కార్పొరేషన్, నవంబర్ 14 : ‘బాల సదనం చిన్నారుల ముఖాల్లో ఆనందం చూడాలన్నదేమా ప్రధాన ఉద్దేశం. వారి భవిష్యత్తు కోసమే సకల సదుపాయాలతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నాం’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్‌లోని 42వ డివిజన్ నెహ్రూ చౌరస్తా సమీపంలోని బాల సదనం భవనం ఆవరణలో 2 కోట్ల నిధులతో నూతన భవన నిర్మాణానికి మేయర్ వై సునీల్‌రావుతో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. బాల సదన్ భవనం శిథిలావస్థకు చేరడంతోనే బాలల భవిష్యత్తు, వారి రక్షణే ధ్యేయంగా తాను మంత్రిగా ఉన్నప్పుడే నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. స్మార్ట్‌సిటీ కింద కోసం 2 కోట్ల కేటాయించామన్నారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో కొంత ఆలస్యం జరిగిందని, కానీ, ఈ రోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా బాల సదన్ నూతన భవనానికి భూమిపూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. నూతన భవనాన్ని సకల వసతులతో నిర్మిస్తామని, జీప్లస్ వన్ పద్ధతిలో గ్రౌండ్ ఫ్లోర్లో రెండు అతిపెద్ద పడక గదులు, జ్యూడిషియల్ రూం, రిక్రియేషన్ రూం, కిచెన్, టాయిలెట్ బ్లాక్స్, లైబ్రరీ, ఆఫీస్ రూం, రెసిడెన్స్ చార్జ్ రూం, డైనింగ్ హాల్, స్టోర్ రూం, ఫస్ట్ ఫ్లోర్లో సిక్ రూం, పడక గదులు, తదితర అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అంతకుముందు బాల సదన్‌కు వచ్చిన ఎమ్మెల్యే కమలాకర్, మేయర్ సునీల్‌రావుకు చిన్నారులు గులాబీ పూలు ఇచ్చి స్వాగతం పలుకగా, వారికి ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, కార్పొరేటర్లు మేచినేని వనజ అశోక్‌రావు, ఐలేందర్, శ్రీకాంత్, వాల రమణరావు, నాయకులు కోల సంపత్ తదితరులు పాల్గొన్నారు.