కార్పొరేషన్, మే 16: కరీం‘నగరాన్ని’ మరిం త సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రధాన రహదారులను సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని 14.5 కిలోమీటర్ల మేర ఉన్న ప్రధాన రహదారులను అభివృద్ధి చేస్తున్నామని, ఇందుకు ఇప్పటికే రూ.5.50 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. అందులో భాగంగానే మంగళవారం సాయం త్రం స్థానిక కోర్టు చౌరస్తాలో రూ.కోటితో డివైడర్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి, మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం రూ. కోటి నిధులతో పనులు ప్రారంభించామని, అవసరమైతే మరో రూ.కోటి మంజూరు చేస్తామని చెప్పారు.
కూలిపోయిన, డ్యామేజ్ అయిన డివైడర్లను మళ్లీ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు కోపింగ్ చేస్తామని చెప్పారు. అలాగే వీటిపై అందరికీ కనిపించేలా తెలుపు, పసుపు, నలుపు కలర్స్ వేయిస్తామన్నారు. పనులు పూర్తయిన వెంటనే ప్రధాన రహదారుల్లో మరో కటింగ్ బీటీ రోడ్లు వేయిస్తామని వివరించారు. అనంతరం జీబ్రా లైన్స్, సైడ్ లైట్స్ తదితర వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. వీటితో పాటు అతిత్వరలోనే ట్రాఫిక్స్ సిగ్నల్స్, ఫ్రీ వైఫై టవర్స్, అనౌస్మెంట్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వా లు రోడ్ల రెనీవల్స్ను 15 నుంచి 20 ఏండ్లకు ఒకసారి చేసేవని, కానీ తాము ఐదేండ్లకే చేయాలని నిర్ణయించి పనులు చేపడుతున్నామన్నారు. ఇక్కడ మేయర్ వై సునీల్‌రావు, కార్పొరేటర్లు తోట రాములు, ఐలేందర్‌యాదవ్, బీఆర్ఎస్ నాయకులు మహేశ్, పవన్, కర్ర సూర్యశేఖర్ ఉన్నారు.