకరణ చేసిన సందర్భంలో పరిహారం అందించిందని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం పరిహారం చెల్లించిందని గుర్తు చేశారు.
డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ఇస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో చట్ట పరమైన సమస్యలతో చేయలేకపోయారని గుర్తు చేశారు. ఏడాది ప్రభుత్వంలో ఆది శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్‌పై ఘాటు విమర్శలు తాను చేయదలచుకోలేదని, చెప్పిన మాట ప్రకారం నిర్వాసితులందరికీ పరిహారంపై జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సంవత్సర కాలంలో ఒక్క గ్యారెంటీ అమలు చేయకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని దుయ్యబట్టారు.
గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడుతలేవని మహిళలు బాధపడుతున్నారన్నారు. వచ్చే ఏడాది ఆరు గ్యారెంటీల పత్రాలు పట్టుకుని ఇంటింటికీ వెళ్తామని, హామీల అమలుపై ప్రజల్ని అడిగి తెలుసుకుంటామన్నారు. అబద్ధపు ప్రచారంతో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించారన్నారు. ఎస్సారెస్పీ వరద నీరు, శ్రీపాద ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ద్వారా సిరిసిల్ల మానేరు నిండుకుండలా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులకు కనీస అవగాహన లేదని విమర్శించారు. కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 50 టీఎంసీలకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం అని గుర్తుంచుకోవాలన్నారు.
మూసీ ప్రాజెక్టు ప్రక్షాళనకు వినియోగిస్తానని రేవంత్‌రెడ్డి చెప్పిన మల్లన్నసాగర్ నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టులోనివేనని చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టును మరమ్మతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల భూప్రకంపనలు వచ్చినా మేడిగడ్డకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. యాసంగి పంటకు నీరు అందించడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి చెబుతున్నారని, వెంటనే మేడిగడ్డకు మరమ్మతులు చేపట్టి నీరు అందించాలని డిమాండ్ చేశారు.
మిషన్ కాకతీయ పథకంలో భాగంగా గ్రామాల్లోని చెరువులన్నింటనీ సస్యశ్యామలం చేసింది కేసీఆర్ అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌లు కక్షసాధింపు చర్యల్లో భాగంగానేనని తాము భావిస్తున్నామని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అభివృద్ధి చెందుతున్న క్రమంలో జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం గుదిబండగా మారిందన్నారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు గుండ్లపల్లి పూర్ణచందర్, బొల్లి రామ్మోహన్, మాట్ల మధు, న్యాలకొండ రాఘవరెడ్డి, పడిగెల మానస, ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, పడిగెల రాజు, బండారి శ్యాం, బుర్ర మల్లిఖార్జున్, వెంగళ శ్రీనివాస్, ప్రేమ్‌కుమార్, గుగులోతు సురేష్‌నాయక్, సిలువేరి చిరంజీవి, వీరబత్తిని కమలాకర్, సబ్బని హరీశ్ పాల్గొన్నారు.