బీజేపీలో వర్గపోరు తారస్థాయికి చేరుతున్నది. ఆధిపత్య పోరుతో తాము ఓటమి పాలయ్యానని ఆ పార్టీ బలపరిచిన తుమ్మనపల్లి సర్పంచ్ అభ్యర్థి బేతి సులోచన భర్త తిరుపతిరెడ్డి సోషల్ మీడియా వేదిక ఆవేదన వ్యక్తం చేయడం తీవ్ర దుమారం రేపుతున్నది. కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, హుజూరాబాద్ మండలాధ్యక్షుడు రాముల కుమార్ తన దగ్గరికి వచ్చి ఈటల రాజేందర్ మద్దతు తీసుకుంటే మంచిగుండదని.. ఏమైనా అవసరముంటే పార్టీ పరంగా తాము చూసుకుంటామని హామీ ఇచ్చారని, తీరా సమయానికి ఎలాంటి సహాయం అందించకపోవడంతో ఓటమి పాలయ్యామని తిరుపతిరెడ్డి ఆవేదన వెల్లగక్కడం చర్చనీయాంశమైంది. మరోవైపు తనను ఓడించేందుకు ఓ ముఖ్య నేత కుట్రలు పన్నారని జమ్మికుంట వేదికగా కమలాపూర్ సర్పంచ్ అభ్యర్థి పబ్బు సతీశ్ సంచలన వ్యాఖ్యలు చేయడం వర్గపోరుకు అద్దం పట్టింది. బండి సంజయ్, ఈటల ఆధిపత్య పోరులో చాలా మంది సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఇలానే ఓటమి చెందారనే చర్చ ఆ పార్టీలో జోరుగా జరుగుతున్నది.
హుజూరాబాద్, డిసెంబర్18 : బీజేపీలో ఈటల రాజేందర్, బండి సంజయ్ వర్గపోరు తారస్థాయికి చేరుకున్నదా..? అంటే అవుననే తెలుస్తున్నది. సర్పంచు ఎన్నికలతో అది తేటతెల్లమైనట్టు రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు, పలు పరిణామాలే అందుకు నిదర్శంగా నిలుస్తున్నవి. వాటిని పక్కన పెడితే ఇటీవల బండి సంజయ్ హుజూరాబాద్‌లోని మధువని గార్డెన్లో ముఖ్య కార్యకర్తల సమాశం నిర్వహించగా.. దీనికి రాష్ట్ర నలుమూలల నుంచి ముఖ్య నాయకులు హాజరయ్యారు. కానీ, ఈటల మాత్రం రాలేదు. దీంతో బీజేపీలో వర్గపోరు నడుస్తున్నదని సమావేశానికి వచ్చిన కార్యకర్తలు గుసగుసలాడారు. ఆ తర్వాత ఈటల రాజేందర్ కమలాపూర్‌లో తన అనుచరులతో సమావేశమై ఘాటు వ్యాఖ్యలు చేసి.. ఎన్నికల్లో సత్తా ఏంటో నిరూపించుకోవాలని చెప్పకనే చెప్పిన తీరు అప్పట్లో సంచనలంగా మారింది. సర్పంచ్ ఎన్నికల్లో వర్గపోరుతో పలువురు అభ్యర్థులు చాలా మనోవేదన చెందారని, ఒక వర్గం మద్దతు ఇస్తే, మరో వర్గం మద్దతు ఇవ్వలేదని కరడుగట్టిన ఓ బీజేపీ నాయకుడు ఆరోపించాడు. పంచాయతీ ఎన్నికల్లో చాలా గ్రామాల్లో ఇరు వర్గాల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అందుకనుగుణంగానే కార్యకర్తలు రెండుగా చీలి పోయి ప్రచారం చేశారు. ఈటల సొంత మండలమైన కమలాపూర్‌లోని పలు గ్రామాల్లో ఈటల, బండి వర్గం అంటూ పోటీలో ఉండగా.. సోషల్ మీడియాలోనూ ఈటల, బండి వర్గం అంటూ పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. మూడో విడుతలో జరిగిన ఎన్నికల్లో శాలపల్లి-ఇందిరానగర్‌లో బీజేపీ బలపరిచిన సర్పంచు అభ్యర్థి పోటీలో ఉండగానే స్వతంత్ర అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌కు ఈటల రాజేందర్ బహిరంగంగానే మద్దతు పలికారు. ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. ఈటల, బండి ఆధిపత్యపోరులో ఎన్నికల్లో గెలిచే స్థానాలు కూడా ఓటమి చెందినట్టు ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకొంటున్నారు. నియోజకవర్గంలో బీజేపీ 20 స్థానాల్లో గెలుపొందగా, అందులో రాజేందర్, సంజయ్ వర్గం అంటూ గెలిచిన చోట కార్యకర్తలు చెప్పుకొంటుండం విశేషం.
