CPI | కరీంనగర్, తెలంగాణ చౌక్, ఏప్రిల్ 20 : కుల, మతాలకు అతీతంగా శాంతియుతంగా జీవిస్తున్న దేశ ప్రజల మధ్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలు సృష్టిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి తో కలిసి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకులను అణిచివేయాలని కుట్రలు చేస్తుందన్నారు . వచ్చే మార్చి 2026 లోపు మావోయిస్టు లేకుండా నిర్మూలిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని సూచించారు. ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేలా పాలన కొనసాగించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హామీలు నెరవేర్చని యెడల ప్రజలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరించి హామీల అమలుపై స్పష్టమైన సమయాన్ని తెలియజేయాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ వైఫల్యలపై తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు టేకుమల్ల సమ్మయ్య, కొయ్యాడ సృజన్ కుమార్, బోయినపల్లి అశోక్ పాల్గొన్నారు.