కరీంనగర్ కమాన్ చౌరస్తా, అక్టోబర్ 10 : సద్దుల సంబురాలు గురువారం ఉమ్మడి జిల్లాలో అంబరాన్నంటాయి. ఆడబిడ్డల ఆటపాటలతో ఊరూరూ పూలవనాల్లా మారాయి. ఉదయం నుంచే మహిళలు తీరొక్కపూలతో ఓర్పుగా, అందంగా బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం కొత్త బట్టలు ధరించి, గౌరమ్మకు పూజలు చేశారు. ఆ తర్వాత కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి ఆటాపాటలతో హోరెత్తించారు.
జిల్లాకేంద్రాలతోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, ధర్మపురి, గోదావరిఖని, ఎన్టీపీసీ టౌన్‌షిప్‌తోపాటు పలుచోట్ల వందలాది మంది ఒక్కచోట చేరి ఆడారు. అక్కడడక్కడా వాన పడినా లెక్కచేయకుండా ఆడిపాడారు. అనంతరం బతుకమ్మలను చెరువులు, కుంటలు, కాలువలతోపాటు ఏర్పాటు చేసిన తెప్పల్లో నిమజ్జనం చేశారు. ‘పోయిరా గౌరమ్మ.. పోయిరావమ్మా’ అంటూ వీడ్కోలు పలికారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు.
‘కొత్తసిబ్బి.. పాత సిబ్బి’ అంటూ సత్తులు పంచుకొని తిన్నారు. కరీంనగర్లో జరిగిన వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు, హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంకలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, గంగాధర, కొడిమ్యాలలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, బూరుగుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సిరిసిల్లలో విప్ ఆది శ్రీనివాస్, ధర్మపురిలో విప్ అడ్లూరి లక్ష్మణ్, జగిత్యాలలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పాల్గొన్నారు.