సమైక్య పాలనలో వైద్యరంగంపై అంతులేని అలసత్వం కొనసాగింది. ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు చేయలేదు కదా.. ప్రజా ఆరోగ్యంపై నిర్లక్ష్యం చూపింది. ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 38లక్షలపై చిలుకు జనాభా ఉందని, వైద్య కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అప్పటి ప్రభుత్వాలకు విన్నవించినా పట్టించుకోలేదు.
సమైక్య రాష్ట్రంలో 58 ఏండ్లపాటు ప్రతి ప్రభుత్వానికి దరఖాస్తులు ఇచ్చినా.. వైద్య విద్యతోపాటు మెరుగైన వైద్యం అందించేందుకు కనీస ఆలోచన చేయలేదు. ఇటు కేంద్రం దేశవ్యాప్తంగా 171 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను మంజూరు చేసినా.. తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. ఫలితంగా పేద, మధ్య తగరతి వర్గాలకు వైద్యమేకాదు, వైద్య విద్య అందని ద్రాక్షే అయింది.
స్వరాష్ట్రంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఎవరూ ఊహించని విధంగా వైద్య రంగంలో నవశకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో జిల్లాకో మెడికల్ కాలేజీ కల సాకారమైంది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో వందలాది మంది పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలు స్థానికంగానే మెడిసిన్ చదివే అవకాశం కలిగింది.
నాలుగు జిల్లాల్లో ప్రస్తుతం 500 మంది ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, మున్ముందు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నది. ఓవైపు వైద్య విద్యతోపాటు మరోవైపు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యం నెరవేరుతుండగా, విద్యార్థులు, వారి తల్లిదండ్రులనుంచి హర్షం వ్యక్తమవుతున్నది.
– కరీంనగర్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కేవలం ఒకే ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని ఏండ్లపాటు కోరినా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సమైక్య రాష్ట్రంలో 58 ఏళ్లపాటు కాంగ్రెస్, టీడీపీ పాలించినా వైద్య విద్యతోపాటు మెరుగైన వైద్యం అందించేందుకు ఎలాంటి చొరవా చూపలేదు. ఆనాడు పూర్వ కరీంనగర్‌కు వైద్యపరంగా ఉన్న అవసరాన్ని స్థానిక పాలకులు అప్పటి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. నాటి సమైక్య పాలకులు పెడచెవిన పెట్టారు.
ముఖ్యమంత్రి వైఎస్సార్, కిరణ్ కుమార్‌రెడ్డితోపాటు చంద్రబాబుకు చాలాసార్లు దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టిన రోజులున్నాయి. అయినా ఏ రోజు కళాశాల ఏర్పాటు దిశగా ఆలోచనలు చేయలేదు. కనీసం ఆనాటి పాలకుల నుంచి హామీలు సైతం సాధించలేని దుస్థితి. మెడికల్ కళాశాల ఇవ్వకపోగా, వైద్యరంగంపై నిలువెత్తు నిర్లక్ష్యం చూపుతూ వచ్చారు. సర్కారు దవాఖానలను పట్టించుకున్న పాపాన పోలేదు. బెడ్ల సౌకర్యాన్ని విస్తరించలేదు.
ప్రజలను ప్రభుత్వ దవాఖానలవైపు మళ్లించేటువంటి చర్యలు తీసుకోలేదు. సమైక్య ప్రభుత్వాలు ఇలా ఉంటే.. రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ పరిస్థితి అదే. దేశ వ్యాప్తంగా 171 మెడికల్ కళశాలు మంజూరు చేస్తే.. అందులో తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. తెలంగాణకు మెడికల్ కళాశాలలు ఇవ్వాలంటూ దేశంలోని అన్ని రాష్ర్టాలకన్నా ఎక్కువ విజ్ఞప్తులు మన ప్రభుత్వం నుంచే వెళ్లాయి.
