KARIMNAGAR | కార్పొరేషన్, ఏఫ్రిల్ 19 : కరీంనగర్లో చేపడుతున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులను ఆపేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు కుట్రలు పన్నుతున్నాయని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్‌కు పర్యాటక శోభ తీసుకురావాలన్న ఆలోచనతో గొప్ప ప్రాజెక్టును తీసుకువస్తే అక్రమాలు చేటుచేసుకున్నాయంటూ తప్పుడు ప్రచారాలతో ఈ పనులను అడ్డుకునే ప్రయత్నాలు చేపడుతున్నారని పేర్కొన్నారు.
స్థానిక 37వ డివిజన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మానేరు నది కరీంనగర్‌ను ఆనుకొని ప్రవహించడం గొప్ప ఆస్తి అని, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బొయినిపల్లి వినోద్ కుమార్‌లు కృషి చేశారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఈ ప్రాజెక్టు రూ.542 కోట్లతో మంజూరు చేయగా పనులు సాఫీగా సాగాయన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేసి పనులు నిలిపివేశారన్నారు. ఈ ప్రాజెక్టు పనులపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అసెంబ్లీలో ప్రశ్నించారని, పనులు నిలిపివేయటం వల్ల కాంగ్రెస్ కు చెడ్డ పేరు వస్తుందన్న భయంతోనే ఇటీవలే మళ్లీ పనులు మొదలుపెట్టారని, కాగా ఇప్పుడు పనులను అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని దుయ్యబట్టారు. కరీంనగర్ మాజీ మేయర్ సునీల్‌రావు కమీషన్ కోసం మానేరు రివర్ ఫ్రంట్ కాంట్రాక్టర్‌ను బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కరీంనగర్ మేయర్‌గా సునీల్‌రావు చరిత్ర పూర్తిగా అవినీతిమయమేనని ఆరోపించారు.
మేయర్ పదవి పోయి నెల వారి కలెక్షన్ రాకపోవడంతో ఇప్పుడు మానేర్ రివర్ ఫ్రంట్‌పై పడ్డారని విమర్శించారు. మానేరు రివర్ ఫ్రంట్‌లో అవినీతి జరిగిందంటున్న సునీల్‌రావుకు మేయర్‌గా ఉన్నప్పుడు అవినీతి కనిపించలేదా అని ప్రశ్నించారు. వరద ఎక్కువ వస్తే కోట్టుకుపోతుందని చెప్పుతున్న పదో తరగతి ఫెయిల్ అయిన సునీల్‌రావుకు ఆ ప్రాజెక్టును డిజైన్ చేసింది బీటెక్, ఎంటెక్‌ల్లో గోల్డ్ మెడల్ సాధించిన అధికారులన్న విషయాన్ని మరిచిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ఈ ప్రాజెక్టు తీసుకువచ్చిన పేరు బీఆర్ఎస్కు మాత్రమే దక్కుతుందన్నారు.
సునీల్‌రావుకు కరీంనగర్ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి రూ.200 కోట్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. సునీల్‌రావుకు దమ్ముంటే మానేరును అనుకొని ఉన్న డంపింగ్ యార్డును తొలగించేందుకు కృషి చేయాలని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్లో 50 స్థానాలకు పైగా గెలిచి బీఆర్ఎస్ మూడోసారి కైవసం చేసుకుంటుందన్నారు. మానేరు రివర్ ఫ్రంట్‌ను పూర్తి చేసేందుకు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్‌రెడ్డి, నాయకులు చందు, వాజిద్, బొంకురి మోహన్, ఆరె రవిగౌడ్, చేతి చంద్రశేఖర్, రాజ్ కుమార్, నారదాసు వసంతరావు, వోడ్నాల రాజు, సత్తినేని శ్రీనివాస్, జశ్వంత్, పవన్, చుక్క శ్రీనివాస్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.