ముస్తాబాద్, ఫిబ్రవరి 19 : బీఆర్ఎస్ పాలనలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు కాలువల ద్వారా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పెద్ద చెరువుకు నీళ్లు వచ్చేవి. ఆ తర్వాత ఎల్లమ్మ వాగుకు, అక్కడి నుంచి నక్కవాగుకు చేరేవి. దాంతో రైతులకు సాగునీటి కష్టాలు ఉండేవి కాదు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాగునీరు రాకపోవడంతో ముస్తాబాద్ మండల రైతులు అరిగోసపడుతున్నారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో ఎల్లమ్మ వాగు, నక వాగులోకి నీరు విడుదల చేయకుంటే పోతుగల్, గన్నెవానిపల్లె, నర్సింహులతండా, మామిండ్లవారిపల్లె, నిమ్మలవారిపల్లె గ్రామాల్లో పంటలు ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి రెండోవారంలోనే ఎండలు దంచికొట్టడంతో పంటపొలాలు ఎండుతున్నాయని, పొట్ట దశకు వచ్చిన పంటలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో అన్నదాతలు సాగునీటి కోసం భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి బోర్లు వేస్తున్నా.. చుక నీరు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాగునీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.
నకవాగు పరిసర గ్రామమైన గన్నెవానిపల్లె మాది. నాకున్న ఐదెకరాల్లో వరి వేసిన. పది రోజుల నుంచి బోరుబావులు ఎత్తేసినయి. పంటలు వాడిపోతున్నయి. వేసిన పంటను కాపాడడం కోసం 2.50లక్షల ఖర్చుపెట్టి 600ఫీట్ల బోరు వేసిన. అయినా చుక నీరు రాలె. నకవాగులోకి నీరు విడుదల చేయకుంటే అన్నివిధాలా నష్టపోతం.
మాది నరసింహుల తండా. నాకున్న ఆరెకరాల్లో వరి పంట వేసినం. వారం నుంచి బోరుబావుల్లో ఊట తక్కువైంది. పొట్ట దశకు వచ్చిన పొలం నెర్రెలు బారుతున్నది. ముస్తాబాద్ చెరువు నుంచి ఎల్లమ్మవాగు, నక వాగులోకి నీటిని విడుదల చేయాలి. రైతులు నష్టపోకుండా చూడాలి
మాకు ఐదెకరాల భూమి ఉన్నది. అప్పుచేసి.. పెట్టుబడి పెట్టి వరి పంట వేసిన.ం బోరుబావిలో నీరు పూర్తిగా తగ్గడంతో పంట ఎండిపోతున్నది. అధికారులు, నాయకులు వాగులో నీళ్లస్తయని చెబితే పెట్టుబడి పెట్టాం. నీళ్లు ఇంతలోనే అడుగంటుతుందని అనుకోలేదు. అప్పులు చేసిన వేసిన పంటలు ఎండిపోతే పెట్టుబడి కూడా మీదపడ్తది. కేసీఆర్ సారు పాలనే మంచిగున్నది.