అయినా కేంద్రం పెడచెవిన పెట్టిందే తప్పఒక్కటీ మంజూరు చేయలేదు. దేశంలో 171 కళాశాలల మంజూరును ప్రస్తావిస్తూ.. రాష్ట్ర బీజేపీ నాయకులను పదే పదే తెలంగాణ సమాజం ప్రశ్నించింది. తెలంగాణకు ఒక్క మెడికల్ కళాశాల ఎందుకు తేలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేసింది. అయినా బీజేపీ నాయకులు తప్పించుకునే ధోరణి ప్రదర్శించారే తప్ప ఏనాడు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేసిన దఖాలాలు లేవు. ఫలితంగా కేంద్రం నుంచి ఒక్క మెడికల్ కళాశాలను పొందలేదని పరిస్థితి ఏర్పడింది.
స్థానికంగా చదువులు.. తప్పిన విదేశీ కష్టాలు
నిజానికి తగిన ఎంబీబీఎస్ సీట్లు లేక ఉమ్మడి జిల్లానుంచి చాలా మంది ఉక్రెయిన్, రష్యా, చైనావంటి దేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం ఏటా 300 లనుంచి 500 మంది వరకు ఆ ప్రాంతాలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఇటీవల ఉక్రెయిన్-రష్యా యుద్ధం సమయంలో ఈ విషయం బహిర్గతమైంది. నిజానికి అవకాశాలు ఇక్కడే ఉంటే.. దేశం విడిచి ఎందుకు వెళ్తామని ఆనాడే వైద్య విద్యార్థులు ప్రశ్నించారు.
దీంతోపాటు కరోనా సమయంలో దేశం మొత్తం వైద్య సిబ్బంది లేక అల్లాడింది. ఇంజక్షన్ చేయడానికి నర్సులు కూడ దొరకని పరిస్థితి. ప్రభుత్వ దవాఖానల్లో నెలల తరబడి 24 గంటల డ్యూటీలు చేసినా సిబ్బంది కొరత వెక్కిరించింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పడమేకాదు, అనతి కాలంలోనే ఆచరణలో చూపెట్టారు.
అందులో భాగంగానే ఉమ్మడి జిల్లాకు నాలుగు కళాశాలలు మంజూరు చేశారు. అందులో జగిత్యాల జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాల ప్రథమ సంవత్సరానికి 150 సీట్లు కేటాయించారు. అలాగే రామగుండంలో 150 ఇచ్చారు ఈ రెండు గత ఏడాదే ప్రారంభం కాగా. ప్రస్తుతం కరీంనగర్ 100 వంద సీట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 100 సీట్లతో మెడికల్ కళాశాలలు ప్రారంభమయ్యాయి.
మున్ముందు ఈ సీట్ల సంఖ్య మరింత పెరగనున్నది. ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే.. ఏటా 500 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య విద్యార్థులు చదువుకునే సౌలభ్యం కలిగింది. ఇప్పటికే ప్రైవేటు రంగంలో 400 సీట్లు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ కళాశాలల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులు సుమారు వందకుపైగా సీట్లు కొట్టారు. ఉన్నచోటే ఎంబీబీఎస్ సీటు రావడంపై సర్వాత్ర హర్షం వ్యక్తమవుతున్నది. కేవలం కేసీఆర్ కళాశాలలు ఏర్పాటుచేయడం వల్లే తమ బిడ్డలకు వైద్య విద్యను అభ్యసించే అవకాశం కలిగిందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
స్వరాష్ట్రంలో వైద్యరంగానికి పెద్దపీట
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మందు నుంచీ వైద్యరంగానికి పెద్దపీట వేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఏయేటికాయేడు బడ్జెట్లో కేటాయింపులు పెంచుతున్నారు. 2015-16లో వైద్య ఆరోగ్యశాఖకు 4,932 కోట్లు కేటాయిస్తే.. 2023-24నాటికి 12,364 కోట్లుకు పెంచింది. అంటే తొమ్మిదేళ్లలో వైద్య రంగానికి సంబంధించిన బడ్జెట్ రెండున్నర రెట్లు పెరిగింది. తలసరి వైద్య బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. బడ్జెట్‌తోపాటు అనేక కొత్త పథకాలు తెచ్చి ప్రజలను ప్రభుత్వ దవాఖానల వైపు మళ్లించడంపై ప్రభుత్వం ప్రధాన దృష్టిసారించింది.
