Putta madhukar | మంథని, ఏప్రిల్ 5: దళితుల ఆకలి తీర్చిన గొప్ప వ్యక్తి బాబూ జగ్జీవన్ రామ్ అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కొనియాడారు. భారత మాజీ ఉప ప్రధాన మంత్రి బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మంథనిలోని ఆయన విగ్రహానికి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆనంతరం పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. ఏళ్ల తరుబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మహానీయుల చరిత్రను ప్రజలకు తెలియకుండా చేసిందన్నారు.
2014లో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే పార్టీలతో సంబంధం లేకుండా సమాజం కోసం పోరాటం చేసిన బాబూ జగ్జీవన్ రామ్, పీ.వీ.నర్సింహారావులతో పాటు ఎంతో మహానీయుల చరిత్ర నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాలనే ఉద్ధేశ్యంతో వారి విగ్రహాలను ఏర్పాటు చేశానని గుర్తు చేశారు.
ఈ నియోజకవర్గ ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న వ్యక్తి కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే మహానీయుల విగ్రహాలను వాడుకున్నారన్నారు. ఎన్నికలు వస్తే ఒకలాగా.. ఎన్నికల అయి పోయిన తరువాత మరోలాగా ఉంటున్నారన్నారని ఏద్దేవా చేశారు. మంథనిలో తాము ఏర్పాటు చేయించిన మహానీయుల విగ్రహాలను తాకవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆదేశాలు ఇస్తూ ఈ నియోజకవర్గంలో నేటికి మహానీయుల విగ్రహాలను అపహాస్యం చేస్తున్నారన్నారు. తాము పెట్టిన మహానీయుల విగ్రహాలను తాకకున్నా పర్వాలేదు కానీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా.. మంథని ప్రాంతంలో ఒక్క మహానీయుడి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు.
తనను ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో మంథని నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. 1800 సంవత్సరంలోనే చదువుల గురించి ఆలోచించిన మహాత్మాజ్యోతిబా పూలే, ఓటు విలువ చెప్పడంతో పాటు ఓటు హక్కు కల్పించిన మహానీయుడు డాక్టర్ బీఆర్. అంబేద్కర్ లాంటి ఎందరో మహానీయుల చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉందన్నారు.
ఈ నెల 11నుంచి 5 రోజుల పాటు మహానీయుల దీక్ష చేపడుతాం
ఎవరు మనం కోసం పని చేశారు.. ఎవరు మనల్ని వాడుకుంటున్నారనే అనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ప్రతీ ఏడాది నిర్వహించినట్టుగానే ఈ నెల 11 నుంచి మహానీయుల దీక్షను స్వీకరిస్తున్నట్లు పుట్ట మధూకర్ తెలిపారు. 5 రోజుల పాటు డ్రెస్ కోడ్‌తో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మహానీయుల దీక్ష నిర్వహిస్తూ ప్రజలకు మహానీయుల చరిత్ర వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్స్ నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, ఎక్కటి ఆనంతరెడ్డి, వెల్పుల గట్టయ్య, మంథని లక్ష్మణ్, ఆరెపల్లి కుమార్, ఆకుల రాజబాబు, గొబ్బూరి వంశీ, ఎరుకల రవితో పాటు అధిక సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.