బండి, ఈటల వర్గపోరు తీవ్ర స్థాయికి చేరుకున్న తరుణంలో పార్టీ హుజూరాబాద్ మండలాధ్యక్షుడు రాముల కుమార్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి, రాజీనామా పత్రం జిల్లా అధ్యక్షుడికి పంపించాడు. అందుకు సంబంధించిన వీడియో ఆయన సోషల్ మీడియాలో విడుదల చేయడం ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశమైంది. తనను కుమార్ మోసం చేశాడని తుమ్మనపల్లి సర్పంచ్ అభ్యర్థి భర్త బేతి తిరుపతిరెడ్డి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్న కొన్ని గంటలకు పార్టీ మండలాధ్యక్షుడు రాజీనామా చేసిన తీరు పార్టీలో కలకలం రేపుతున్నది. అయితే రాజీనామాకు వ్యక్తిగత కారణాలే అని పేర్కొన్నప్పటికీ లోతుగా చూస్తే పార్టీలో మరో ప్రచారం జరుగుతున్నది. బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు కొంత ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన పెద్ద నాయకులు చివరకు చేతులెత్తేయడంతో పోటీలో ఉన్న అభ్యర్థులకు తాను సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డాడని, అందుకే కుమార్ రాజీనామా చేసినట్టు తెలుస్తున్నది.
మా పార్టీ ముఖ్య నేతనే తనను ఓడించడానికి కుట్రలు పన్నారని, సమయం వచ్చినపుడు సాక్ష్యాధారాలతో బయటపెడతానని బీజేపీ బలపరిచిన కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీశ్ పేర్కొన్నాడు. జమ్మికుంటలో గురువారం బీజేపీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈటల రాజేందర్ సొంత గ్రామం కమలాపూర్‌లో తనను అభ్యర్థిగా నిలబెట్టారని చెప్పాడు. అయితే తనను ఓడగొట్టేందుకు ఓ కీలకనేత ఇతర పార్టీ అభ్యర్థితో కుమ్మక్కయ్యారని, తాను ఓడిపోతే ఈటల సొంత గ్రామంలో పట్టులేదని పార్టీలో చెప్పేందుకు ఆ ముఖ్యనేత కుయుక్తులు పన్నారని ఆరోపించాడు. ముఖ్యనేత, అతని అనుచరులు ప్రతిపక్ష పార్టీ నాయకులతో చేతులు కలుపడంతో కమలాపూర్ మండలంలో ఆరుగురు అభ్యర్థులు పదిలోపు ఓట్లతో ఓడిపోయారని చెప్పాడు. ఏడుగురు అభ్యర్థులు గెలిస్తే, ఇద్దరు మాత్రమే గెలిచారని ప్రచారం చేస్తున్నారని, ఇదంతా చూస్తుంటే మమ్మల్ని ఓడించి రాజేందర్ ఉనికి లేదని కొందరు నాయకులు కుట్రలు పన్నుతున్నారని చెప్పాడు. అయితే ఎక్కడా బండి సంజయ్ పేరు ఎత్తకపోగా, నియోజకవర్గంలో గెలిచిన బీజేపీ బలపరిచిన అభ్యర్థులు కేవలం ఈటల చరిష్మాతోనే గెలిచారనడం చూస్తే బీజేపీలో వర్గపోరు ఉందని స్పష్టమవుతున్నది. ఏదేమైనా బేతి తిరుపతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు, పార్టీ మండలాధ్యక్షుడు కుమార్ రాజీనామా అంశం, జమ్మికుంటలో బీజేపీ నాయకుల ప్రెస్‌మీట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.