అందులో భాగంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ సూపర్ హిట్ అయింది. సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలన్న లక్ష్యంతో చేపట్టిన ఈ పథకం కింద గర్భిణులకు బాబు పుడితే 12వేలు, పాప పుడితే 13వేలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రసవం తర్వాత తల్లికి, బిడ్డకు అసరమయ్యే వస్తువులతో 2వేల విలువైన కిట్ ఇస్తున్నారు. గర్భిణులు రవాణాకు ఇబ్బంది పడొద్దన్న లక్ష్యంతో అమ్మ ఒడి వాహనాలు అమల్లోకి తెచ్చారు. బస్తీ దవాఖానల ఏర్పాటు చేయడంతోపాటు డైట్ శానిటేషన్ చార్జీలను ప్రభుత్వం పెంచింది.
ఆరోగ్యమహిళా, డయాలసిస్ కేంద్రాలు, టీ డయాగ్నోస్టిక్స్, కొత్త పీహెచ్‌సీలు, కంటివెలుగు ఇలా ఎన్నో కొత్త వాటికి శ్రీకారం చుట్టి, ప్రభుత్వ వైద్యసేవలను చేరువ చేసింది. ఫలితంగా ఓపీ సంఖ్య విపరీతంగా పెరిగింది. తాజా గణాంకాలను బట్టి చూస్తే.. మెడికల్ సీట్లు ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలో నెంబర్ వన్ స్థానం తెలంగాణ సాధించింది. 8 పీజీ సీట్లతో దేశంలో నంబర్ 2 స్థానంలో నిలిచిన ఘనత తెలంగాణకు దక్కింది.
వైద్యుల భర్తీ
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ దవాఖానలు, బోధనాసుపత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఖాళీలను ప్రభత్వం ఇటీవలే భర్తీ చేసింది. అందులో భాగంగా కరీంనగర్, రామగుండం, రాజన్న సిరిసిల్ల, జగిత్యాలోని ప్రభుత్వ దవాఖానల్లో ఒప్పంద, పొరుగు సేవలు, గౌరవ వేతనం విధానాల్లో మొత్తం 1692 మందిని నియమించంది. దీనికి ముందుగానే వైద్య విభాగానికి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను పూర్తి చేసింది. అవసరమైన వైద్యులను గౌరవవేతనంతో నియమించేందుకు తాజాగా అవకాశం కల్పించింది.
నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్ పూర్తయ్యాక ఏడాది కాలంపాటు తప్పనిసరిగా ప్రభుత్వ దవాఖానల్లో జూనియర్ రెసిడెంట్లుగా, ప్రత్యేక వైద్య విభాగంలో పీజీ కోర్సు పూర్తిచేసిన వైద్యులు ఏడాది కాలంపాటు సీనియర్ రెసిడెంట్లుగా సేవలందించాల్సి ఉంటుంది. జూనియర్ రెసిడెంట్లకు నెలకు 46వేలు, సీనియర్ రెసిడెంట్లకు నెలకు 92,575 గౌరవ వేతనం ఇస్తున్నది. అందులోభాగంగా కరీంనగర్లో 60, రామగుండం 17, రాజన్న సిరిసిల్ల 60 జగిత్యాల 86 వైద్యులను కాంట్రాక్టు పద్ధతిన, మిగిలిన వారిని వివిధ విభాగాల్లో నియమించింది.