Godavarikhani | కోల్ సిటీ, జూలై 31: ఉద్యోగులు పదవీ విరమణ రోజునే ప్రయోజనాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జే. అరుణ శ్రీ తెలిపారు. పబ్లిక్ హెల్త్ వర్కర్లుగా పని చేసి పదవీ విరమణ పొందిన ఆవునూరి మల్లయ్య, రేణికుంట్ల పోచయ్య, కుమ్మరి రాయ పోచమ్మలకు గురువారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో శాలువా కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు.
వీడ్కోలు కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ పదవీ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఈఎల్ ప్రయోజనం ప్రాసీడింగ్స్ విరమణ రోజునే అందజేస్తున్నట్లు తెలిపారు. ఇక ముందు కూడా పదవీ విరమణ పొందేవారికి అదే రోజున గ్రాట్యుటీతోపాటు ఇతర ఆర్థిక ప్రయోజనాలు కూడా అందజేస్తామని తెలిపారు. ఉద్యోగ విరమణతో బాధపడకుండా ఇతర వ్యాపకాల్లో నిమగ్నం కావాలన్నారు. అనంతరం వారికి విడ్కోలు పలుకుతూ ప్రభుత్వ వాహనాల్లో గౌరవంగా ఇంటికి పంపించారు. కార్యక్రమంలో ఈఈ రామన్, ఏసీపీ శ్రీహరి, డీఈ జమీల్, ఏఈ మీర్, ఆర్ఓ ఆంజనేయులు, అకౌంట్స్ ఆఫీసర్ రాజు, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, ఆరఐ శంకర్ రావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.